రేటింగ్ కంపెనీలు: అమెరికాకి పోటీగా చైనా రంగంలోకి


AAAఅమెరికా రేటింగ్ కంపెనీలకు పోటీగా చైనా తన స్వంత రేటింగ్ కంపెనీని రంగంలోకి దించుతోంది. దశాబ్దాలుగా మార్కెట్ ఎకానమీ దేశాలలో రేటింగ్ కంపెనీల మార్కెట్ ను శాసిస్తున్న మూడు అమెరికా కంపెనీలకు ఇప్పటి వరకు మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. స్టాండర్డ్ & పూర్ (ఎస్ & పి), మూడీస్, ఫిచ్… ఈ మూడు క్రెడిట్ రేటింగ్ కంపెనీలదే ఇప్పటివరకు రేటింగ్ లను జారీ చేయడంలో ఇష్టారాజ్యం.

ఆర్ధికంగా అమెరికాకు పోటీగా ఎదిగిన చైనా క్రమ క్రమంగా సకల మార్కెటింగ్ రంగాలలో తనదైన ముద్ర వేయడానికి ఉవ్విళ్ళూరుతోంది. ఇటీవల దర్బన్‌లో జరిగిన బ్రిక్స్ కూటమి సమావేశాల్లో చైనా నేతృత్వంలో ‘బ్రిక్స్ బ్యాంకు’కు రూపకల్పన జరిగిన దరిమిలా, తన సొంత రేటింగ్ కంపెనీని రంగంలోకి దించడం చైనా ఈ దిశలో వేసిన మరో అడుగు.

RusRatingఅమెరికాకి చెందిన మూడు రేటింగ్ కంపెనీల రేటింగ్ లు, 2008 ప్రపంచ ద్రవ్య, ఆర్ధిక సంక్షోభం సందర్భంగా తీవ్ర విమర్శలకు లోనయ్యాయి. వివిధ కంపెనీలు, వ్యక్తుల వద్ద డబ్బు తీసుకుని వాటి ద్రవ్య ఉత్పత్తులకు అత్యుత్తమ రేటింగ్ లు ఇవ్వడంతో కంపెనీలు లాభపడగా మదుపుదారులు తీవ్ర నష్టాలపాలయ్యారు. సబ్ ప్రైమరీ ఇంటి రుణాల (చెల్లింపులకు సరైన గ్యారంటీ చూడకుండా ఇచ్చిన రుణాలు) పైన ఆధారపడి వాల్ స్ట్రీట్ కంపెనీలు రూపొందించిన సంక్లిష్ట ద్రవ్య ఉత్పత్తులకు కూడా AAA రేటింగ్ ఇవ్వడం ద్వారా పనికిమాలిన ఉత్పత్తులలో పెద్ద ఎత్తున డబ్బు ప్రవహించేందుకు అమెరికన్ రేటింగ్ కంపెనీలు దోహదం చేశాయి.

ఫలితంగా గ్యారంటీ లేని రుణాల గ్రహీతలు తిరిగి రుణాలు చెల్లించలేకపోవడంతో అది క్రమంగా ప్రపంచ ద్రవ్య, ఆర్ధిక సంక్షోభాలకు దారితీసింది. రుణాలు చెల్లించలేని వారి ఇళ్లను స్వాధీనం చేసుకుని బ్యాంకులు అమ్మకానికి పెట్టిన క్రమంలో, అమ్మే ఇల్లు ఎక్కువ-కొనేవారు తక్కువై ఇళ్ల ధరలు బాగా పడిపోయాయి. దానితో ఇళ్ల రుణాల ఆధారంగా తయారు చేసిన ద్రవ్య ఉత్పత్తులన్నీ దివాళా తీసి వాల్ స్ట్రీట్ కంపెనీలకు సైతం అప్పులు పుట్టక, ఎక్కడికక్కడ డబ్బు బిగదీసుకుపోయి ద్రవ్య సంక్షోభం, దానివెంటే ఆర్ధిక సంక్షోభం సంభవించాయి. అంటే ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో మూడు బడా రేటింగ్ కంపెనీలు గణనీయమైన పాత్ర నిర్వహించాయి.

