–
ఖైదీ నెం. 1: వాల్ స్ట్రీట్ లో బిలియన్లు దొంగిలించినందుకు నాకు 3 నెలలు వేసారు!
కేడీ నెం. 1: కొన్ని జాయింట్లు నా దగ్గర దొరికాయని నాకు 3 సంవత్సరాలు వేశారు!!
–
అమెరికాలో వాల్ స్ట్రీట్, బ్రిటన్ లో ‘ద సిటీ (ఆఫ్ లండన్)’, ఇండియాలో దలాల్ స్ట్రీట్… ఇత్యాది బజార్లలో సామాన్యులకు ప్రవేశం దుర్లభం. గోల్డ్ మెన్ గజదొంగలకే ఇక్కడ ప్రవేశం. సెకన్ల వ్యవధిలోనే షేర్ల కదలికల్ని ప్రభావితం చేసి మిలియన్ల డాలర్లను పిండుకోగల షేర్ మార్కెట్ల షార్క్ లకు ఇక్కడ ఎర్ర తివాచీలు పరచబడతాయి.
షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టి రెట్టింపు రిటర్న్స్ వస్తాయి కదా అని నెలల తరబడి ఆశగా ఎదురు చూసే మధ్య తరగతి బడుగు బతుకుల ఆవిరి ఆశల గురించి కాదు మనం మాట్లాడుకుంటున్నది.
‘టెక్నికల్ గ్లిచ్’ అని చెబుతూనే రాగి తీగల్లోని బైట్ల ప్రవాహంలో బిలియన్ల డాలర్లను మడిచి కుక్కగల వారెన్ బఫెట్ ల గురించీ, 12 యేళ్ళ వయసు నుండే ఒకటి పక్క మూడంచెల సున్నాలను పెంచుకుంటూ పోగలిగిన కార్లోస్ స్లిమ్ ల దర్జా దోపిడిల గురించీ మనం మాట్లాడుతున్నాం!
‘ద సిటీ’లో అంతర్జాతీయ బ్యాంకుల వడ్డీ రేటు లిబర్ ను తనకు అనుకూలంగా ప్రభావితం చేసి లక్షలాది మదుపరులను పిచ్చోళ్లను చేసిన గోల్డ్ మెన్ గజదొంగ ‘గోల్డ్ మేన్ సాచ్’ లాంటి వాల్ స్ట్రీట్ కంపెనీలకు విధించిన శిక్ష: వందల బిలియన్ల డాలర్ల బెయిలౌట్లు. (1 బిలియన్ = 100 కోట్లు; 1 డాలర్ = రు. 54+)
ఇష్టారీతిన గ్యారంటీ లేని సబ్ ప్రైమరీ హౌసింగ్ రుణాలు ఇచ్చేసి, ఆ రుణాలను తాము కొనేసి (!), మిలియన్ల లోన్లు గుదిగుచ్చి, కలిపి మరాడించి, ‘కోలేటరల్ డెట్ ఆబ్లిగేషన్స్’ గా చిత్రిక పట్టి, ‘క్రెడిట్ డీఫాల్ట్ ఆప్షన్స్’ గా తిరగేసి మరగేసి, అందమైన సుగంధ పూరిత బాండ్ పేపర్లుగా మదుపరులకు అంటగట్టగలిగే సూటు, బూటు బడా నేరస్ధులైన నేటి దొరలకు శిక్ష: ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్, డబ్ల్యూ.టి.ఓ, యు.ఎన్ ల ఆకాశహర్మ్యాల అద్దాల గదుల్లో విశ్రాంత పదవులు.
టాటా, అంబానీలకు ఆయిల్ బావులు, బొగ్గు గనులు రాసిచ్చి చెమటోడ్చే కూలి బిడ్డలకు రోజుకు వంద రూపాయలు గ్యారంటీ చేసే ఉపాధి హామీ పధకాల్ని విదిల్చే సోనియమ్మలు ఈ దేశ పేద ప్రజల పాలిట నడిచొచ్చే దేవతలు. అనేకమంది బడా భూస్వామ్య మేతావులకు ఈ పధకం కూలి రేట్లను పెంచే పనికిమాలిన పధకం. ఇంకొందరికి వ్యవసాయ ఖర్చులు పెంచే ‘పుష్ ఫ్యాక్టరే’ తప్ప జి.డి.పి వృద్ధిని పెంచే ‘పుల్ ఫ్యాక్టర్’ కాదు.
పని తెలియక, పొట్ట నిండక, కడుపాకలి తీర్చుకోడానికి చేతులు సాచి తిరిగే అనాధ బిడ్డలు ‘అడుక్కు తినే వెధవలు.’ నాలుగు పైసలు మిగులుతాయన్న ఆశతో ఎలాగోలా పాప్ కార్న్ పాకెట్లు కొనిపించే పిల్లకాయలు ‘మోసకారులు, గుండెలు తీసిన బంట్లు.’
వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ నిరాకరిస్తూ సుప్రీం కోర్టు “లోతైన కుట్రలతో కూడి ప్రజాధనానికి భారీ నష్టాలు తెచ్చే ఆర్ధిక నేరాలను దేశ ఆర్ధిక వ్యవస్ధను దెబ్బతీసే తీవ్ర నేరాలుగా పరిగణించాలి. అవి దేశ ఆర్ధిక ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదకరం” అని వ్యాఖ్యానించింది.
మరి కాదా?
