ఢిల్లీ మెడికల్ విద్యార్ధిని నిర్భయ సామూహిక అత్యాచారం దరిమిలా వెల్లువెత్తిన ప్రజాగ్రహానికి సమాధానం ఇస్తూ ప్రధాని మన్మోహన్ ‘మహిళల రక్షణే తమ ప్రభుత్వానికి ప్రధమ ప్రాధాన్యం’ అని ప్రకటించారు. కానీ ఆయన ఆ ప్రకటన చేసిన పార్లమెంటు భవనానికి నాలుగు కి.మీ దూరం లోపలే వివిధ రాష్ట్రాల నుండి కిడ్నాప్ చేసి తెచ్చిన బాలికల చేత బలవంతపు వ్యభిచారం చేయిస్తున్న అమానుషం వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్ నుండి కిడ్నాప్ చేసి తెచ్చిన టీనేజి అమ్మాయిని బంధించి నెలల తరబడి సామూహిక అత్యాచారానికి గురి చేసినప్పటికీ పోలీసులు, కోర్టు సామూహిక అత్యాచారం కేసు నమోదుకు ఆసక్తి చూపలేదు. ఆయన చర్మం ఎంత మందంగా తగులడిందో గాని, అన్నీ పత్రాలు చూపినప్పటికీ బాలిక తండ్రికి ఆమెను అప్పజెప్పడానికి మేజిస్ట్రేట్ నిరాకరించాడు.
గురువారం ఢిల్లీ పోలీసుల దాడి పర్యవసానంగా వ్యభిచార గృహం నుండి తప్పించుకోగలిగిన అమ్మాయి కోర్టులో సైతం వ్యభిచార గృహ నిర్వాహకుల నుండి బెరింపులను ఎదుర్కోవలసి రావడం బట్టి చట్టం అమలు చేసే వ్యవస్ధల దున్నపోతు చందం ఏ స్ధాయికి చేరిందో స్పష్టం అవుతోంది. అమ్మాయిని కాపాడిన పోలీసులకు నిందితులపై ‘సామూహిక అత్యాచారం’ నేరం మోపడానికి చేతులు రాలేదు. నలుగురికి కనపడకుండా ఉండడానికీ, పోలీసుల రెయిడింగ్ లో పట్టుబడకుండా ఉండడానికీ, జంతు ప్రదర్శనశాలలో జంతువు లెక్కన గోడకు అమర్చిన చిన్నపాటి గదిలాంటి గుహలో అమ్మాయిని బంధించిన విధానం, సాధారణ మనుషుల ఊహలకు అందని పైశాచిక హేలకు నిదర్శనం.
15 సంవత్సరాల అమ్మాయి నరక ప్రయాణం గత ఫిబ్రవరి నెలలో మొదలయిందని ది హిందు పత్రిక తెలిపింది. పత్రిక ప్రకారం 10 వతరగతి బోర్డు పరీక్షలకు ఆ అమ్మాయి సిద్ధపడుతోంది. పశ్చిమ బెంగాల్ లోని దక్షిణ పరగణాల జిల్లాలో గత ఫిబ్రవరిలో ఇంటి బైటికి వచ్చిన అమ్మాయికి ఎవరో నోరు, ముక్కు మూసివేస్తూ ఒక గుడ్డను ఆమె మొఖంపై ఉంచారు. దానితో ఆమె స్పృహ కోల్పోయిందని అమ్మాయితో మాట్లాడడానికి కొద్ది నిమిషాల సేపు అవకాశం చిక్కిన అన్నయ్య ద్వారా తెలిసింది. అమ్మాయిని కాపాడిన అనంతరం ఆమెను తీసుకెళ్లడానికి తండ్రి, అన్నయ్య వచ్చినప్పటికీ వారికి అప్పగించకపోగా, మాట్లాడడానికి సైతం సరైన అవకాశం దక్కలేదని అమ్మాయి సోదరుడు తెలిపాడు.
“ఆమెకు తెలివి వచ్చాక చూస్తే తాను హౌరా స్టేషన్ లో ఉన్నట్లు ఆమె గ్రహించింది. తనతో పాటు తనను కిడ్నాప్ చేసిన వ్యక్తి, ఇంకొందరు యువకులు అక్కడ ఉండడం చూసింది. ఢిల్లీ వెళ్ళే రైలు కోసం తాము ఎదురు చూస్తున్నట్లు వారు ఆమెకు చెప్పారు. ఆమె అభ్యంతరం చెబుతూ మాట్లాడేలోపే మరోసారి ఆమెను మత్తుకి గురి చేశారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళాక మాత్రమే ఆమెకు తెలివి వచ్చింది” అని అమ్మాయి సోదరుడు ఇమ్రాన్ (అసలు పేరు కాదు) తెలిపాడని పత్రిక తెలిపింది.