Egan-Jones-Logoఈ నేపధ్యంలో చైనాకు చెందిన ఒక సంస్ధ రష్యా, అమెరికాలకు చెందిన మరో రెండు సంస్ధలతో కలిసి ఉమ్మడిగా రేటింగ్ సంస్ధను ఏర్పాటు చేస్తున్నదని రష్యా టుడే (ఆర్.టి) ద్వారా తెలుస్తోంది. హాంగ్ కాంగ్ నగరం కేంద్రంగా ‘యూనివర్సల్ క్రెడిట్ రేటింగ్ గ్రూప్’ (యు.సి.ఆర్.జి) ను చైనా ఏర్పాటు చేస్తున్నదని ఆర్.టి తెలిపింది. అమెరికాకి చెందిన రేటింగ్ ఏజన్సీ ‘ఈగన్-జోన్స్ రేటింగ్ కంపెనీ’, రష్యాకు చెందిన ‘రస్ రేటింగ్’ కంపెనీలు భాగస్వాములుగా చైనాకు చెందిన ‘డ్రాగన్ గ్లోబల్ క్రెడిట్ రేటింగ్’ కంపెనీ కొత్తగా యు.సి.ఆర్.జి ని ఏర్పాటు చేస్తున్నది. 20 విశ్లేషకులతో ప్రారంభం అయ్యే ఈ సంస్ధ క్రమంగా 100 మంది ఆర్ధిక విశ్లేషకుల స్ధాయికి అభివృద్ధి చెండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. చైనా-రష్యా-అమెరికా కంపెనీలు ఇందులో ఉన్నందున త్వరితగతిన ఈ కంపెనీ వృద్ధిలోకి రావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అయితే చైనా రేటింగ్ కంపెనీలలో యు.సి.ఆర్.జి మొదటిదేమీ కాదు. గత సంవత్సరం ఆగస్టు నెలలో హాంకాంగ్ ఆధారంగానే ‘చెంగ్ గ్జి’ పేరుతో ఒక రేటింగ్ కంపెనీ ప్రారంభం అయింది. నూతన రేటింగ్ కంపెనీలో అమెరికా, రష్యా దేశాల పాత్ర కూడా ఉండడమే విశేషం.

ప్రపంచ స్ధాయి రేటింగ్ వ్యవస్ధలలో చైనా ప్రభావాన్ని పెంచేందుకే యు.సి.ఆర్.జి ని స్ధాపిస్తున్నట్లు ఆర్.టి తెలిపింది. గుత్తాధిపత్యం వహిస్తున్న అమెరికా రేటింగ్ కంపెనీలకు సవాలుగా ఎదిగే లక్ష్యంతో నూతన సంస్ధ స్ధాపన జరుగుతున్నదని సదరు పత్రిక విశ్లేషించింది. 2008 ఆర్ధిక సంక్షోభంలో అమెరికన్ కంపెనీల పక్షపాత ధోరణి స్పష్టంగా వెల్లడి అయినందున చైనా కంపెనీకి ఆదరణ ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుత రేటింగ్ వ్యవస్ధలు అభివృద్ధి చెందిన దేశాల కోసం పని చేస్తూ మూడో ప్రపంచ దేశాల ఆర్ధిక విధానాలలో సైతం జోక్యం చేసుకుంటున్నాయి. భారత దేశ రాజకీయ వ్యవస్ధ తీరుతెన్నులు, వివిధ రాజకీయ నాయకులు రాజకీయ భావాలను కూడా రేటింగ్ కంపెనీలు చర్చించి తమ ప్రాధాన్యాలను తెలియజేసిన చరిత్ర ఇటీవలి కాలంలోనిదే.

తమ క్రెడిట్ రేటింగ్ కంపెనీ, నూతన రేటింగ్ వ్యవస్ధను నెలకొల్పి తద్వారా ఋణ దాతలకు, ఋణ గ్రహీతలకు మధ్య వాస్తవమైన, సరైన క్రెడిట్ రిస్క్ లను వెల్లడి చేసేందుకు కృషి చేస్తామని యు.సి.ఆర్.జి ప్రతినిధి చెప్పాడని ఆర్.టి తెలిపింది. వివిధ దేశాల నుండి భాగస్వాములను ఒక చోటికి చేర్చి మెరుగైన రేటింగ్ లను అందజేయడం తమ లక్ష్యంగా ఒక భాగస్వామ్య సంస్ధ ఈగన్-జోన్స్ ప్రతినిధి సీన్ ఈగన్ తెలిపాడు. “ఇప్పటి వ్యవస్ధ న్యూయార్క్ కేంద్రంగా పని చేస్తుంది. యు.సి.ఆర్.జి, చైనా, రష్యాల అవగాహనాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. అంటే యు.సి.ఆర్.జి మూడు బడా కంపెనీల కంటే విభిన్నమైన రేటింగ్ ఫలితాలను అందజేస్తుంది” అని సీన్ తెలిపాడు.

వ్యాఖ్యానించండి