సూటు, బూటు బడాబాబు దర్జాల మర్మమేమి? -కార్టూన్


The System -Cartoon by Eneko

The System -Cartoon by Eneko

(కార్టూనిస్టు: ఎనెకో లాస్ హెరాస్. వెనిజులా రాజధాని కారకాస్ లో పుట్టిన ఎనెకో ఇప్పుడు స్పెయిన్ లో నివసిస్తున్నారు. ఆయన కార్టూన్లు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయి.)

వ్యవస్ధని మోస్తున్నదెవరు? కష్టపడి వ్యవస్ధని నడిపేది మేమే అని బానిస వ్యవస్ధల కాలంలో బానిసల యజమానులు అన్నారు. ఫ్యూడల్ ప్రభువుల కాలంలో రాజులు, మంత్రులు, సైన్యాధిపతులు, భూస్వాములు, జమీందార్లు… ఇత్యాదిగా గల ప్రభు వర్గాలు తాము లేకపోతే సామాజిక వ్యవస్ధ ఎలా నడుస్తుంది అని ప్రశ్నించారు. పండితులు ‘ఔను కదా!’ అని తలలూపారు.

పెట్టుబడిదారీ వ్యవస్ధ వేళ్లూనుకున్నాక అదే మాటని పెట్టుబడిదారులు అంటున్నారు. ‘మేము లేకపోతే పరిశ్రమలు, డ్యాములు, రోడ్డులు, విమాశ్రయాలు, వంతెనలు, ఆకాశ హర్మ్యాలు ఎక్కడివి?’ అని పెట్టుబడిదారులు ప్రశ్నిస్తున్నారు. వారి ఆస్తులు నిర్వహించే మేనేజర్ ఉద్యోగులు చేతులు కట్టుకుని ‘ఔను నిజం’ అని తలలూపి నాలుగు రాళ్ళు సంపాదిస్తున్నారు.

ఇప్పుడు కూడా కవులు, కళాకారులు, నటులు, నాటక ప్రయోక్తలు యధాశక్తిగా వారికి మద్దతు పలుకుతూ పద్యాలు, కవిత్వాలు రాసి, చదివి, పరవశిస్తూ తమ మాస్టర్లను పరవశింపజేస్తున్నారు. అందుకు ప్రతిఫలంగా పద్మ పురస్కారాలు అందుకుని ‘మా జీవితం ధన్యం’ అని ప్రకటిస్తున్నారు.

‘లిట్ ఫెస్ట్’ లు నిర్వహించడం లేటెస్ట్ ఫేషన్. పల్లెల్లో జాతర్లు జరుపుతారే… అదే తరహాలో, పట్టణాల్లో భారీ ఆడిటోరియంలు ఎంచుకుని దేశ విదేశాల నుండి మహా కవులు, రచయితలు, పాటగాళ్ళు, వాయింపుడుగాళ్ళు… ఇత్యాదులని పిలిచి నాలుగు మాటలు చెప్పించుకుని, వీలయితే పాడించుకుని, ఇంకా వీలయితే మోగించుకుని సంబరాలు జరుపుతున్నారు. వాటికి ‘లిట్ ఫెస్ట్’ (సాహితీ పండుగ) అంటున్నారు.

నిజమేనా? నిఝంగా నిజమేనా? ఏనాడూ వొళ్ళు వంచి కాసింత కష్టం చేయని బాబుగారి బ్యాంకు ఖాతాల్లో కోట్లకు కోట్లు ఎలా వచ్చి చేరుతాయి? వాళ్ళు కొనే షేర్లే ఒకటికి పదింతలు, వందింతలు… అలా పైపైకే ఎలా పోతాయి? కష్టం తప్ప మరొకటి తెలియని కూలీలు, కార్మికులు ఎన్ని యుగాలు చెమట చిందించినా బ్యాంకు ఖాతాలు తర్వాత, జానెడు పొట్టే నిండదెందుకని?

ద్రవ్య పెట్టుబడికి కొత్త విలువ పుట్టించే శక్తి ఉండదు. ఒక లక్ష డాలర్లు గానీ, రూపాయలు గానీ బీరువాలో పెట్టి శతాబ్దాలు గడిపినా వాటికి పిల్లలు పుట్టవు. మొలకెత్తి కరెన్సీ ఆకులు కాయవు.

యంత్రం తనకు తానుగా ఏదీ ఉత్పత్తి చేయదు. ఎవరన్నా దానిపై చేయి వేస్తేనే అది పని చేసేది. మనిషి సాయంతో పని మొదలు పెట్టినా అది తాను తయారు కావడానికి పెట్టిన విలువ కంటే అదనంగా ఒక్క పైసా కూడా ఇవ్వదు. ఇస్తుందిలే అని పని చేయిస్తే రిపేర్ల ఖర్చు పిండుకుంటుంది.

