గూఢచర్యం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఒక అమెరికా రాయబారిని రష్యా ప్రభుత్వం అరెస్టు చేసింది. తర్వాత విడుదల చేసి వెంటనే దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. అనంతరం అమెరికా రాయబార కార్యాలయం ప్రధాన రాయబారిని విదేశాంగ కార్యాలయానికి పిలిపించుకుని తన నిరసన తెలియజేసింది. ‘ప్రచ్ఛన్న యుద్ధం’ ముగిసిందని ప్రకటించినప్పటికీ అమెరికా, రష్యాల మధ్య గూఢచర్యం ఇంకా చురుకుగా కొనసాగుతోందనడానికి తాజా బహిష్కరణ మరొక సూచిక. రెండేళ్ల క్రితం అమెరికాలో గూఢచర్యం చేస్తున్నారని ఆరోపిస్తూ అరడజనుకు పైగా రష్యా పౌరులను అమెరికా అరెస్టు చేసి సుదీర్ఘ కాలం పాటు జైలు శిక్ష వేసి అనంతరం రష్యాకు అప్పగించింది.
రష్యాలోని అమెరికా రాయబార కార్యాలయంలో రాజకీయ విభాగంలో మూడో కార్యదర్శిగా పని చేస్తున్న రేయాన్ ఫోగిల్ ను రష్యన్ కౌంటర్ ఇంటలిజెన్స్ అధికారులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. రష్యన్ స్పెషల్ సర్వీసెస్ అధికారి ఒకరిని అమెరికా తరపున గూఢచారిగా నియమించుకోవడానికి ప్రయత్నిస్తూ రేయాన్ దొరికిపోయాడు. ఆయన వద్ద ప్రత్యేకంగా తయారు చేసిన సాంకేతిక పరికరాలు దొరికాయని రష్యా తెలిపింది. పెద్ద మొత్తంలో డబ్బు, అనేక విగ్గులు, మారు వేషాలు కూడా ఆయన వద్ద దొరికాయని తెలుస్తోంది. అమెరికాకు సమాచారం అందిస్తే సంవత్సరానికి 1 మిలియన్ డాలర్లు ముట్టజెపుతామని అమెరికా రాయబారి రష్యా అధికారికి ఆఫర్ ఇచ్చాడు.
రష్యా విదేశాంగ మంత్రి తాజా పరిణామంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బ తింటాయని హెచ్చరించింది. అంతర్జాతీయ టెర్రరిజంపై యుద్ధానికి ఇరు దేశాల అధ్యక్షులు ఒక పక్క సహకరించుకుంటామని ప్రకటిస్తుండగా ‘కోల్డ్ వార్’ తరహా కార్యకలాపాలకు అమెరికా పాల్పడడం ఏమిటని ప్రశ్నించింది. గూఢచర్యానికి పాల్పడిన అధికారి రష్యాలో ‘ఉండకూడని వ్యక్తి’గా రష్యా ప్రకటించింది. వెంటనే దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది.
బహిష్కరణతోనే రష్యా ప్రభుత్వం సరిపెట్టుకోలేదు. అమెరికా రాయబారి మైఖేల్ మెక్ ఫాల్ ను విదేశాంగ కార్యాలయానికి పిలిపించింది. అయితే కార్యాలయంలో మెక్ ఫాల్ తో రష్యన్ మంత్రిత్వ శాఖ ఏమి చెప్పిందీ వెలుగులోకి రాలేదు. విదేశాంగ కార్యాలయం నుండి బైటికి వచ్చాక మెక్ ఫాల్ పత్రికలతో ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయాడని ది హిందు తెలిపింది.
మెక్ ఫాల్ రష్యాలో అమెరికా రాయబారిగా జనవరి 2012 లో నియమితుడయ్యాడు. ఆయన వచ్చినప్పటి నుండి అమెరికా రాయబార కార్యాలయం వార్తల్లో నిలుస్తూ వచ్చింది. వివిధ గూఢచార కార్యకలాపాలు, దేశంలో అసమ్మతిని ఎగదోసే చర్యలు మొదలయిన వాటి ద్వారానే అమెరికా రాయబారులు సాధారణంగా ఆయా దేశాల ఆగ్రహాన్ని చవి చూడడం ఆనవాయితీ. మూడో ప్రపంచ దేశాలనైతే అదిరించి బెదిరించి పనులు చక్కబెట్టుకునే అమెరికా అధికారులు రష్యా, చైనా లాంటి చోట్ల అత్యంత హీనమైన చర్యలను ఆశ్రయిస్తాయి.
మెక్ ఫాల్ రాయబారిగా నియమితుడయ్యాక రష్యాలోని ప్రతిపక్ష కార్యకర్తలను తమ రాయబార కార్యాలయానికి ఆహ్వానించి చర్చలు జరపడం ద్వారా రష్యా ఆగ్రహానికి గురయ్యాడు. హక్కుల కార్యకర్తలను కూడా ఆహ్వానించి విమర్శలకు గురయ్యాడు. కిర్గిస్తాన్ లో అమెరికా సైనిక స్ధావరాన్ని తొలగించడానికి ఆ దేశానికి రష్యా డబ్బు ఇవ్వజూపిందని ఆరోపించి మెక్ ఫాల్ ఒక సారి వార్తల్లో నిలిచాడు. సైనిక స్ధావరం నెలకొల్పడానికి అనుమతించినందుకు డబ్బు ముట్టజెప్పే అమెరికా, వాటిని తొలగించడానికి మరో దేశం డబ్బు ఇవ్వజూపితే నేరం ఎలా అవుతుందో తెలియాల్సి ఉంది. చేసేదే నీతిమాలిన పనులు. అందులో నీతి వెతకడం ఏమి నీతి? నీతి మాలిన పనుల్లో నీతి పాటించాలని బోధలు చెయ్యడం అమెరికా తదితర పశ్చిమ రాజ్యాలకు మామూలు అలవాటే.
పత్రికల వార్తలను బట్టి దశాబ్ద కాలంలో ఒక అమెరికా రాయబార అధికారిని నిర్బంధంలోకి తీసుకోవడం ఇదే మొదటిసారి. అరెస్టయిన రేయాన్ ఎంబసీ ఉద్యోగి అని మాత్రమే అమెరికా విదేశాంగ శాఖ పత్రికలకు తెలిపింది. రష్యాలో ఆయన బాధ్యతలు ఏమిటన్నదీ వివరించడానికి అమెరికా విదేశాంగ శాఖ నిరాకరించిందని తెలుస్తోంది. సి.ఐ.ఏ కూడా రేయాన్ గురించి చెప్పడానికి నిరాకరించింది. ఈ నిరాకరణే అసలు విషయాన్ని చెపుతోంది. ఒక్కోసారి చెప్పే అంశాల కంటే చెప్పని అంశాలే అసలు విషయాన్ని తెలియజేయడం అంటే ఇదే కాబోలు!

ఇవన్నీ ఆ రెండు దేశాల మధ్య సహజమే