రైట్స్ సోదరులు విమానం కనిపెట్టక ముందు మనిషి గాలిలో ఎగరడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కొందరు ఉత్సాహపరులు పక్షి రెక్కల లాగా అట్టలతో రెక్కలు తయారు చేసుకుని చేతులకు కట్టుకుని కొండలపైకి ఎక్కి దూకడం కూడా చేశారట. అలాంటివారు అనేకమంది చనిపోగా మరి కొందరు వికలాంగులు అయ్యారని చిన్నప్పుడు చదువుకున్నాం.
భారత దేశంలో ధర్డ్ ఫ్రంట్ కోసం ములాయం సింగ్ చేస్తున్న ప్రయత్నాలను అలా రెక్కలు కట్టుకుని పక్షిలా ఎగరాలని ప్రయత్నించడంగా కార్టూనిస్టు పోల్చారు. రెక్కలు కట్టుకుని ఎగరబోయినవారికి ఏ గతి పట్టిందో ధర్డ్ ఫ్రంట్ ద్వారా ప్రధాని కావాలని ప్రయత్నిస్తే రేపు ములాయం సింగ్ కి కూడా అదే గతి పట్టవచ్చని కార్టూనిస్టు సూచన.
రాజకీయ పార్టీలనేవి వివిధ ఆర్ధిక వర్గాల ప్రయోజనాల మధ్య ఏర్పడే వైరుధ్యాలకు కొనసాగింపు. అంటే ఆర్ధిక ప్రయోజనాల మధ్య వైరుధ్యాలు తలెత్తి ఎన్ని ముఠాలు ఏర్పడితే అన్ని రాజకీయ పార్టీలు ఏర్పడతాయి. దేశంలోని ఆర్ధిక వనరులన్నింటినీ కేంద్ర ప్రభుత్వాన్ని అదుపులో పెట్టుకున్న కొద్దిపాటి ధనికులే నియంత్రించడానికి వ్యతిరేకంగా వివిధ రాష్ట్రాల్లో సొంత ప్రయోజనాల కోసం ప్రాంతీయంగా సరికొత్త ధనిక వర్గాలు పుట్టుకొచ్చాయి. ఈ ప్రాంతీయ ధనిక వర్గాల ప్రయోజనాలు అనివార్యంగా కేంద్ర ధనికవర్గాల ప్రయోజనాలతో ఘర్షణ పడతాయి. ఆ ఘర్షణ సంతృప్తికరమైన పరిష్కారానికి దారితీయకపోతే ప్రాంతీయ ధనిక వర్గాలు సొంతగా రాజకీయ పార్టీలు పెట్టుకుంటాయి. అలా పుట్టినవే ప్రాంతీయ పార్టీలు.
ప్రాంతీయ పార్టీల నేతలలో ములాయం ఒకరు. టి.డి.పి, తమిళనాడులోని వివిధ ద్రవిడ పార్టీలు, కేరళలో ముస్లిం మతం ఆధారంగా ఏర్పడిన పార్టీలు, బిజూ జనతాదళ్, శివసేన, ఐ.ఎన్.ఎల్.డి తదితర ప్రాంతీయ పార్టీలన్నీ ఈ కోవలోనివే. ధనిక వర్గాల మధ్య ఆదాయాలు, పెట్టుబడులు, బడ్జెట్ కేటాయింపుల పంపిణిల విషయమై అన్ని గ్రూపులకు సంతృప్తికరంగా వాటాలు దక్కే విధంగా ఒప్పందాలు జరిగితే చీలికలకు, కొత్త ప్రాంతీయ పార్టీల ఆవిర్భావానికి అవకాశం ఉండదు.
కానీ అది అసాధ్యం. కొత్త ధనికవర్గ గ్రూపులు బలం పొందే కొద్దీ మరింత వాటాను డిమాండ్ చేస్తారు. అప్పటికే స్ధిరపడినవారు దానికి అంగీకరించరు. ఫలితంగా ఉన్న పార్టీలు చీలిపోవడం, కుదరకపోతే కొత్త పార్టీలు ఏర్పడడం జరుగుతుంది. ఈ విధంగా దేశంలోని ధనికవర్గం వివిధ ముఠాలుగా చీలిపోవడంతో వారి ప్రభావిత ప్రాంతాల్లోని ఓట్లు కూడా అనివార్యంగా చీలిపోయాయి. దానితో ఏ పార్టీకి మెజారిటి రాని పరిస్ధితి దాపురించింది.
