సిరియా ప్రభుత్వ బలగాల వద్ద రసాయన ఆయుధాలు ఉన్నాయని, సామూహిక విధ్వంసక ఆయుధాలుగా ఐరాస వర్గీకరించిన ఈ ఆయుధాలను సిరియా ప్రభుత్వం తిరుగుబాటుదారులపై వినియోగించినట్లయితే అది ‘ఎర్ర గీత’ దాటినట్లేనని అమెరికా అధ్యక్షుడు ఒబామా గత సంవత్సరం హెచ్చరించాడు. కానీ ఐరాస మానవ హక్కుల సంస్ధ ప్రతినిధి, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ప్రాసిక్యూటర్లలో ఒకరు అయిన కార్లా డెల్ పాంటే ప్రకారం సిరియా కిరాయి తిరుగుబాటుదారులే సిరియా ప్రజలపై రసాయన ఆయుధాలు వాడారనేందుకు ప్రాధమిక సాక్ష్యాలు లభ్యమయ్యాయని ప్రకటించడంతో పశ్చిమ రాజ్యాల కుత్సితాలు మరోసారి తేటతెల్లం అయ్యాయి. సిరియాకు ఎర్ర గీత గీసిన అధ్యక్షుడు ఒబామా ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారని అంతర్జాతీయ సమాజం నిలదీయాలి.
స్విస్-ఇటాలియన్ చానెల్ అయిన ఆర్.ఎస్.ఐ తో ఆదివారం మాట్లాడుతూ కార్లా పాంటే “మేము సేకరించిన సాక్ష్యాధారాలను బట్టి తిరుగుబాటుదారులు రసాయన ఆయుధాలు వినియోగించారు. వారు సరిన్ వాయువును వినియోగించారు” అని తెలియజేశారు. సరిన్ వాయువు రంగు, రుచి, వాసన లేని ప్రాణాంతక వాయువు. ఇది పీల్చినవారు నిమిషాల్లో, క్షణాల్లో కాకపోతే, చనిపోవడం ఖాయం. హిట్లర్ పాలనలో నాజీ ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఈ వాయువు ఉత్పత్తి, వాడకాలను ఐరాస నిషేధించింది. కానీ అమెరికా ఐరోపా రాజ్యాలు ఈ వాయువులను నిలవ చేసి పెట్టుకున్నాయి. దానితో ఇరాక్, సిరియా లాంటి దేశాలు కూడా రసాయన ఆయుధాలు నిలవ చేసుకున్నాయి.
రసాయన ఆయుధాలు శత్రు దేశ ప్రజలపైనా, వివిధ వైమానిక దాడుల్లోనూ వినియోగించిన చరిత్ర అమెరికాకే ఉన్నది. వియత్నాం దురాక్రమణ యుద్ధంలోనూ, ఇరాక్ హంతక యుద్ధంలోనూ అమెరికా రసాయన ఆయుధాలు వినియోగించింది. ఇరాక్, ఆఫ్ఘన్ యుద్ధాల్లో అణు అవశేషాలను వినియోగించిన చరిత్ర కూడా అమెరికాకి ఉన్నదని ‘గ్లోబల్ రీసర్చ్’ లాంటి సంస్ధలు తెలియజేశాయి. ఇలాంటి అమెరికా సిరియాకు ‘ఎర్ర గీత’ గీయడమే ఒక జోక్.
సిరియా ప్రభుత్వం వద్ద ఉన్న రసాయన ఆయుధాలు బషర్ అస్సాద్ పై తిరుగుబాటు చేస్తున్న ఆల్-ఖైదా టెర్రరిస్టులకు చిక్కుతాయేమో అని ఇటీవలి వరకు అమెరికా-ఇజ్రాయెల్-ఐరోపాల దుష్ట త్రయం కపట ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చాయి. దానికి కారణం అమెరికా స్వయంగా తిరుగుబాటుదారులకు రసాయన ఆయుధాలు సరఫరా చేయడమేనని వివిధ విశ్లేషకులు తెలియజేశారు. సిరియా ప్రభుత్వం వద్ద ఉన్న రసాయన ఆయుధాలు తిరుగుబాటుదారులకు చిక్కుతాయేమోనని అనుమానాలు వ్యక్తం చేయడం ద్వారా తాము తిరుగుబాటుదారులకు సరఫరా చేసిన రసాయన ఆయుధాలను వినియోగించినపుడు ఆ నెపాన్ని సిరియా పైకి నెట్టివేయడానికి తగిన భూమికను ఏర్పరచుకున్నారు.