అప్పటినుండి ఇమ్రాన్ తన చెల్లెలి కోసం ఢిల్లీ సందు గొందుల్లో వెతకడం ప్రారంభించాడు. శక్తివాహిని అనే ప్రభుత్వేతర సంస్ధ సహాయం తీసుకున్నాడు. మే 9 తేదీన పోలీసులతో కలిసి శక్తివాహిని సంస్ధ వాళ్ళు పార్లమెంటుకు 4 కి.మీ దూరంలోపల ఉన్న ఒక బ్రోతల్ ఇంటిపైన దాడి చేశారు. ఆ ఇంట్లో ఒక గోడలో బంధించబడి ఉండగా అమ్మాయిని కనుగొన్నారు. గోడకి ఉన్న చిన్న గుహ లాంటి నిర్మాణంలో ఆమెను బంధించి ఉంచగా పోలీసులు కనుగొన్నారు.
అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాక ఆమెను ప్రతిరోజూ డజను మందికి పైగా అత్యాచారం చేసేవారని తెలుస్తోంది. ప్రతి రోజు ఉదయం నుండి రాత్రి వరకు వచ్చే విటులు ఆమెను బలవంతంగా అత్యాచారం చేయడంతో ఆమె చెప్పలేని నరకం అనుభవించింది. 9 మంది సంతానంలో చివర పుట్టిన ఆ బాలిక అతి గారాబంగా పెరిగిన అమ్మాయి. ఆమెను వెతకడానికి వచ్చిన సోదరుడు తానే తన చెల్లెలిని తన చేతులపై పెంచానని, చివరికి ఇలా చూడవలసి వచ్చిందని పత్రికకు చెబుతూ రోదించాడు. కోట్ల ముబారక్ పూర్ తదితర కాలనీల్లో ఆయన ప్రతి సందు, గొందులోనూ చెల్లెలి కోసం వెతికాడు. ఎవరో ఒక అమ్మాయి దొరికింది అని వార్త వచ్చినప్పుడల్లా అక్కడికి పరుగెత్తేవాడు. తన చెల్లి కాదని తెలిసి నిరుత్సాహపడేవాడు. దుఃఖం తరుముతుండగా దొరికిన వాళ్ళని, వారి బంధువులని తన చెల్లెలి గురించి ఆరా తీసేవాడు.
దొరకక ముందు వరకు ఒక దుఃఖం అయితే దొరికాక మరొక దుఃఖం. ఈసారి చట్టాన్ని అమలు చేస్తున్నామని చెప్పుకునే పోలీసులు, కోర్టుల నుండి. పోలీసులకు అమ్మాయి ఎదుర్కొన్న అమానుషం సామూహిక అత్యాచారంగా తోచలేదు. అమ్మాయితో మాట్లాడడానికి తగిన అవకాశాన్ని ఆమె తండ్రికి, అన్నకు ఇవ్వలేదు. శుక్రవారం డ్యూటీలో ఉన్న మేజిస్ట్రేట్ ముందు అమ్మాయిని హాజరుపరిచారు. అమ్మాయితో పాటు బ్రోతల్ కంపెనీ యజమానులు, ఆమెపై అత్యాచారం చేసిన నిర్వాహకులను కూడా పెద్ద సంఖ్యలో హాజరుపరిచారు. కోర్టు గదిలో ఒక పక్క హియరింగ్ జరుగుతుండగానే బ్రోతల్ యజమానులు, నిర్వాహకులు అమ్మాయి పై బెదిరింపు సాగించారు. తిరిగి బ్రోతల్ వ్యాపారంలోకి రావాలని బెదిరించారు. బ్రోతల్స్ నిర్వాహకులకు ఏ స్ధాయిలో పలుకుబడి, బలం ఉన్నాయో దీన్నిబట్టి అర్ధం అవుతోంది.
ఇంకా ఘోరం ఏమిటంటే అమ్మాయిని ఆమె తండ్రికి అప్పగించడానికి మేజిస్ట్రేటు ఒప్పుకోకపోవడం. తన కూతురిని తనతో పాటు తీసుకెళ్లడానికి తగిన పత్రాలన్నీ ఆయన కోర్టు ముందు ఉంచినప్పటికీ మేజిస్ట్రేట్, తండ్రికి అప్పగించడానికి బదులు ‘నారీ నికేతన్’ కి వెళ్లాలంటూ అమ్మాయికి ఆదేశాలిచ్చాడు. రెగ్యులర్ కోర్టు ఆదేశాలిస్తేనే అమ్మాయిని తీసుకెళ్ళడం వీలవుతుందని తండ్రికి చెప్పాడా మెజిస్ట్రేటు. అమ్మాయి కిడ్నాప్ కి గురికాకుండా చూడడానికి, ఆమె ఇంట్లో, ఆమె ఊరిలో భద్రంగా ఉండడానికి పనికిరాని కోర్టు రూల్స్, బ్యూరోక్రటిక్ రెడ్ టేపిజం ఒక ఆడకూతురిని ఆమె తండ్రికి అప్పగించడానికి అడ్డం రావడం ఒక పెద్ద అభాస. రాజ్యాన్ని ఏలే ప్రభు వర్గాల కోసం ఏర్పాటు చేసిన సూత్రాలు సామాన్య ప్రజలకు ఎందుకు పనికిరావని, పైగా వ్యతిరేకంగానే పని చేస్తాయని చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే.
