అమెరికా డ్రోన్ హత్యలు అక్రమం -పాక్ కోర్టు


ఫొటో: ది హిందు

ఫొటో: ది హిందు

పాకిస్ధాన్ గిరిజన ప్రాంతాల్లో అమెరికా సైన్యం సాగిస్తున్న డ్రోన్ హత్యలు చట్ట విరుద్ధం అని ఒక పాకిస్ధాన్ కోర్టు తీర్పు ఇచ్చింది. అమెరికా డ్రోన్ దాడులకు వ్యతిరేకంగా పాక్ ప్రభుత్వం, ఐరాస జోక్యం కోరాలని కూడా కోర్టు పాక్ ప్రభుత్వాన్ని కోరింది. అమెరికా తన వీటో అధికారాన్ని వినియోగించినట్లయితే ఆ దేశంతో దౌత్య సంబంధాలను రద్దు చేసుకునే అవకాశాలు పరిశీలించాలని కోర్టు తన తీర్పులో పేర్కొంది. డ్రోన్ దాడులను అంగీకరిస్తూ పాక్ ప్రభుత్వం అమెరికాతో రహస్య ఒప్పందం చేసుకుందని న్యూయార్క్ టైమ్స్ లాంటి పత్రికలు చెబుతున్న నేపధ్యంలో పాక్ కోర్టు తీర్పు ప్రభావం ఎలా ఉండేదీ పరిశీలనార్హం.

అమెరికా మిలట్రీ గూఢచార సంస్ధ, కుట్ర కుతంత్రాలకు పుట్టినిల్లు అయిన సి.ఐ.ఏ టెర్రరిజంపై యుద్ధం పేరుతో ఆఫ్ఘన్-పాక్ సరిహద్దులోని గిరిజన ప్రాంతాలలో హంతక డ్రోన్ లతో క్షిపణి దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో అనేకమంది పాకిస్ధాన్ ప్రజలు చనిపోతుండగా, ప్రజలు వినియోగించే అనేక మౌలిక నిర్మాణాలు ధ్వంసం అవుతున్నాయి. సి.ఐ.ఏ నిర్వహిస్తున్న దాడులకు వ్యతిరేకంగా పెషావర్ హై కోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను విచారించిన హై కోర్టు గురువారం తీర్పు వెలువరించింది.

చీఫ్ జస్టిస్ దోస్త్ మహమ్మద్ ఖాన్ నేతృత్వంలోని ద్విసభ్య బెంచి పిటిషన్లను విచారించింది. ‘మానవ రహిత విమానాలు చేస్తున్న దాడులు చట్ట విరుద్ధం అని ద్విసభ్య బెంచి తన తీర్పులో స్పష్టం చేసింది. దాడులు అమానవీయమని, మానవ హక్కుల పై ఐక్యరాజ్యసమితి ఆమోదించిన ఛార్టర్ కు బద్ధ విరుద్ధం అని పేర్కొంది. డ్రోన్ దాడుల్లో అమాయకులు చనిపోతున్నందున దాడులను యుద్ధ నేరాలుగా ప్రకటించాలని కోర్టు కోరింది.

“భవిష్యత్తులో ఇక ఎప్పుడూ డ్రోన్ దాడులు జరగకుండా పాకిస్ధాన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి” అని కోర్టు తీర్పు పేర్కొంది. అమెరికా డ్రోన్ దాడులకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో పాకిస్ధాన్ విదేశాంగ శాఖ తీర్మానం ప్రవేశపెట్టాలని కూడా తీర్పు కోరింది. “ఒక వేళ అమెరికా ఆ తీర్మానాన్ని వీటో చేసినట్లయితే, అమెరికాతో దౌత్య సంబంధాలను తెంచుకునే విషయాన్ని దేశం ఆలోచించాలి” అని తీర్పు స్పష్టం చేసింది.

ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధం సాగిస్తున్న అమెరికా పాకిస్ధాన్ లోని ఒక రాష్ట్ర హై కోర్టు తీర్పును పట్టించుకుంటుందా అన్నది అనుమానమే. అసలు పాకిస్ధాన్ పాలకులే ఈ తీర్పును పట్టించుకోకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే పాకిస్ధాన్ మిలట్రీ, అక్కడి కోర్టుల మధ్య మిత్రత్వం ఉన్నందున మిలట్రీ స్పందన ఎలా ఉంటుందో చూడవలసి ఉంది.

