కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ బావుటా ఎగరవేయడానికి కారణం ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలియడానికి పెద్దగా రాజకీయ పరిజ్ఞానం అవసరం లేదు. దక్షిణ భారతంలో మొట్టమొదటిసారి బి.జె.పి పార్టీ ఖాతాలో ఒక రాష్ట్ర అసెంబ్లీని చేర్చిన ఘనతను సొంతం చేసుకున్న యెడ్యూరప్ప ఈసారి కూడా గెలుపును, ఓటమిని కూడా ప్రభావితం చేశాడని ప్రతి ఒక్కరికీ తెలిసిన నిజం.
‘కర్ణాటక జనతా పక్ష’ పేరుతో యెడ్యూరప్ప ప్రత్యేక పార్టీయే పెట్టకపోయినట్లయితే కాంగ్రెస్ పార్టీ బహుశా సీట్ల సంఖ్య పెంచుకుని ఉండేదేమో గానీ, అధికారం మాత్రం పొంది ఉండేది కాదు. బి.జె.పి నుండి రెండు ముఠాలు, ఒకటి: యెడ్యూరప్ప, రెండు: గాలి జనార్ధనరెడ్డి లేదా శ్రీరాములు, చీలి వేరు కుంపట్లు పెట్టుకోవడంతో కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద నడక కావడం వాస్తవం.
ఈ వాస్తవాన్ని విస్మరించిన తాజా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పార్టీ గెలుపుకి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మరీ విచిత్రంగా మన్మోహన్ సింగ్ లే కారణమని ప్రకటించారు. ఆ మేరకు ఆయన పత్రికా ముఖంగా కృతజ్ఞతలు కూడా చెప్పుకున్నారు. కానీ నిజానికి ఆయన కృతజ్ఞతలు చెప్పుకోవలసింది, ఆ మాటకొస్తే సిద్ధరామయ్యే కాకుండా సోనియా, రాహుల్ గాంధీలు కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది యెడ్యూరప్పకి.
వరుస అవినీతి కుంభకోణాలతో అన్ని వైపుల నుండి దాడులు, విమర్శలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ కి ఈ రోజు కాస్తంతా ఊపిరి దక్కిందంటే కారణం అది కర్ణాటక గెలుపే. ఆ గెలుపుని బంగారు పళ్లెంలో అప్పజెప్పింది కె.జె.పి, దాని నాయకుడు యెడ్యూరప్ప. అనేక నియోజకవర్గాల్లో అభ్యర్ధులను నిలిపి బి.జె.పి ఓట్లను నిట్ట నిలువన చీల్చిన ఘనత యెడ్యూరప్పది.
కనుక సిద్ధరామయ్య మాత్రమే కాకుండా సోనియా, రాహుల్, మన్మోహన్ లు కూడా యెడ్యూరప్పకు కృతజ్ఞతలు చెప్పుకోవడం న్యాయం. రాజకీయాల్లో న్యాయం ఎక్కడిదంటారా? అయితే, ఓ.కే.