శక్తివాహిని సంస్ధ ప్రతినిధి ఋషి కాంత్ ప్రకారం అమ్మాయి ఆర్గనైజ్డ్ ట్రాఫికింగ్ రాకెట్ కి బలయింది. ప్రభుత్వంలో ఉన్నత స్ధానాలను ఆక్రమించిన రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్ అధికారులు, పోలీసులు వీరందరి మద్దతు, సహకారం, పోషణ లేకుండా ఇలాంటి ఆర్గనైజ్డ్ మాఫియాలు ఉనికిలో ఉండడం అసాధ్యం. అందుకే కోర్టులోనే నేరస్ధులు ఆ అమ్మాయిని తిరిగి వెనక్కి వచ్చి వ్యభిచారం చేయాలని బెదిరించగలిగారు. ఋషి కాంత్ ప్రకారం ఈ గ్యాంగ్ సభ్యులకు అమ్మాయిలను కిడ్నాప్ చేసి వ్యభిచారం చేయించడం ఒక వృత్తి. ఢిల్లీ బ్రోతల్ యజమానులు, ట్రాఫికర్లు ఒక పద్ధతి ప్రకారం, అత్యంత నైపుణ్యంతో అమ్మాయిలను కిడ్నాప్ చేసి వ్యభిచార కూపంలోకి దింపుతారని, ఎవరూ కనిపెట్టలేని విధంగా అమ్మాయిలను దాచిపెట్టి వ్యభిచారం చేయించడంలో వారు ఆరితేరారని ఆయన తెలిపాడు.
పోలీసులు స్పందనారాహిత్యం, సహకారం వారికి అక్కరకు వస్తున్న విలువైన పెట్టుబడి. అమ్మాయి కనపడడం లేదని ఫిర్యాదు చేసినప్పటికీ పశ్చిమ బెంగాల్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేయలేదు. ఢిల్లీ పోలీసులు కూడా అమ్మాయి దొరికిన తర్వాత మాత్రమే కేసు నమోదు చేశారు. అప్పటికి కూడా సామూహిక అత్యాచారం కేసును వారు నమోదు చేయలేదు. నేర తీవ్రతను వీలయినంత తగ్గించడానికి పోలీసుల ప్రయత్నం లాగా కనిపిస్తోంది తప్ప, బాధితురాలిని కాపాడి, దోషులను శిక్షించడానికి అయినట్లుగా కనిపించడం లేదు.
ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ లో అమ్మాయిల కిడ్నాపింగ్ లు తీవ్రంగా ఉంటున్నట్లు శక్తివాహిని సంస్ధ చెబుతోంది. ఒక్క 2011లోనే దాదాపు 13,429 మైనర్ అమ్మాయిలు బెంగాల్ లో తప్పిపోయినట్లు కేసులు నమోదయ్యాయి. ఇవి కూడా పోలీసుల వరకూ వచ్చిన కేసులు మాత్రమే. ఇంకా చెప్పాలంటే పోలీసులు నమోదు చేయడానికి అంగీకరించిన కేసులు మాత్రమే. మిస్సింగ్ కేసల్లా నమోదు చేస్తూ పోతే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి చెడ్డపేరు. పోలీసు డిపార్టుమెంటుకి కూడా చెడ్డపేరే. చెడ్డపేరు తప్పించుకోవాలంటే అసలు కేసులే నమోదు చేయకుండా ఉంటే సరి. ఫిర్యాదుదారులను నిరుత్సాహపరిచి, బెదిరించి, చీత్కరించి వెనక్కి పంపితే ప్రభుత్వాలకూ, అధికారులకు సేఫ్. జనం మాత్రం మాఫియా గ్యాంగుల పాలబడి అనేకమందికి ఆస్తులు పెంచే యజ్ఞంలో సమిధలుగా మిగిలిపోతారు.
చాలా విచారకర సంఘటన !
ఇంకా విచార కర విషయం ఏమిటంటే , ఇట్లాంటి ర్యాకెట్ లు అనేకం, నిరంతరం గా తమ కార్యక్రమాలు సాగించడం !
దానికి ప్రధాన కారణం , మానవతా విలువలు కోల్పోతున్న పురుషులే ! కృతనిశ్చయం తో పని చేసే ఏ ప్రభుత్వమైనా, దీనిని చాలా వరకూ అరికట్టగలదు !
This is another Suryanelli rape case style incident.