వడ్డించేవారు కొట్టుకుంటే… -కార్టూన్


ది హిందు

ది హిందు

‘అదిగో, ఇదిగో’ అంటూ యు.పి.ఏ ప్రభుత్వం ఊరిస్తూ వచ్చిన ‘ఆహార భద్రతా బిల్లు’, ‘భూముల స్వాధీనం  బిల్లు’ ఆమోదానికి నోచుకోకుండానే పార్లమెంటు నిరవధికంగా వాయిదాపడే సూచనలు కనిపిస్తున్నాయి. న్యాయ శాఖ మంత్రి అశ్విని కుమార్, రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సాల్ లు రాజీనామా చేయడమో, లేదా పదవుల నుండి తప్పించడమో జరిగేదాకా పార్లమెంటులో ఏ బిల్లూ ఆమోదం పొందకుండా అడ్డుకుంటామని బి.జె.పి ప్రకటించడంతో ఈ పరిస్ధితి వచ్చింది. బుధవారం సభ ముగిశాక పార్లమెంటు నిరవధికంగా వాయిదాపడుతుందని కేంద్ర మంత్రి రాజీవ్ శుక్లా ఇప్పటికే ప్రకటించారు.

దేశ ప్రజలందరికి ఆహార భద్రతను గ్యారంటీ చేసే బిల్లు ఆమోదం పొందకుండా ఉండడానికి కాంగ్రెస్, బి.జె.పి పార్టీలు కుమ్మక్కయ్యాయని కొందరు ఆరోపిస్తున్నప్పటికీ ఆహార భద్రతా బిల్లు వల్ల ప్రజలకు పెద్దగా ఒరగబోతున్నది కూడా ఏమీ లేదు. అయితే ఏదో ఒక చట్టం ఉంటే దానిని అమలు చేయమని పోరాడడానికైనా అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఇప్పుడు ఉండదు. అంతే కాకుండా, ఆహార భద్రతా బిల్లు చట్టం రూపం దాల్చకపోతే, ఎన్నికల్లో చెప్పుకోడానికి కాంగ్రెస్ కు ఒక ఆయుధం మిస్ అవుతుంది.

కార్పొరేటు కంపెనీలకు మేలు చేకూర్చే ‘భూముల స్వాధీనం’ బిల్లు ఆమోదం పొందకపోతే స్వదేశీ, విదేశీ బహుళజాతి కంపెనీలకు ప్రభుత్వం మొఖం చూపించలేని పరిస్ధితి దాపురిస్తుంది. ప్రజల పేరు చెప్పి తయారు చేసిన ఈ బిల్లు ద్వారా రైతుల చేతుల్లో ఉన్న కొద్దిపాటి భూములు కూడా కార్పొరేటు కంపెనీలకు అప్పజెప్పేందుకు పాలకులకు అవకాశం లభిస్తుంది. కనుక కార్పొరేటు కంపెనీలను సంతృప్తి పరిచి నిధులు బొక్కడానికి కాంగ్రెస్ పార్టీకి ఈ బిల్లు అవసరం.

ప్రత్యామ్నాయ ఉపాధి చూపకుండా కొద్ది మొత్తంలో నష్టపరిహారం ఇచ్చి భూములు లాక్కోడానికి చట్టంలో ఏర్పాట్లు కల్పించారని ప్రజాపక్షపాత సంస్ధలు ఆరోపిస్తున్నాయి. ఈ బిల్లులో భూములపై ఆధారపడి ఉండే కుటుంబాలలోని మహిళలకు తగిన భద్రత కల్పించలేదని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. కానీ ఈ బిల్లు ఆమోదం పొందితే నామమాత్ర పరిహారంతో పెద్ద ఎత్తున భూములు కంపెనీల వశం అవుతాయి.

ఈ రెండు బిల్లుల్లో సవరణలు చేయాల్సి ఉందనీ, కనుక తగిన చర్చ లేకుండా బిల్లులు గుడ్డిగా ఆమోదం పొందడానికి తాము ఒప్పుకోమని బి.జె.పి ప్రకటించింది. తన ప్రసంగాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ సభ్యులను సోనియాగాంధీ రెచ్చగొట్టారని ఆరోపిస్తూ లోక్ సభ ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ అలగడంతో కాంగ్రెస్ కి అదనపు తలనొప్పిగా మారింది. మంగళవారం సుష్మా స్వరాజ్ ను ప్రసన్నం చేసుకోడానికి సోనియా గాంధీ ప్రయత్నం చేసినట్లు పత్రికలు తెలిపాయి. అయినప్పటికీ మంత్రుల రాజీనామాతో బిల్లుల ఆమోదాన్ని ముడిపెట్టడంతో కాంగ్రెస్ గడ్డు పరిస్ధితి ఎదుర్కొంటోంది. చివరి నిమిషంలో ఒప్పందాలు జరిగి బిల్లులు మూజువాణి ఆమోదం పొందినా ఆశ్చర్యం లేదు.

One thought on “వడ్డించేవారు కొట్టుకుంటే… -కార్టూన్

  1. ఎవరు ఎన్ని కార్టూన్లు గీసినా ప్రజలు వాల్లనే కదా కోరుకుంటుంది శేఖర్ గారూ నన్ను ఒకసారి ఉద్యమాలు అంటే పాపం అని భావిస్తున్నావా అని అడిగారు ఉద్యమకారులు(నాయకులు) పైరవీ కారులు గ మారుతున్న సంగతి నిన్న వెలుగులోకి వచ్చింది (కోబ్రా పోస్ట్) మరి పాపం అని భావించాలా లేక పాతకం అని భావించాల లేక ఖర్మ అని బాధపడాలా ???? ఈ ఉద్యమకారులు పైరవీకారులు అంతా చివరికి జనాన్ని బేకారులు గా బికారులుగా మారుస్తున్నారు మరి అది పాపం కాదా ????????????

వ్యాఖ్యానించండి