ఇపుడు అమెరికన్లుగా కనిపిస్తున్నవారెవరూ నిజానికి అమెరికన్లు కాదు. ఇండియాకి కొత్త దారి కోసం వెతుకుతూ వెళ్ళి అమెరికా ఖండంలో అడుగుపెట్టిన కొలంబస్ ఎర్రగా ఉన్న అమెరికన్లను ‘రెడ్ ఇండియన్లుగా’ పిలిచాడు. ఆ తర్వాత యూరోపియన్లు ముఖ్యంగా ఆంగ్లేయులు అక్కడికి వలస వెళ్ళి అసలు అమెరికన్లను పశ్చిమానికి తరుముకుంటూ పోయి మొత్తం అమెరికా భూభాగాన్ని కబళించారు. చివరికి ‘రెడ్ ఇండియన్లను’ అమెరికాయేతరులుగా చేసేశారు. (అమెరికా తెల్లవారికి మాత్రమే చెందాలనే ‘వైట్ సూపర్ మాసిస్టులు’ కూడా ఉన్నారంటే తెల్లవారి తెంపరితనం అలాంటిది మరి!) ఇది చరిత్ర.
అమెరికాలోనే ప్రఖ్యాతి చెందిన ఆంత్రోపాలజిస్టులు మొట్టమొదటి తెల్లవారు, అనగా ఆంగ్లేయ సెటిలర్లు, నరమాంస భక్షణ కావించారని కనిపెట్టారు. 1609 నాటి దారుణమైన కరువు నుండి బతికి బట్టకట్టడానికి తమ వారినే చంపుకుని తిన్నారని వారు చెబుతున్నారు. చనిపోయినవారి మాంసాన్ని తినడమే కాక బతికి ఉన్నవారిని కూడా చంపి తిన్నారని వారు చెబుతున్నారు. 1609 వసంత కాలంలో తమకు బ్రిటన్ నుండి సరఫరాలు అందే వరకూ వారు అత్యంత గడ్డు పరిస్ధితుల్లో గడిపారని ప్రారంభంలో 300 మంది సెటిలర్లు ఉంటే వారి సంఖ్య సరఫరాలు అందేనాటికి 60 మందే మిగిలారని తెలిపారు.
అమెరికన్ల నరమాంస భక్షణ కొత్తగా వినిపిస్తున్నది కాదు. గతంలోనే ఇవి ప్రచారంలో ఉన్నాయి. ఆ నోటా ఈ నోటా వినడమే తప్ప దానికి సాక్ష్యాధారాలు ఎవరూ వెలికి తీయలేదు. వర్జీనియా రాష్ట్రంలోని జేమ్స్ టౌన్ వద్ద జరిపిన తవ్వకాలలో దొరికిన ఒక కపాలాన్ని విశ్లేషించిన ‘స్మిత్ సోనియన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ’ లోని ఫోరెన్సిక్ ఆంత్రోపాలజిస్టులు అందుకు సాక్ష్యాలు లభ్యం అయ్యాయని తేల్చారు.
14 సంవత్సరాల బాలికదిగా భావిస్తున్న కపాలాన్ని ప్రముఖ ఫోరెన్సిక్ ఆంత్రొపాలజిస్టు డగ్ ఓస్లే విశ్లేషించాడు. ఆయన వాషింగ్టన్ డి.సి లోని మ్యూజియంలో పని చేస్తున్న నిపుణులు. కపాలం పైన నరికిన గుర్తులు, కోసిన గుర్తులు పగలగొట్టిన గుర్తులు అనేకం ఉన్నాయని డగ్ తెలిపాడు. మొదట నైపుణ్యం లేని పరిశీలనతో కొట్టిన గుర్తులు, ఆ తర్వాత ఒక లక్ష్యంతో పగల గొట్టిన, పదునైన ఆయుధంతో కొట్టిన గుర్తులు ఉన్నాయని ఆయన తెలిపాడు. కపాలంలో ఉన్న మెదడుని బైటికి తీసే లక్ష్యంతోనే ఈ విధంగా ఆయుధంతో కపాలాన్ని పగలగొట్టారని డగ్ తెలిపారు.
ఫోరెన్సిక్ ఆర్టిస్టుల చేత 147 సంవత్సరాల బాలిక ముఖాన్ని కపాలం ఆధారంతో పునర్నిర్మాణం చేశారు. అత్యంత సున్నితమైన అందమైన ముఖాన్ని వారు తయారు చేశారు. అమెరికన్ల కేనిబాలిజం (స్వజాతి భక్షణ) ఇప్పటివరకు పుకార్లుగానే ఉన్నదని, బాలిక కపాలంతో స్పష్టమైన ఆధారాలు దొరికినట్లేనని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే ఆమె ఒక్కరే బాధితురాలు కాదని, ఆహారం కోసం చంపబడ్డవారు ఇంకా ఉన్నారని వారు చెబుతున్నారు.
కరువు పరిస్ధితులను ఈ విధంగా తట్టుకుని బతికిపోయినవారితో మాట్లాడినవారి ద్వారా ఈ సమాచారం ఇతరులకు తెలుస్తూ వచ్చింది. శవాలను తిన్నామని కరువు నుండి బతికినివారిలో కొంతమంది చెప్పారు. ఒక వ్యక్తిని తన భార్యను చంపి ఉప్పును కూరి నిలవ ఉంచుకున్నాడని తెలిసాక అతనికి మరణ శిక్ష విధించిన విషయం కూడా ఒక సమాచారంగా ఇన్నాళ్లూ ఉన్నది.
