పాక్ ప్రభుత్వానికి మన్మోహన్ స్నేహ హస్తం -కార్టూన్


The Hindu

The Hindu

ఇటీవల ఎన్నికల్లో నెగ్గిన నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్ధాన్ నూతన ప్రభుత్వానికి ప్రధాని మన్మోహన్ తన స్నేహ హస్తాన్ని చాచారు.

                                                       —-వార్త

పాకిస్ధాన్ లో అలా ఎన్నికలు ముగిశాయో లేదో ఇలా భారత ప్రధాని ఇంకా ఏర్పడని నూతన ప్రభుత్వానికి స్నేహ హస్తం చాచారు. ఇన్నాళ్లూ పాకిస్ధాన్ ని పాలించిన ఆసిఫ్ జర్దారీ అధ్యక్షరికంలోని పాకిస్ధాన్ పీపుల్స్ పార్టీ ప్రభుత్వంలో కొరవడిందీ, నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్ధాన్ ముస్లిం లీగ్ (నవాజ్) పార్టీ ఏర్పాటు చేయనున్న కొత్త ప్రభుత్వానికి అదనంగా మొలిచిన కొమ్మూ ఏమిటో ప్రధాని మన్మోహన్ ఇంకా ఏమిటో వివరించలేదు.

భారత సైనికుడి తలను పట్టుకుపోయారన్న కారణంతో ‘పాకిస్ధాన్ తో సంబంధాలు ఇక మునుపటిలా ఉండబోవు’ అని ప్రధాని మన్మోహన్ ప్రకటించేశారు. అదీ పత్రికలు అడగంగా, అడగంగా, ప్రతిపక్షాలు, ముఖ్యంగా బి.జె.పి విమర్శలు చేయంగా, చేయంగా ఎప్పటికో రెండు వారాల తర్వాత ఆ ప్రకటన చేశారాయన. కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో సదరు పాపం పరిహారం అయినట్లేనా? నవాజ్ షరీఫ్ విధానం ఏమిటో, భారత్ పట్ల ఆయన వైఖరి ఏమిటో తెలియకుండానే స్నేహ హస్తం చాస్తూ ఆయనని ఇండియాకి ఆహ్వానించడం తొందరపాటు చర్య అని బి.జె.పి అప్పుడే ఓ విమర్శ పారేసింది.

సైనికుడి హత్య, తలను పట్టుకుపోవడం దరిమిలా దేశంలో రెచ్చగొట్టబడిన కృత్రిమ భావోద్వేగాల పర్యవసానంగా ప్రధాని చేసిన ‘సంబంధాల’ ప్రకటన బి.జె.పి ఒత్తిడి వల్లనే అని పత్రికలు విమర్శించాయి. అసలు దేశాన్ని పాలక పక్షం పాలిస్తోందా లేక ప్రతిపక్షం పాలిస్తోందా అని కూడా కొందరు అనుమానం వ్యక్తం చేశారు. బి.జె.పి గొడవ వలన పార్లమెంటులో ఏ చర్చా జరగకపోవడం, సభ జరగడానికి ప్రతిపక్షాలను కాళ్ళూ గడ్డాలు పట్టుకుని బతిమాలడం, ఆనక కొన్ని షరతులతో సభను కొద్ది రోజులు నడపడం, మళ్ళీ తనను మాట్లాడనివ్వలేదంటూ లోక్ సభ్ నాయకురాలు సుష్మా స్వరాజ్ ఏ బిల్లు ఆమోదించేది లేదని సమ్మె ప్రకటించి భీష్మించడం, ఆనక సోనియా గాంధీ ఆమెను బతిమిలాడుకోవడం…. ఇవన్నీ ప్రతిపక్షమే పాలక పక్షం అయిందా అన్న అనుమానం కలిగించాయి.

ఇప్పుడు నవాజ్ షరీఫ్ కు మన్మోహన్ అందజేసిన ఆహ్వానం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి. బి.జె.పి ఇప్పటికే తన అనంగీకారాన్ని రికార్డు చేసినందున నవాజ్ షరీఫ్ కు చాచిన స్నేహ హస్తం మళ్ళీ ముడుచుకుపోతుందా, నవాజ్ షరీఫ్ ప్రమాణ స్వీకారానికి మన్మోహన్ హాజరు కానున్నారా… ఈ అంశాలు తేలడానికి కొద్ది రోజులు వేచి చూడాలి.

2 thoughts on “పాక్ ప్రభుత్వానికి మన్మోహన్ స్నేహ హస్తం -కార్టూన్

  1. శేఖర్,
    పాకిస్తాన్ తో స్నేహం,సత్సంబందాల వలన భారత్ కి కలిగే ప్రత్యేక లాభం ఎమిటి? ఎందుకు ఆ దేశం తో ఎక్కువగా స్నేహంగా ఉండాలని మేధావులు కోరుకొంటారు. అన్నిదేశాల మాదిరిగా ఆ దేశం తో సంబంధం ఉంటే సరిపోదా. మీకు తెలిస్తే చెప్పగలరా?

  2. వాసు గారు,

    మేధావుల సంగతయితే నాకు తెలియదు.

    పాక్ నిన్నటివరకూ మన దేశంలో భాగం. అంటే ఒకే జీవన విధానం, సంస్కృతులకు ఇద్దరూ వారసులు (మతం గురించి నేను చెప్పడం లేదు). అలాంటివారితో నెయ్యం ఉండాలి గాని కయ్యం ఎలా సబబు? ఇది ప్రాధమిక ప్రశ్న. సాధారణ ప్రశ్న కూడా.

    రెండు దేశాల మధ్య సంబంధాలు కేవలం ద్వైపాక్షికంగా మాత్రమే పరిమితం ఐ ఉంటాయనుకుంటే పొరపాటు అని నా భావన. ప్రపంచంలో విభిన్న వైరి శిబిరాలు ఉండి పరస్పరం ప్రభావం కోసం ఘర్షణ పడుతూ దేశాలకు దేశాలనే కబళిస్తున్న స్ధితిలో భారత్ – పాక్ వైరం కూడా అందులో భాగంగానే చూడాలి. ఈ వైరం వెనుక స్వార్ధ ప్రయోజనాలు నెరవేర్చుకుంటున్న దేశాలు ఉన్నాయి. వారి ఆటలో పాక్, ఇండియాల పాలకులు పావులు. పావులుగా ఉండడానికి వారికేమీ అభ్యంతరం లేదు. కాని దానివల్ల అంతిమంగా చెడుతోంది ప్రజలు. కనుక ప్రజల దృష్టికొణంలో చూస్తే పొరుగు దేశంతో స్నేహ సంబంధాలు ఎప్పుడూ ఉపయోగమే.

    మామూలు మాటల్లో చూస్తే: ఇరుగు, పొరుగు అని ఎందుకన్నారు? అదే సూత్రం జనరల్ గా పాక్ తో సంబంధాలకూ వర్తిస్తుంది. దీనికి పెద్దగా లాజిక్ తో పని లేదు.

వ్యాఖ్యానించండి