కాశ్మీర్ మిలిటెంట్లను ముట్టుకోకపోతేనే…

పాకిస్ధాన్ కొండలపై శిక్షణ పొందుతున్న కాశ్మీర్ మిలిటెంట్లను ముట్టుకోనంతవరకు డ్రోన్ దాడులను అనుమతించడానికి పాక్ ప్రభుత్వం అమెరికాతో రహస్య ఒప్పందం కుదుర్చుకుందని గత ఏప్రిల్ లో న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. తమ అణు స్ధావరాల జోలికి కూడా రాకూడదని పాక్ షరతు విధించిందని కూడా సదరు పత్రిక తెలిపింది. ఐ.ఎస్.ఐ, సి.ఐ.ఏ ల మధ్య 2004లో చర్చలు జరిగాయని, ఆ సందర్భంగా డ్రోన్ దాడులకు ఒప్పందం జరిగిందని పత్రిక తెలిపింది.

“గిరిజన ప్రాంతాలపై మాత్రమే డ్రోన్ లు ఎగరాలని పాకిస్ధాన్ గూఢచార అధికారులు నొక్కి చెప్పారు. ఆ విధంగా అమెరికన్లు రాకూడని చోటుకు డ్రోన్ విమానాలు రాకుండా పాకిస్ధాన్ జాగ్రత్త వహించింది. పాకిస్ధాన్ అణు స్ధావరాలు, భారత్ పై దాడులకు కొండ ప్రాంతాలలో కాశ్మీరు మిలిటెంట్లు శిక్షణ పొందే శిబిరాల జోలికి రావద్దని పాక్ కోరింది” అని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. అయితే సదరు పత్రిక అమెరికా, పాక్ ల మధ్య కుదిరిన రహస్య ఒప్పందాన్ని ఎందుకు బైటపెట్టింది? అమెరికా సాగించే దురాక్రమణ యుద్ధాలన్నింటికీ మద్దతు ప్రకటించే న్యూయార్క్ టైమ్స్ పత్రిక అమెరికాను చేసుకున్న రహస్య ఒప్పందాన్ని ఎందుకు బైటపెట్టింది?

US dronesపత్రిక రిపోర్టు లోని ‘భారత్ పై దాడులకు’ అన్న పదబంధం ఈ ప్రశ్నకు సమాధానం చెబుతుంది. ఈ నివేదిక ద్వారా భారత్, పాక్ ప్రజల మధ్య వైరాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం పత్రిక రిపోర్టులో కనిపిస్తోంది. భారత్, పాక్ ప్రజలు, ప్రభుత్వాలు స్నేహ సంబంధాలతో ఉంటే ఇక్కడ అమెరికా, ఐరోపాల సామ్రాజ్యవాద ఎత్తుగడలకు స్ధానం ఉండదు. స్వార్ధ ప్రయోజనాల కోసం అమెరికా సామ్రాజ్యవాద దోపిడీకి సహకరించే భారత్, పాక్ పాలకుల నిజ స్వరూపం కూడా ఇరు దేశాల ప్రజలకు అర్ధం అవుతుంది.

అలా అర్ధం కాకుండా ఉండాలంటే ఇరు దేశాల ప్రజల మధ్య నిరంతర వైరాన్ని పెంచి పోషించడం పశ్చిమ రాజ్యాలకు అవసరం. న్యూయార్క్ టైమ్స్ సో కాల్డ్ వెల్లడి ఇందులో భాగమే. దీనర్ధం అమెరికా-పాక్ ల మధ్య రహస్య ఒప్పందం కుదరలేదని కాదు. రహస్యం వెల్లడి పేరుతో పాకిస్ధాన్ ప్రభుత్వం నుండి వస్తున్న నామమాత్ర వ్యతిరేకతను సైతం లేకుండా చేసుకోవడం, పాక్ ప్రజల ఆగ్రహాన్ని అమెరికాపై నుండి పాక్ ప్రభుత్వం పైకి మరల్చడం పత్రిక వెల్లడిలోని పరమార్ధంగా అంతర్జాతీయ పరిశీలకులు విశ్లేషించారు.

సామ్రాజ్యవాద ప్రయోజనాలు

ఆల్-ఖైదా, తాలిబాన్ టెర్రరిస్టులను చంపడానికే తమ డ్రోన్ దాడులని అమెరికా చెబుతుంది. కానీ డ్రోన్ దాడుల్లో చనిపోయేవారంతా అమాయక ప్రజలేనని అనేక స్వతంత్ర వార్తా సంస్ధలు, పరిశోధకులు అనేక ఉదాహరణల ద్వారా నిరూపించారు. ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధంలో లక్షల మంది ఆఫ్ఘన్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారని వికీలీక్స్ బైటపెట్టిన ‘డిప్లొమేటిక్ కేబుల్స్’ ద్వారా రుజువైంది. కనుక అమెరికా హంతక దాడులకు ‘టెర్రరిజంపై యుద్ధం’ అనేది ఒక ముసుగు మాత్రమే అన్నది స్పష్టమే.

