కులాంతర వివాహం: కూతురిని గోడకి కొట్టి చంపిన తండ్రి


Caste system in Indiaప్రేమ వివాహం చేసుకున్నందుకు తమిళనాడులో ఓ తండ్రి తన కూతురి తలను గోడకేసి కొట్టి చంపేశాడు. తల్లిదండ్రులకు చెప్పకుండా ప్రేమ వివాహం చేసుకుని తమ మానాన తాము బతుకుతున్న జంటను పోలీసులు వెతికి పట్టుకొచ్చి వారి వివాహాన్ని దగ్గరుండి మరీ రద్దు చేశారు. వివాహం రద్దుకు అమ్మాయి, అబ్బాయి ఇద్దరు మనఃపూర్వకంగానే అంగీకరించాని బంధువులు చెబుతున్నారు. పోలీసు స్టేషన్ లో వివాహం రద్దు చేయించి ఇంటికి వచ్చాక కూతురు మళ్ళీ అబ్బాయితో ఫోన్ లో మాట్లాడడం సహించలేని తండ్రి అక్కడికక్కడే ఆమె తలను గోడకి మోది, ఇంకా కసి చావక వెదురు దూలంతో కొట్టి చంపేశాడు. ప్రేమ జంటకు రక్షణగా నిలవడం మాని వివాహం రద్దుకు సాక్ష్యంగా నిలిచిన పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంతా చేసి యువకుడు దళితుడేమీ కాదు. 26 సంవత్సరాల వినోద్ నాయుడు కులానికి చెందినవాడని, అతన్ని ప్రేమించిన పునీత ముతరయార్ (ముదిరాజ్?) కులానికి చెందిన వ్యక్తి అని ది హిందు తెలిపింది. సోమవారం ఉదయం కూతురి పై అఘాయిత్యానికి పాల్పడిన అనంతరం తండ్రి  మురుగనాధం నేరుగా పోలీసు స్టేషన్ కి వెళ్ళి లొంగిపోయాడు. తన దెబ్బలకు కుప్పకూలిపోయిన కూతురు ఇంకా బతికే ఉన్నప్పటికీ ఆమెను అక్కడే వదిలిపెట్టి పోలీసు స్టేషన్ కి వెళ్లడానికే ఆయన ప్రాధాన్యం ఇచ్చాడు. మురుగనాధన్ చెప్పిన తర్వాత హుటాహుటిన ఇంటికి వెళ్ళి చూసిన పోలీసులకు కపాలం చిట్లి, వొళ్ళంతా రక్తం కారుతూ భారంగా ఊపిరి తీసుకుంటున్న పునీత కనిపించింది. ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స ఆలస్యమై చనిపోయింది.

వినోద్ ఒక మినీ బస్సు డ్రైవర్. పునీత తండ్రికి మలేషియాలో ఉద్యోగం. ఇంటివద్ద ఉండే పునీత వినోద్ తో ప్రేమలో పడింది. తల్లిదండ్రులు వివాహానికి అంగీకరించరని భావించిన యువజంట రెండు నెలల క్రితం తిరుపూర్ వెళ్ళి వివాహం చేసుకున్నారు. అక్కడే జీవనం గడపడం ప్రారంభించారు. అయితే పునీత కుటుంబ సభ్యులు వారు ఎక్కడ ఉంటున్నది కనిగట్టగలిగారు. ఏం చెప్పారో ఏమో రెండువారాల క్రితం అమ్మాయిని ఇంటికి తెచ్చారు. మలేషియాలో ఉద్యోగం చేస్తున్న మురుగనాధన్ గత వారాంతంలో ఇండియాకు వచ్చాడు. అంతా కలిసి వేదారణ్యం పోలీసు స్టేషన్ లో పంచాయితీ జరిపారు.

ఆదివారం వినోద్ ని స్టేషన్ కి పిలిపించిన పోలీసులు, అమ్మాయికి కట్టిన తమ సమక్షంలోనే తాళిని తీసివేయించారు. ఆ విధంగా వివాహం రద్దు చేశారు. ఇది అమ్మాయి, అమ్మాయి ఇద్దరు పరస్పరం అంగీకరించాకే జరిగిందని అమ్మాయి తరపు బంధువులు చెబుతున్నారు.  ఆమేరకు ఇద్దరూ రాత పూర్వకంగా తమ సంబంధం రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారని వారు చెబుతున్నారు.

పోలీసుల విడాకులు ముగిశాక అమ్మాయి తరపు వాళ్ళంతా ఇళ్లకు చేరుకున్నారు. ఇతర కుటుంబ సభ్యులంతా వేరే బంధువుల ఇంటిలో ఉండగా తండ్రి, కూతురు ఇద్దరే ఇంటిలో ఉన్నారు. సోమవారం ఉదయం పునీత, వినోద్ తో ఫోన్ లో మాట్లాడడం తండ్రి మురుగనాధన్ చూశాడు. వెంటనే కూతురుతో తగాదా పెట్టుకున్నాడు. అబ్బాయితో సంబంధం తెంచుకుంటానని హామీ ఇచ్చి దానిని ఉల్లంఘించడం పట్ల తీవ్ర ఆగ్రహం ప్రకటించాడు. ఆ కోపంలోనే అమ్మాయి తలని గోడకేసి మోదాడు. అంతటితో ఆగకుండా కర్ర తెచ్చి చితకబాదాడు.