భూమి పైన మొక్క మొలిచినా దానికి కాసే కాయ నడిచొచ్చి గాదెల్ని నింపదు. ఎవరో కొందరు దాన్ని కొయ్యాలి, నూర్చాలి, మోయాలి, దంచాలి. అప్పుడే నోటికి ముద్ద.

ఇన్ని సహజ సూత్రాలు ప్రకృతిని, సమాజాన్ని శాసిస్తుంటే ఏ పనీ చేయని సూటు, బూటు బడాబాబు మడత నలగని దర్జాల మర్మమేమి?

ఒక్కటే మర్మం. అది శ్రమ. సజీవ శ్రమ.

యంత్రంలో ఉండేది నిర్జీవ శ్రమ. అందులో ఎంత ఉంటే అంతే బైటికి వ(ఇ)స్తుంది.

కానీ సజీవ శ్రమ అలా కాదు. సజీవ శ్రమ కడుపు నింపి చూడండి. కడుపు నింపిన విలువకి అనేక రెట్లు విలువని సృస్టిస్తుంది. కడుపు నింపడానికి చెల్లించింది పోగా మిగిలినదే అదనపు విలువ (surplus value).

పొలంలో కూలి, నాగలి పట్టిన రైతు, సుత్తి పట్టిన కార్మికుడు, యంత్రం తిప్పే శ్రామికుడు, పడవ నడిపే సరంగు, ఓడ నడిపే కళాసి, సముద్రాల్ని తవ్వే డ్రిల్లింగ్ కార్మికుడు, ఆఫీసులో రాతగాడు…. ఇలా కోటాను కోట్ల సజీవ శ్రమలు తమ కడుపులు నింపిన విలువకి అదనంగా సృష్టించిన విలువల మొత్తమే బ్యాంకు ఖాతాల్లో, షేరు మార్కెట్లలో, వడ్డీ మారాజుల భోషాణాల్లో, ఆకాశ హర్మ్యాల గోడల్లో, తళుకు బెళుకుల అద్దాల్లో, చలువ రాళ్ళ నునుపుదనంలో, చలిని కాచే ఊలుదారాల్లో, రేసు క్లబ్బుల గడీల్లో, పేకాట క్లబ్బుల మాయాజాలంలో నిండుతోంది. హొయలు పోతూ కులుకుతోంది.

దాని వాస్తవ యజమాని సజీవ శ్రమ. అనగా కష్టం చేసే కార్మికుడు. అతనికి కడుపు నింపే నాలుగు నాణేలు విసిరి మిగిలినదంతా తనదే అని సొంతం చేసుకున్న యజమాని పేరు బానిస వ్యవస్ధల్లో బానిస యజమాని; ఫ్యూడల్ వ్యవస్ధల్లో రాజు, రాణి, జమీందారు, భూస్వామి మొ.; పెట్టుబడిదారీ వ్యవస్ధలో పెట్టుబడిదారుడు.

అదుగో! పైన బొమ్మలో కాళ్ళు బారజాపి విశ్రమిస్తున్నది అతడే. వారిని మోస్తున్నవారే సజీవ శ్రమలు. వారే సూటు, బూటు బడాబాబు దర్జాల అసలు మర్మం.

4 thoughts on “సూటు, బూటు బడాబాబు దర్జాల మర్మమేమి? -కార్టూన్

  1. కార్టూన్‌ ఒక్కటీ ఒక ఎత్తయితే మీ వాక్యానాలు మొత్తం ఒక ఎత్తు. ఈ క్రియేటివిటి అందరికి అందేది కాదు. ఈ వాక్యలు అంధరికి తోచేవి కావు. చాల భాగ చెప్పారు కార్టూన్‌ మీరే ఏసినట్లు!

  2. పొలంలో కూలి, నాగలి పట్టిన రైతు, సుత్తి పట్టిన కార్మికుడు, యంత్రం తిప్పే శ్రామికుడు, పడవ నడిపే సరంగు, ఓడ నడిపే కళాసి, సముద్రాల్ని తవ్వే డ్రిల్లింగ్ కార్మికుడు, ఆఫీసులో రాతగాడు…వీళ్లెవరిని ఎవరూ బ్యాంకుల్లో షేరు మార్కెట్ల లొ ఇంక ఎక్కడో డబ్బులు పెట్టమని ఎవరు చెప్పారు వారి ఆశతో వాల్లు పెడుతున్నారు vaallu అలా ఆ కార్టూన్ లొలాగ తయరు అవుతున్నారు …demand ki tagga supply cheayili kadaa………..

  3. మళ్లీ చాన్నాళ్లకు ఓ ఇంటర్నేషనల్ కార్టూన్ కు మీ వ్యాఖ్యానం చూశాను.
    వీలైనప్పుడల్లా మంచి కార్టూన్ లను అందించండి.
    కార్టూన్ లు కావాలంటే నెట్ లో వెతికితే దొరుకుతాయి. కానీ మీ వ్యాఖ్యానాలు దొరకవు కదా శేఖర్ జీ
    మరిన్ని కార్టూన్ ల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తూ…

వ్యాఖ్యానించండి