పదుల వేల సంఖ్యలో ప్రజలు సరబ్ జిత్ సింగ్ అంతిమ యాత్రలో పాల్గొనేందుకు భిఖివింద్ గ్రామం చేరుకుంటుండగానే జమ్ము జైలులో ఒక పాకిస్ధానీ ఖైదీ పైన దాడి జరిగింది. 64 సంవత్సరాల సోనాయుల్లా ఖాన్ ఈ దాడిలో తీవ్రంగా గాయపడి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఉత్తర ఖండ్ రాష్ట్రానికి చెందిన భారతీయ ఖైదీ, వినోద్ కుమార్, శుక్రవారం ఉదయం ఆయనపై దాడి చేసినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత తగాదాయే దాడికి కారణమని పత్రికలు చెబుతున్నాయి. దాడిపై భారత ప్రభుత్వం విచారం వ్యక్తం చేయగా, సరబ్ జిత్ సింగ్ మరణంపై పార్లమెంటులో గొంతు చించుకున్న ప్రతిపక్ష నాయకులెవరూ ఇంకా మాట్లాడలేదు.
కోట్ భల్వాల్ లోని రాష్ట్ర కేంద్ర కారాగారంలో సంఘటన జరిగింది. జైలు సూపరింటెండెంట్ రజని సెహగల్ ఘటన గురించి చెబుతూ “ఉత్తర ఖండ్ కి చెందిన వినోద్ కుమార్ ఉదయం గం. 8:10 ప్రాంతంలో జైలులోనే పనికి బైటికి వచ్చినపుడు సోనాయుల్లాతో తగాదా పడ్డాడు. సోనాయుల్లాకు తీవ్రంగా దెబ్బలు తగిలాయి. మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చాము. ప్రస్తుతం ఐ.సి.సి.యులో ఉన్నాడు” అని తెలిపారు. ఇద్దరూ జీవిత కాల శిక్ష అనుభవిస్తున్నారని రజని తెలిపారు.
సోనాయుల్లా ఖాన్ టెర్రరిస్టు కేసుల్లో నిందితుడని రాష్ట్ర జైళ్ల డైరెక్టర్ జనరల్ రాజేంద్ర కుమార్ చెప్పాడని ది హిందు తెలిపింది. ఏడు మిలిటెన్సి సంబంధిత కేసులు ఎదుర్కొంటున్న ఖాన్ రెండు జీవితకాల శిక్షలు అనుభవిస్తూ 14 సం.ల నుండి జైలులో గడుపుతున్నాడు. ఎన్.డి.టి.వి ప్రకారం ఖాన్ పైన కూడా ఇటుకలతోనే దాడి జరిగింది. ఆయన తీవ్ర కోమాలోకి జారుకోవడంతో చండీఘర్ ఆసుపత్రికి ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలిస్తున్నారు. జమ్ము&కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం దాడిపై విచారణకు ఆదేశించింది. జైలు సూపరింటెండెంట్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.
సోనాయుల్లా పైన దాడి చేసిన వినోద్ కుమార్ మాజీ సైనికుడని ఎన్.డి.టి.వి తెలిపింది. హత్య కేసులో శిక్ష అనుభవిస్తూ ఆయన జైలులో ఉన్నాడు. 1990లో జమ్ము & కాశ్మీరు రాష్ట్రంలో కరెంటు స్తంబాలు, ప్రభుత్వ భవనాల వద్ద బాంబులు పేల్చాడని ఆయనపై ఆరోపణ. సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉండే దలువాలియా నివాసి ఐనా ఖాన్ సరిహద్దు దాటి రావడంతో అరెస్టయ్యాడని తెలుస్తోంది. నల్ల గడ్డు వాచిపోయి గెడ్డం అంతా రక్తం కారుతుండగా ఆయన్ని ఫోటో తీశారని ఎన్.డి.టి.వి తెలిపింది.
పాకిస్ధాన్ ప్రభుత్వం దాడిని ఖండించింది. సరబ్ జిత్ సింగ్ మరణానికి ప్రతీకారంగానే తమ పౌరుడి పైన దాడి జరిగిందని స్పష్టం చేసింది. “భారతీయ ఖైదీ సరబ్ జిత్ సింగ్ మరణానికి వ్యతిరేకంగానే జరిగిన ఈ దాడి ఖండనీయం” అని పాక్ విదేశీ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. సరబ్ జిత్ మరణం పైన నిప్పులు చెరుగుతూ వచ్చిన భారత విదేశాంగ శాఖ ఇప్పుడు వింతగా స్పందిస్తోంది. “భారతీయ, పాకిస్ధానీ ఖైదీలను ఇరు దేశాల జైళ్ళలో మానవీయంగా చూడడానికి, రక్షణ, భద్రతలు ఖచ్చితంగా నిర్వహించబడేలా చూడడానికీ ఇరు పక్షాల అధికారులు సమావేశం నిర్వహించాలని కోరుతున్నాం” అని భారత విదేశాంగ శాఖ కోరింది. ఇదే శాఖ నిన్నటివరకు పాకిస్ధాన్ కంటే మించిన దారుణ జైళ్ళు లేవన్నట్లు మాట్లాడింది.
