శవ పేటికలే చర్చల బల్లలుగా… -కార్టూన్


ది హిందు

ది హిందు

మొట్ట మొదటి బి.జె.పి ప్రధాని అతల్ బిహారీ వాజ్ పేయి కాలంలోనే భారత్-పాకిస్ధాన్ ల మధ్య ద్వైపాక్షిక చర్చలు నిర్మాణాత్మక దృష్టితో ప్రారంభం అయ్యాయని పత్రికలు తరచూ చెబుతుంటాయి. అక్కడ మిలట్రీ పాలకుడు ముషార్రాఫ్, ఇక్కడ మొట్టమొదటి మితవాద ప్రభుత్వం రెండు దేశాల్ని నడుపుతుండగా ప్రారంభమైన చర్చలు వాణిజ్య సంబంధాల్లోకి ప్రవేశించి ఊపందుకుంటున్న సమయంలోనే ముంబై టెర్రరిస్టు దాడుల ఫలితంగా అటకెక్కాయి.

అప్పటి నుండి వివిధ సంఘటనలు, దుర్ఘటనల సాకు చూపుతూ రెండు దేశాలు దూరం జరుగుతూ వచ్చాయి. వరల్డ్ కప్ క్రికెట్ సందర్భంగా ‘క్రికెట్ దౌత్యం’తో దగ్గర కావడానికి ప్రయత్నించినా, ఇంతలోనే సరిహద్దు ఉద్రిక్తతలతో మళ్ళీ దూరం జరిగాయి. పోయి పోయి ఇప్పుడు ఇరు దేశాలు శవ పేటికల వద్ద తేలాయి. ఇరు దేశాల్లోని జైళ్ళలో మగ్గుతున్న ఖైదీల పరిస్ధితులను పరిశీలించడానికి ఇరు దేశాల జడ్జిలతో ఏర్పాటయిన కమిటీ శుక్రవారమే తన నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ఆధారంగా ఖైదీలకు మానవతా దృక్పధంతో చూడడానికి, భద్రతా చర్యలు పటిష్టం చేయడానికి వీలుగా కలిసి కూర్చుని మాట్లాడుకుందామని భారత్ ప్రతిపాదిస్తోంది. అంటే ఖైదీలపై ప్రాణాంతక దాడులు జరిగి ఉద్రిక్తతలు ఏర్పడితే తప్ప దాయాదులు చర్చలకు కూర్చోలేని పరిస్ధితా? ఈ కార్టూన్ ఇదే ప్రశ్న వేస్తున్నట్లుంది.

జమ్ము జైలులో దాడికి గురయిన సనాయుల్లా విషయంలో పాకిస్ధాన్ విచిత్రంగా అంతర్జాతీయ విచారణ డిమాండ్ చేస్తోంది. సరబ్ జిత్ ని విడుదల చేసి ఇండియాకి పంపితే బతికించుకుంటామని భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసినా (నిజంగా బతికి ఉండేవాడా, భారత వైద్యులకు ఆ శక్తి ఉన్నదా లేదా, సరబ్ జిత్ పరిస్ధితి అందుకు అనుకూలంగా ఉన్నదా లేదా తదితర అంశాలు వేరే సంగతి) పట్టించుకోని పాక్ ప్రభుత్వం సనాయుల్లాను పాక్ పంపించాలని డిమాండ్ చేస్తోంది.

యాదృచ్ఛికంగా జరిగిన ఘటనలో పాక్ ఖైదీ గాయపడ్డాడన్న భారత్ వివరణను పాక్ అంగీకరించడం లేదు. దాన్ని అర్ధం చేసుకోవచ్చు. కానీ తాము ఏదైతే సరబ్ విషయంలో నిరాకరించారో అవే డిమాండ్లను పాక్ ప్రభుత్వం లేవనెత్తడంలో ఉద్దేశ్యం ఏమిటి? దీన్నిబట్టి, ఇరు దేశాల ప్రభుత్వాలు ఈ రెండు దుర్ఘటనల పైనా రాజకీయాలు చేసి లబ్ది పొందడానికి చూస్తున్నాయే తప్ప తమ తమ పౌరుల పట్ల నిజమైన బాధ్యతను చూపడం లేదని అనుమానం ఏర్పడుతోంది. ఇరు దేశాల్లోనూ ఎన్నికలు దగ్గర్లో ఉండడంతో నాటకం ఎలా రక్తి కట్టాలో అలానే కడుతున్నట్లు కనిపిస్తోంది.

వ్యాఖ్యానించండి