క్రికెట్ ధన యజ్ఞంలో సమిధలు ఆటగాళ్లు


carrot and stickకేరళ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ లో దొరికిపోయాడు. అతనితో పాటు రాజస్ధాన్ రాయల్స్ కి చెందిన మరో ఇద్దరు ఆటగాళ్లను ఢిల్లీ పోలీసులు గురువారం తెల్లవారు ఝామున అరెస్టు చేయడంతో ఐ.పి.ఎల్ స్పాట్ ఫిక్సింగ్ విషయాలు బైటికి వచ్చాయి. ఏప్రిల్ నుండే తాము ఆటగాళ్ల పైనా, బుకీల పైనా నిఘా పెట్టామని వారిని తప్పులు చేయనిచ్చి అరెస్టు చేశామని పోలీసులు సగర్వంగా, సంచలనాత్మకంగా ప్రకటించారు. జాతీయ జట్టు కెప్టెన్ ధోనీయే కుట్ర చేసి తమ అబ్బాయిని ఇరికించాడని శ్రీశాంత్ తల్లిదండ్రులు ఆరోపించగా, దానిని పోలీసులు కొట్టిపారేశారు.

ఎలా ఫిక్సింగ్ చేశారో, ఎంతెంత ఆటగాళ్లకు దక్కాయో, ఫిక్సింగ్ కు ఏయే కోడ్ లు బుకీలు, ఆటగాళ్లు పెట్టుకున్నారో తదితర విషయాలను పత్రికలు చెప్పేసాయి. బి.సి.సి.ఐ పెద్దలు శ్రీశాంత్ కు జీవిత కాల నిషేధం విధించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కన్నంలో వేలితో దొరికిపోయారు గనక నిందితులకు  ఏదో ఒక శిక్ష పడవలసిందేనేమో, అదో విషయం.

కానీ ఐ.పి.ఎల్ జరుగుతోంది ఎందుకు? అది పుట్టిందే డబ్బు కోసం. దేశ దేశాల నుండి ఆటగాళ్లను రప్పించి సంతలో పశువుల్లా వేలం పాటలు పెట్టి కొనుక్కొని ఎడతెరిపి లేని క్రికెట్ ఆడిస్తున్నదే డబ్బు కోసం. ఐ.పి.ఎల్ లో డబ్బు తప్ప నిజమైన క్రికెట్ ఆట లేదని అనేకమంది మాజీ క్రికెటర్లు ఇప్పటికే అనేకసార్లు వాపోయారు. వారిని పట్టించుకున్నవారు లేరు. క్రికెట్ దేవుడి దగ్గర్నుంది రంజీ ప్లేయర్ దాకా ఐ.పి.ఎల్ ధన యజ్ఞంలో మునిగి తేలుతుంటే సాక్ష్యాత్తూ కేంద్ర మంత్రి, ప్రతిపక్ష నాయకులు ఏదో రూపంలో భాగస్వామ్యం వహిస్తున్నారు.

ఇంత డబ్బు రంధి పుట్టించాక అది ఎక్కడితో ఆగాలి? బంతి విసరడం ఎలాగ, తిప్పడం ఎలాగా, దాన్ని బాదడం ఎలాగ… ఇత్యాది ఆలోచనలలో ఆటగాళ్లను ముంచేసి, వారొక మర మనుషులుగా, డబ్బు ఉత్పత్తి చేసే యంత్రాలుగా మార్చివేశాక, ఆ డబ్బులో తమకు న్యాయమైన వాటా దక్కాలని ఆటగాళ్లు కోరుకోవడం సహజం. అది సక్రమమైన పద్ధతిలో దక్కదు అని నిర్ణయించుకున్నాక, తమ ఆటతో బైటి వర్గాలు వందల కోట్లు సంపాదిస్తున్న నేపధ్యంలో, ఏదో విధంగా డబ్బు సొంతం చేసుకోవాలని ఆటగాళ్లు భావించడం సహజం.

ఆట కంటే డబ్బు పై ఆటగాళ్ల దృష్టి పోవడానికి ప్రధాన కారణం ఐ.పి.ఎల్ అధికార వ్యవస్ధ. ఇది ఆటగాళ్ల వీపులపై కూర్చొని స్వారీ చేస్తోంది. వారికి కొద్ది పాటి డబ్బు క్యారెట్ ను ఊరించే విధంగా చూపిస్తూ వివిధ ప్రాంచైజీల డబ్బు దాహాన్ని వారి పై మోపుతున్న ఐ.పి.ఎల్ అధికార వ్యవస్ధ శ్రీశాంత్ కంటే మెరుగైన నైతిక ఆటగాళ్లను సృష్టించగలదా?

2 thoughts on “క్రికెట్ ధన యజ్ఞంలో సమిధలు ఆటగాళ్లు

  1. యువతను పక్క దారి పట్టిస్తున్న పంచదారవిష గులికలలొ సినీమా తో పాటు క్రికెట్‌ ఒకటి. తాము డబ్బు సంపాదించ డానికి ఎంత మంది యువకుల బ్రతుకులు అనగారి పోయినా పరవాలేదు తాము మాత్రం క్రేజిగా బ్రతకాలి అనుకునే సినిమా హిరోలులాగనే ఈ క్రికెట్‌ హిరోలుకూడ.డబ్బు అన్న ఆశను పెంచిన తరువాత ఆ అశ ఎన్ని పిల్లిమొగ్గలైనా ఎస్తుంది. అది పుట్టటమే విషపురుగై పుట్టినతరువాత దాన్ని నుండి న్యాయమాసించ డం ఏ మాత్రం సమంజసం? ఇది సాంరాజ్య వాదం పెంచి పోషిస్తున్న విషనాగు.

వ్యాఖ్యానించండి