బి.బి.సితో మాట్లాడుతూ డగ్ ఇలా ఉన్నారు. “అవయవాలు తొలగించారని చెప్పడానికి, శరీరం నుండి కండలు తీశారనేందుకు సాక్ష్యం స్పష్టంగా ఉంది… అనేక నరుకుడు గుర్తులు, కోత గుర్తులు ఉన్నాయి –నుదురు పైన నరికిన గుర్తులు, కపాలం వెనుక నరికిన గుర్తులు, తల ఎడమ వైపున రంధ్రం పెట్టి బలంగా విడదీసిన గుర్తు… ఇవన్నీ ఉన్నాయి. వీటన్నింటి లక్ష్యం మెదడును పెకలించడమే” అని డగ్ చెప్పినట్లు బి.బి.సి తెలిపింది. నాలుక, మొఖం పైన ఉన్న కండను కూడా తొలగించిన గుర్తులు ఉన్నాయని డగ్ తెలిపాడు.
“స్పష్టమైన ఉద్దేశ్యం ఏమిటంటే ముఖం పైన చర్మాన్ని తొలగించి తినడానికి మెదడును పెకలించడమే” అని డగ్ తెలిపాడు. “వీళ్ళు అత్యంత దారుణమైన పరిస్ధితుల్లో ఉన్నారు. కాబట్టి అందుబాటులో ఉన్న ఎలాంటి కాండ ఐనా తినడానికి వినియోగించారు” అని ఆయన తెలిపాడు. బాలిక కపాలం పైన ఉన్న నరుకుడు గుర్తులను బట్టి ఆ పని
చేసినవారికి జంతువుల మాంసాన్ని నరకడంలో నైపుణ్యం లేదని అర్ధం అవుతోందని, ఆ పని చేయడానికి వెనకాడుతూ నరికినట్లు తెలుస్తోందని డగ్ తెలిపాడు. బాలిక ఎలా చనిపోయిందో తెలియకున్నా ఆమె చనిపోయిన వెంటనే తినే కార్యక్రమం మొదలైందని చెప్పొచ్చని సైంటిస్టులు స్పష్టం చేస్తున్నారు. చనిపోవడం కోసం ఎదురు చూడడమో, లేదా ఉద్దేశ్యపూర్వకంగా చంపడమో జరిగి ఉండవచ్చని ఇది సూచిస్తోంది.
అమెరికాకు సంబంధించి ప్రారంభ వలస చరిత్రలో ‘స్టార్వింగ్ టైమ్’ అత్యంత భయంకరమైన కాలాల్లో ఒకటిగా చెబుతారు. మొదట్లో సెటిలర్లతో స్నేహభావంతో ఉన్న స్ధానికులు (రెడ్ ఇండియన్లు) వారి వైఖరితో శత్రుపూరితంగా మారారని, ఆహార సహాయం అందజేసేవారల్లా సహాయ నిరాకరణ చేశారని దానితో కటిక చలి కాలంలో ఆహారం లేక ఒక రకమైన ముట్టడికి గురైన పరిస్ధితిలో తీవ్రమైన కరువు ఎదుర్కొన్నారని బి.బి.సి తెలిపింది. మొదట గుర్రాలు, తర్వాత కుక్కలు, పిల్లులు, ఎలుకలు, పాములు చంపి తిన్నారని, చివరికి తమ చెప్పుల తోలు కూడా తిన్నారని బి.బి.సి తెలిపింది. వారాలు, నెలలు గడిచే కొద్దీ ఆకలికి తట్టుకోలేక స్వజాతి భక్షణకు దిగారని తెలిపింది. దాదాపు ఆరు నెలల అనంతరం లార్డ్ డి లా వర్ర్ నాయకత్వంలోని బృందం వారికి ఆహార సరఫరాలు తెచ్చారని తెలిపింది.
అమెరికన్ల కేనిబాలిజం అప్పుడు గతిలేని పరిస్ధితిలో సాగింది. కానీ ఇప్పుడు? ఒక వియత్నాం, ఒక ఇరాక్, లిబియా, ఇప్పుడు సిరియా, రేపు ఇరాన్… ఈ కేనిబాలిజానికి ఏ కారణం చెబుతారు?!
అంతేనా! అమెరికాలో బ్రిటిషర్లు, బతకడానికి తోటి మనుషులను సైతం చంపితింటున్న కాలంలోనే వాళ్ళు భారత ఉపఖండంలో అనాగరిక భారతీయులకు నాగరికత నేర్పే పనిలో తలమునకలై ఉన్నారు. ఎంత హిపోక్రసీ?!


నర మాంస బక్షననేది ఆటవిక దశలొ అన్ని ఖండాలలొనూ వున్నదే మద్యయుగంలొ అరుదుగా యుద్దాలలొ సంపబడ్డవారిని బక్షణ చేసేవారు ఇది ఎక్కువగా అమెరికా సమ్యుక్త రాష్టాలలొనూ మెక్సికొలొనూ అనేక తెగలలొ వున్నదని మొర్గాన్ చెప్పాడు.