ఈ నేపధ్యంలో సిరియా తిరుగుబాటుదారులు రసాయన ఆయుధాలు ప్రయోగించారని సిరియా అధ్యక్షుడు బషర్ అస్సాద్ గత మార్చి నెలలో ఐరాసకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై విచారణ చేయాలని ఆయన ఐరాశాను కోరాడు. అయితే బషర్ అస్సాదే రసాయన ఆయుధాలు వాడాడని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు దేశాలు ప్రత్యారోపణలు చేశాయి. ఈ అంశాలను విచారణ చేయడానికి ఐరాస నలుగురు సభ్యులతో విచారణ కమిటీ నియమించింది. ఈ కమిటీలో కార్లా డెల్ పాంటే ఒకరు. ఆమె ఆదివారం స్విస్-ఇటాలియన్ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తిరుగుబాటుదారులే రసాయన ఆయుధాలను వాడారని చెప్పేందుకు ఆధారాలు దొరికాయని చెప్పడంతో పశ్చిమ దేశాలు ఇరుకున పడిపోయాయి.
కార్లా ప్రకటనను తిరుగుబాటుదారులు ఒక ప్రకటనలో ఖండించాయి. అనేక టెర్రరిస్టు చర్యల ద్వారా సిరియాలో మానవ హననం సాగిస్తున్న తిరుగుబాటుదారుల తిరస్కరణను పశ్చిమ రాజ్యాలు తప్ప మరే దేశమూ నమ్మే పరిస్ధితి లేదు. సిరియా ప్రభుత్వం రసాయన ఆయుధాలు వాడితే అది ‘గేమ్ ఛేంజర్’ అవుతుందని ప్రకటించిన ఒబామా తద్వారా అమెరికా స్వయంగా జోక్యం చేసుకునేందుకు అది సాకు అవుతుందని పరోక్షంగా చెప్పాడు. కానీ తిరుగుబాటుదారులే రసాయన ఆయుధాలు ఉపయోగించినందున అధ్యక్షుడు ఒబామా తల ఎక్కడ పెట్టుకుంటారో తెలియాల్సి ఉంది.
కట్టు కధలు చెప్పడంలో, తిమ్మిని బమ్మిని చేయడంలో పండిపోయిన పశ్చిమ పత్రికలు కార్లా పాంటే వెల్లడిని కప్పి పుచ్చేందుకు వేరే అర్ధాలు లాగేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటివరకు లభించిన ఆధారాలన్నీ తిరుగుబాటుదారుల వైపు వేలెత్తి చూపిస్తున్నాయని చెప్పిన కార్లా ఇంకా పూర్తిస్ధాయిలో రుజువు కావడానికి మరి కొంత సమయం పట్టవచ్చని తెలిపింది. దీనిని ఆసరా చేసుకున్న పశ్చిమ పత్రికలు కమిటీ ఇంకా అంతిమ నిర్ణయానికి రాలేదన్న విషయాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తున్నాయి.
సిరియా ప్రభుత్వం రసాయన ఆయుధాలు ఉపయోగించిందని చెప్పేందుకు తమకు ఆధారాలు దొరికాయని అమెరికా రక్షణ కార్యదర్శి చక్ హేగెల్ గత నెలలో ప్రకటించాడు. అయితే ఆ ఆధారాలను బైటపెట్టడానికి ఆయన ఆసక్తి చూపలేదు. ఆ ఆధారాలు పూర్తిస్ధాయిలో లేవని, అమెరికా జోక్యానికి అవి సరిపోవని హేగెల్ సన్నాయి నొక్కులు నొక్కాడే తప్ప ఆధారాలు వెల్లడించలేదు. మరునాడే బ్రిటన్ కూడా చక్ హేగెల్ ప్రకటనను సమర్ధిస్తూ తమకూ ఆధారాలు దొరికాయని ప్రకటించింది. ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ వద్ద సామూహిక విధ్వంసక ఆయుధాలు ఉన్నాయని తప్పుడు సాక్ష్యాలు సృష్టించి, పచ్చి అబద్ధాలు ప్రచారం చేసిన దేశాలు అమెరికా, బ్రిటన్ లే కావడం ఈ సందర్భంగా గమనార్హం.

తాటిచెట్టు ఎందుకెక్కావంటే దూడ గడ్డికోసం…అని ఎవడో బుకాయించినట్లు అమెరికా అండ్ బ్యాచ్ సిరియాపై దాడికి సంబంధం లేని కారణాలను ఆరోపిస్తోంది. గోతి కాడ నక్క లాగా…ఎలాగైనా సిరియాను అదుపులోకి తెచ్చేందుకు నానా ప్రయత్నాలు చేస్తోంది.