పాక్-అమెరికా (ఐ.ఎస్.ఐ-సి.ఐ.ఏ) ఒప్పందం దరిమిలా అమెరికా సాగిస్తున్న ‘టెర్రరిజంపై యుద్ధం’ లో విపరీత మార్పులు వచ్చాయి. టెర్రరిస్టులను పట్టుకోవడం పైన కేంద్రీకరించకుండా నేరుగా క్షిపణి దాడులు చేసి చంపేయడం ఈ విపరీత మార్పు. ‘చంపేసిన తర్వాత కరుడుగట్టిన టెర్రరిస్టులను చంపాము’ అని ప్రకటిస్తే దానికి ప్రజామోదం లభిస్తోంది. టెర్రరిస్టులు అయితే వారు ఎక్కడున్నా, ఎవ్వరైనా చంపేయ్యోచ్చన్న అలిఖిత, అప్రకటిత ఆమోదాన్ని ప్రజల్లో సంపాదించడంలో పశ్చిమ పత్రికలు అనేక యేళ్లుగా కృషి చేస్తున్నాయి. ఆ మేరకు అవి సఫలం అవుతున్నాయి కూడా.

అమెరికా డ్రోన్ హత్యలు ఆ దేశ బహుళజాతి కంపెనీల సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసమే. ఆఫ్ఘనిస్ధాన్ వ్యూహాత్మకంగా అత్యంత కీలక స్ధానంలో ఉన్నది. ఆఫ్ఘనిస్ధాన్ లో సైనిక స్ధావరం నెలకొల్పి ఆ దేశ పాలకులను గుప్పిట్లో ఉంచుకున్నట్లయితే అటు మధ్య ప్రాచ్యం, మధ్య ఆసియాలతో పాటు దక్షిణాసియాలో కూడా ఒక కన్నేసి ఉంచవచ్చు. ఆర్ధిక పోటీదారుగా ఎదిగి మిలట్రీ బలం పెంచుకుంటున్న చైనాను చుట్టుముట్టే ఎత్తుగడ కూడా అమెరికా వ్యూహంలో ఒక భాగం.

అయితే అమెరికా వ్యూహాలను ఆఫ్ఘన్, పాక్ ప్రజలు వివిధ రూపాల్లో ప్రతిఘటిస్తున్నారు. ఆఫ్ఘన్ జాతీయ శక్తులు సాయుధ ప్రతిఘటనను ఇస్తున్నాయి. పాకిస్ధాన్ ప్రజల్లో అమెరికా వ్యతిరేకత అనేకసార్లు ఉద్యమాల రూపంలో వ్యక్తం అయింది. ఈ ప్రతిఘటన సాయుధ రూపం తీసుకున్నపుడు దానిని ‘టెర్రరిజం’గా అమెరికా ముద్ర వేస్తుంది. తద్వారా టెర్రరిజంపై పోరాడుతున్నానన్న పేరుతో తన సామ్రాజ్యవాద వ్యూహాలకు వస్తున్న ప్రతిఘటనను ఉక్కు పాదంతో అణచివేయడం అమెరికా అనుసరిస్తున్న విధానం. అమెరికా వాస్తవ ప్రయోజనాలు, ఆ ప్రయోజనాల కోసం అది సాగిస్తున్న దురాక్రమణ యుద్ధాలను విస్మరిస్తున్న ప్రజానీకం సమస్యను భారత్-పాక్ వైరంగానూ, కాశ్మీరు టెర్రరిజం గానూ, తాలిబాన్ మతతత్వంగానూ మాత్రమే చూస్తున్నారు. అమెరికాకు కావలసింది కూడా సరిగ్గా ఇదే.

ఈ వ్యూహంలో పాక్ పాలకులు భాగస్వాములు. వారికి కావలసింది తమ స్వార్ధ ప్రయోజనాలే తప్ప పాక్ ప్రజల ప్రయోజనాలు కాదు. అందువలన పెషావర్ కోర్టు తీర్పు ఏ కొద్ది ప్రభావం చూపగలిగినా ఆశ్చర్యమే.

One thought on “అమెరికా డ్రోన్ హత్యలు అక్రమం -పాక్ కోర్టు

వ్యాఖ్యానించండి