చైనా సేనలు వెనక్కి వెళ్లాయోచ్!


Indo China Border 03 యు.పి.ఎ ప్రభుత్వానికి ఒక తలనొప్పి తప్పినట్లుంది. దౌలత్ బేగ్ ఒల్డీ సెక్టార్ లో 19 కి.మీ మేర భారత భూభాగంలోకి చొచ్చుకుని వచ్చాయని ఆరోపించబడిన చైనా సేనలు వెనక్కి వెళ్లిపోయాయి. చైనా చొరబాటుకు ప్రతిగా చైనా సైనిక గుడారాలకు 300 కి.మీ దూరంలోనే మరో శిబిరం ఏర్పాటు చేసిన భారత సేనలు కూడా వెనక్కి వచ్చేశాయని తెలుస్తోంది.

ఉన్నతస్ధాయి చర్చల అనంతరం ఈ ఆకస్మిక పరిణామం జరిగింది. ఇరు సేనలు నాలుగు పతాక సమావేశాలు జరిపినా ముగిసిపోని సంక్షోభం ఇరు ప్రభుత్వాల పెద్దలు మాట్లాడుకోవడంతో ఇట్టే సమసిపోయింది. ఏప్రిల్ 15న ప్రారంభమయిన ఈ సరిహద్దు సంక్షోభం మే 5 నాటికి ముగిసింది. అంటే 20 రోజులు. లడఖ్ ప్రతిష్టంభన త్వరగా సమసిపోవాలని చైనా కోరుకున్న రెండు రోజులకే అది జరిగిపోవడం విశేషం.

వాస్తవాధీన రేఖను దాటి 19 కి.మీ మేరకు చైనా బలగాలు చొచ్చుకుని వచ్చాయని, రావడమే కాక ఐదు గుడారాలు వేసి సెటిలైపోయాయని వార్తలు రావడంతో ఇరు దేశాల సంబంధాలలో ఒక చిన్నపాటి కుదుపు సంభవించింది. చైనా ప్రధాని భారత్ సందర్శించడానికి ముందు ఈ పరిణామం జరగడం పలువురు విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. చైనా ప్రధాని సందర్శనకు ముందు ఉద్రిక్తత ఏర్పరిచే పరిణామం జరగడం మరీ ఆశ్చర్యపరిచింది. భారత్ నుండి తగిన రాయితీ పొందడానికి చైనా ఈ ఎత్తు వేసిందని కొందరు చెప్పారు. కానీ ఏ అంశంలో రాయితీని ఆ దేశం ఆశిస్తున్నదో వారు వివరించలేదు.

బి.జె.పి తదితర ప్రతిపక్షాలు ఈ పరిణామం ద్వారా లబ్ది పొందడానికి ప్రయత్నాలు చేసినా అవి పెద్దగా పారలేదు. ప్రధాని మన్మోహన్ ఈ సమస్యను ‘స్ధానిక సమస్య’గా కొట్టిపారేశారు. చైనా వెళ్ళడం మానుకోవాలని సల్మాన్ ఖుర్షీద్ ని ములాయం లాంటి నాయకులు డిమాండ్ చేశారు. చైనాయే మన ప్రధమ శత్రువు అనేవరకూ ములాయం వెళ్ళడం ఒక వింత. ప్రతిపక్షంలో ఉంటే ఏమైనా మాట్లాడొచ్చు, ఎంత బాధ్యతారహితంగానైనా మాట్లాడొచ్చు అని ఇలాంటి వారిని చూస్తే అనిపిస్తుంది.

ఈ గొడవలు సాగుతుండగానే ఇరు దేశాల మధ్య గతంలో కుదిరిన ఒప్పందం మేరకు ఇరు సైన్యాలు నాలుగు పతాక సమావేశాలు (flag meeting) నిర్వహించాయి. ఈ సమావేశాల్లో ఏదీ తేలలేదు. సమావేశాలు జరపడం షేక్ హేండ్ ఇచ్చుకుని వెనక్కి రావడమే ఈ సమావేశాలు సారాంశం.

ఆదివారం పొద్దు పోయిన తర్వాత ఇరు దేశాల ఉన్నతాధికారుల సమావేశంలో ఒక ఒప్పందం జరిగిందని, దీని ప్రకారం ఇరు సైన్యాలు ఎదురు బొదురుగా ఉన్న చోటి నుండి వెనక్కి వెళ్లిపోవాలని నిర్ణయించారని ది హిందు తెలిపింది. ఈ ఉపసంహరణ సాయంత్రం 7:30 కి పూర్తయిందని కూడా పత్రిక తెలిపింది. స్ధానికంగా ఉన్న భారత్, చైనాల కమాండర్లు షేక్ హేండ్ ఇచ్చుకుని వెనక్కి మళ్లారని తెలుస్తోంది.

అయితే చైనా సేనలు భారత్ భావిస్తున్న వాస్తవాధీన రేఖకు అవతలికి పూర్తిగా వెళ్లిపోతాయా లేదా అన్న విషయం స్పష్టం కాలేదు. అనగా, ఏప్రిల్ 15కి ముందు అవి ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్తాయో లేదో తెలియలేదు. ఈ సెక్టార్ లో వాస్తవాధీన రేఖ వాస్తవంగా ఎక్కడ ఉన్నదన్న విషయంలో ఇరు దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. తాజా రగడకు మూల కారణం కూడా అదే. ఈ భిన్నాభిప్రాయాల విషయం ఏమైందీ కూడా తెలియలేదు. బహుశా కొద్ది రోజుల్లో పూర్తి వివరాలు బైటికి రావచ్చు.

2 thoughts on “చైనా సేనలు వెనక్కి వెళ్లాయోచ్!

  1. సీతాకోక చిలుకలు తేనె టీగలు అవ్వక ముందె వెళ్ళీఫొయారా ……………. mana sakthi choopaalante manam edo avvakkarledu mana maargam manaki telusu …..mana straategy manaki untundi bbc cnn lu nerpinchakkarledu….

  2. ఇంతకీ సి.ఎన్.ఎన్, బి.బి.సి లు నేర్పాయని ఎవరన్నారు సాయి గారు? ఏదో ధోరణిలో రాస్తున్నట్లుంది.

    “మన మార్గం మనకి తెలుసు”…. ఇందులో మన మార్గం అంటే ఏమిటి?

    సీతాకోక చిలుక – తేనెటీగలు అనేది ఒక పోలిక. భారత ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఒక దౌత్య సంకటాన్ని వివరించడానికి ఎంచుకున్న పోలిక. పోలిక పెట్టారు గదా అని దాన్ని ప్రతి సందర్భంలోకి లాక్కురానక్కర్లేదు. పోలికను పోలిక స్ధానంలోనే ఉంచాలి. దాన్ని వాస్తవంలోకి ఈడ్చుకువస్తే వాస్తవం, పోలిక రెండూ అర్ధం కోల్పోతాయి.

వ్యాఖ్యానించండి