కోతికి పదవిచ్చి, ఆనక కళ్ళూ నోరు మూసుకుని…. కార్టూన్


The Hindu

The Hindu

బొగ్గు కుంభకోణం కాంగ్రెస్ ప్రధాన నేతలను చుట్టుముట్టినా ఏ ఉపద్రవమూ జరగని విపరీత పరిస్ధితి దేశంలో రాజ్యమేలుతోంది. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ను గట్టెక్కించడానికి న్యాయ మంత్రి అశ్వని కుమార్ కోతి తరహాలో చేసిన ప్రయత్నం చివరికి వారికే ఎదురు తిరిగింది. అశ్వని కుమార్ అహంకార ధోరణితో గాయపడిన సి.బి.ఐ అధికారి ద్వారా కోర్టుకు సి.బి.ఐ సమర్పించిన నివేదికను కోర్టు కంటే ముందు ప్రభుత్వమే చూసి మార్పులు కూడా చేసిందని పత్రికలకు లీక్ కావడంతో యు.పి.ఏ నాయకులు, ప్రధాని మా గొప్ప ఇరకాటంలో పడిపోయారు. ప్రతిపక్షాలు పాలనలో ఉన్న రాష్ట్రాల్లో సైతం అవినీతి మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతుండడమే కాంగ్రెస్ బింకానికి కారణంగా నిలుస్తోంది.

కానీ వామ పక్షాలు, ప్రభుత్వాల ఈ విచ్చలవిడి అవినీతి పైన కనీస ఉద్యమాలు నిర్మించలేని దయనీయమైన పరిస్ధితిలో ఉండడం అత్యంత బాధాకరం.

అశ్వనీ కుమార్, ప్రధాన మంత్రి కార్యాలయం అధికారి, బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారి… ఈ ముగ్గురుతో జరిగిన సమావేశంలో సుప్రీం కోర్టుకు సమర్పించనున్న ‘పురోగతి నివేదిక’ను ప్రవేశపెట్టామని, అందులో సదరు ముగ్గురు మార్పులు కూడా చేశారని సి.బి.ఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా సుప్రీం కోర్టుకు సమర్పించిన తాజా అఫిడవిట్ లో పేర్కొన్నారు. అంతకుముందు అటార్నీ జనరల్ జి.ఇ.వాహనవతి, అడిషనల్ సొలిసిటర్ జనరల్ హరీన్ రావల్ కోర్టుకు తెలిపిన విషయాలకు ఇది పూర్తి విరుద్ధం. ఏ ప్రభుత్వాధికారి, మంత్రి నివేదికను చూడలేదని వారు కోర్టుకు చెప్పింది పూర్తి అబద్ధమని రంజిత్ సిన్హా అఫిడవిట్ మరోసారి స్పష్టం చేసినట్లయింది.

ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ప్రధాని మన్మోహన్ నోరు మెదపడం లేదు. బొగ్గు కుంభకోణం లో తన పేరు వస్తున్నందుకు ‘కనీసం తాను చురుకుగా ఉన్నానని ప్రతిపక్షాలు (ముఖ్యంగా బి.జె.పి) గుర్తించాయని’ ప్రధాని జోక్ కూడా చేశారని పత్రికల సమాచారం. కాంగ్రెస్ మంత్రుల భారీ అవినీతి కుంభకోణాలు పాలకమ్మన్యులకు జోకులుగా మారడం భారత ప్రజల దుస్ధితిని కళ్ళకు కడుతోంది.

అశ్విని కుమార్ పైనా, రైల్వే అధికారికి ముఖ్యపదవిని కట్టబెట్టడానికి లంచం తీసుకున్నాడని తన మేనల్లుడి పై ఆరోపణలు ఎదుర్కొంటున్న పవన్ కుమార్ బన్సాల్ ల పైన చర్యలు తీసుకునేది లేదని ప్రభుత్వం సోమవారం ప్రకటించి తన సిగ్గుమాలినతనాన్ని బోర విరుచుకుని చూపించుకుంది. ఒకరి అవినీతి మరొకరి పదవి కొనసాగడానికి ఆయుధంగా మారుతున్న పరిస్ధితుల్లో ఇక అవినీతికి అంతం ఎలా?

One thought on “కోతికి పదవిచ్చి, ఆనక కళ్ళూ నోరు మూసుకుని…. కార్టూన్

  1. నిజమేనండి…బీజేపీ అంటే తన రాష్ట్రాల్లోని అవినీతి కారణంగా కొంత డిఫెన్స్ లో ఉంది కాబోలు అనుకోవచ్చు.
    కానీ వామపక్షాలకు ఏమైంది… దేశ ప్రజల కోసం కాకున్నా తాము బలపడేందుకైనా భారీ ఉద్యమం చేయాల్సింది కదా..?
    బహుశా అప్పుడే అంత తొందరేముంది. ఎన్నికలకు ఇంకా సంవత్సరం ఉంది కదా, అప్పుడు చూసుకోవచ్చులే అనుకుంటున్నారేమో…?

వ్యాఖ్యానించండి