తండ్రి దెబ్బలకు పునీత కపాలం చిట్లిపోయింది. రక్తపు మడుగులో ఉన్న కూతురును అక్కడే వదిలి మురుగనాధన్ వేదారణ్యం పోలీసుల వద్ద లొంగిపోయాడు. ఆయన చెప్పింది విని పోలీసులు హుటాహుటిన ఇంటికి వచ్చి చూడగా పునీత ఇంకా ప్రాణాలతో ఊపిరి తీసుకోవడం గమనించారు. వెంటనే వేదారణ్యం జనరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు నాగపట్టిణం ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. నాగపట్టిణం డాక్టర్లు తమ వల్ల కాదని చెప్పి తిరువారూర్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సలహా ఇచ్చారు. అప్పటికే తీవ్ర రక్తస్రావం అయిన పునీత మార్గమధ్యంలోనే చనిపోయింది.

భారత సామాజిక వ్యవస్ధలో కులం ఇంకా ఎంత వికృత పాత్ర పోషిస్తున్నదో వేదారణ్యం ఘటన స్పష్టం చేస్తోంది. పై కులాల వారు కింది కులాల వారితో సంబంధానికి అంగీకరించకపోవడం అన్యాయం, కులతత్వం అని వాపోతున్న పరిస్ధితుల్లో కింది కులాల వారు సైతం తమలోతాము పరస్పర సంబంధానికి అంగీకరించకపోవడం, ప్రస్తుత ఉదాహరణకు మల్లే పై కులాల సంబంధాన్ని కూడా అంగీకరించకపోవడం బట్టి కులాన్ని బద్దలు కొట్టగలిగే స్ధాయికి భారత దేశంలో ఆర్ధిక సంబంధాలు వృద్ధి చెందలేదని అర్ధం అవుతోంది.

కింది కులాల అస్తిత్వ ఉద్యమాలు సైతం కులాల పునాదులను బలహీనపరచడానికి బదులు మరింత సంఘటితపడడానికి దారితీయడం బహుశా కులానికి ఉన్న బలంగా చూడవలసి ఉంటుందేమో. కుల నిర్మూలన జరగడానికి కులాంతర వివాహాలు విస్తృతంగా జరగాలని ప్రతిపాదించిన అంబేద్కర్ బోధనలు అంబేద్కర్ ను ఆదర్శంగా భావించేవారు కూడా స్వీకరించడం లేదు. సామాజిక మార్పులు కావలసింది బోధనలు, నీతి సూత్రాలు కాదని, కుల పునాదులను బద్దలు కొట్టే విప్లవ కార్యాచరణ నేటి అవసరమని ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉంటాయి.

One thought on “కులాంతర వివాహం: కూతురిని గోడకి కొట్టి చంపిన తండ్రి

  1. చారిత్రక పీడనకు గురి అయిన దలితులకు రాజ్యంగ రక్ష ణ కొరకు రిజర్వేషన్‌ కల్పిం చిన రాజ్యంగ వేత్తలు కుల వ్యవస్త పొవాలి అనుకున్నారా? భవిష్యుతు భారతం పచ్చగా ఉండాలి అనుకున్నారా? అలా పొవాలి అనుకున్నట్లయితె కులం ఒక చారిత్రక క్రమములొ ఏర్పడిందని అధి అలాగే కొనసాగితే వ్యవస్తకు కుంగుబాటు తప్పదని ప్రజల్ని ఎందకు జాగ్రుతం చెయలేక పొయారు? ఆతరువాత వచ్చిన పాలకులు దానికి ఆజ్యం ఎందుకు పొస్తున్నారు. కులవ్యవస్తకు ఒక మతభావాన్ని పూసి ఆమతాన్ని ప్రజల మీద ఎందుకు రుద్దుతున్నారు? క్రమంగా అది వివిద రూపాలు ఎందుకు తీసుకొంటుంది? నివురుగప్పిన నిప్పులా ఉండిన కులవ్యవస్త 1991 తరువాత క్రమంగ ఎందుకు పుంజుకుంటుంది? దలితుల ఐడెంటి కోసం ఆత్మరక్ష ణ కొరకు పో రాడే కొద్ది కులవవ్యవస్త మధ్య యుగాల నాగరికతను ఎందుకు పునికి పుచ్చుకొంటుంది? ఇది ఆర్దిక వ్యవస్త వేసుకుంటున్న ముసుగా? అవుననే చెపుతున్నై ఇటివలె జరుగుతున్న సంఘటనలు. సొంత బిడ్డలని చూడకుండ కడతేరుస్తున్న వీల్లు ఏ నాగరికతకు ప్రతీకలు? మొన్న మీరు రాసిన వ్యసములొ ఉన్న అమెరికా నరమాంస భక్షకులా?

వ్యాఖ్యానించండి