ఈ పరిస్ధితుల్లో కూటమి రాజకీయాలు మొదలైనాయి. అంటే సంపదలు, ఆదాయాల పునర్విభజనకు కొత్త ఒప్పందాలు కుదరడంగా దీనిని చూడాల్సి ఉంటుంది. ఈ విధంగా కొత్తగా ఒప్పందాలు చేసుకోలేక పరిపాలనను గాడితప్పిస్తే, ప్రజలు చైతన్యవంతులై విప్లవాల బాట పట్టడం అనివార్యం. అప్పుడు ఉన్నది కూడా పోతుంది. అందువలన పార్టీలుగా చీలిపోయినా పునః ఒప్పందాల ద్వారా ధనిక వర్గాలు కూటములుగా మళ్ళీ ఐక్యమై శ్రామిక ప్రజలపైన దోపిడీని కొనసాగించడానికి ఏర్పాట్లు చేసుకుంటారు.
ఈ అవగాహనలో చూసినప్పుడు దేశంలోని పార్టీలన్నీ రెండు కూటములు యు.పి.ఏ, ఎన్.డి.ఏ ల కింద ఇప్పటికే విడిపోయి స్ధిరపడిపోయాయి. ఏమన్నా మార్పులు వస్తే ఒక కూటమి నుండి మరొక కూటమిలోకి మార్పులు జరగాలే తప్ప (అలాగే జరుగుతున్నాయి కూడా) ఇంకో కొత్త కూటమి ఆవిర్భావానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
కొత్త కూటమి పెట్టడం అంత సులభం కాదు. దానికి తగిన సైద్ధాంతిక భూమికను ప్రజల ముందు పెట్టాలి. ఎన్.డి.ఏ కూటమిలో మత శక్తులు, వారితో రాజీపడిన బూటకపు సెక్యులర్ శక్తులు ఉండగా, యు.పి.ఏ కూటమిలో లిబరల్ రాజకీయ భావాలు లేదా సెక్యులరిస్టులం అని చెప్పుకునే శక్తులు చేరాయి. వీరిని రాజకీయ భావాల స్కేలు పైన ‘left of the centre’ గా విశ్లేషకులు గుర్తిస్తారు.
ఈ రెండు కూటములకు ప్రత్యామ్నాయంగా వామపక్షాలు మూడో కూటమిని (ధర్డ్ ఫ్రంట్) ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ వారి బలం చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే వారు కూడా కేంద్రంలో అధికారంలోకి రావడానికి 2004లో యు.పి.ఏ కూటమితో జతకట్టక తప్పనంత.
దేవెగౌడ, బిజూ జనతాదళ్ లాంటి వారు ఎప్పుడు ఎటు ఉంటారో తెలియదు. అసలు ములాయం సింగ్ యాదవే ఎప్పుడు ఎటు ఉంటాడో తెలియని పరిస్ధితి. కానీ సి.బి.ఐ కేసులు చూపి అదే పనిగా కాంగ్రెస్ బెదిరింపులకు దిగడం ఆయనకు నచ్చడం లేదు. అలాగని బి.జె.పితో జత కట్టి ముస్లింలకు దూరం కాలేడు. ఈ పరిస్ధితుల్లో ధర్డ్ ఫ్రంట్ అనేది ఉత్త కలగానే ఉంటోంది. అయినా సరే, ధర్డ్ ఫ్రంట్ నిర్మించాలని చూస్తే పరిస్ధితి ఎలా ఉంటుందో కార్టూనిస్టు చెబుతున్నారు.
(ఈ ఆర్టికల్ లో అర్ధం కూడా స్వల్పంగా మారే ముద్రా రాక్షసాలు దొర్లాయి. అందువలన ఎడిట్ చేసి వాటిని సవరించవలసి వచ్చింది.)

అద్బుతమయిన విశ్లేషణ సార్!