పాకిస్ధానీ రాయబారులకు సోనాయుల్లా ఖాన్ ను చూడడానికి అనుమతి కోరినప్పటికీ భారత ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదు. గాయపడిన వ్యక్తికి చికిత్స ఇస్తున్నారని, చికిత్స ముగిశాక అనుమతి ఇస్తామని విదేశీ మంత్రిత్వ శాఖ తెలిపింది. “పాకిస్ధాన్ హై కమిషన్ తో మేము సంప్రదిస్తున్నాము. గాయపడిన వ్యక్తి వైద్య చికిత్స పొందుతున్నాడు. వైద్య సౌకర్యాలు అందుబాటులోకి రాగానే రాయబారులకు అనుమతి ఇస్తాం” అని విదేశాంగ శాఖ ప్రతినిధి చెప్పాడని ది హిందు తెలిపింది.
కానీ సరబ్ జిత్ సింగ్ ను చూడడానికి రెండోసారి అనుమతి ఇవ్వలేదని మూడు, నాలుగు రోజుల క్రితం పత్రికలు గోల గోల చేశాయి. చానెళ్లు పాకిస్ధాన్ దేశం పైన, ప్రభుత్వం పైన విద్వేషం వెళ్ళగక్కాయి. రాయబారులను కూడా చూడనివ్వరా అంటూ ఆక్రోశం వెళ్ల్గక్కాయి. అనుమతి ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, ఇది పచ్చి దగా అని పత్రికలు, ఛానెళ్లు పతాక శీర్షికలతో వార్తలు నడిపాయి. అది కూడా ఒక సారి అనుమతి ఇచ్చాక, వారు చూసి వచ్చాక, మళ్ళీ రెండోసారి వెళ్ళబోతే అనుమతి ఇవ్వలేదని రాద్ధాంతం చేశాయి.
మరి, ఇప్పుడో! చికిత్స ఇస్తుంటే మాత్రం రాయబారులు చూడకూడదని వైద్య సూత్రం గానీ, అంతర్జాతీయ చట్టం గానీ ఏమైనా ఉందా? పాకిస్ధానీ రాయబారుల నుండి దాచిపెట్టాల్సిన సమాచారం, గాయాల దృశ్యం ఉండబట్టే వారిని అప్పుడే అనుమతించడం లేదని అనుమానించవచ్చా? ఊహాలూ, మాటలే గనుక…. ఎన్నైనా చెప్పుకోవచ్చు గదా? జిన్నా ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ని సబ్ జైలు గా మార్చి సరబ్ జిత్ సింగ్ కు చికిత్స ఇచ్చారు. ఒక దేశంలోని జైలులోకి విదేశీ రాయబారులను అనుమతించడానికి సవాలక్షా ప్రోటోకాల్స్ ఉంటాయి. వివిధ అధికారుల నుండి అనుమతి తీసుకోవడం, పేపర్ వర్క్ పూర్తి చేయడం వంటివి ఉంటాయి. ఇంతా చేసి రెండోసారే కాదు, ఇంకా అనేకసార్లు సరబ్ జిత్ ని చూడడానికి భారత రాయబారులకు అనుమతి లభించింది.
అరుణ్ జైట్లీగారు పార్లమెంటులో నిన్న ఏమన్నారు? ‘ప్రభుత్వంతో సంబంధం లేని వ్యక్తులు (non-state actors) చేసిన ఘాతుకం ఇది అంటున్న పాక్ ప్రభుత్వ మాటల్ని విశ్వసించలేము’ అన్నారు. వివిధ ప్రతిపక్షాలు పాకిస్ధాన్ తో సంబంధాలు తెంచుకోవాలన్నారు. ఇప్పుడు ఇదే పరిస్ధితిలో భారత ప్రభుత్వం ఉన్నది. భారత విదేశాంగ శాఖ ఏమి చెబుతోందంటే ఖైదీల రక్షణ బాధ్యత జైలు అధికారులదే తప్ప ప్రభుత్వానిది కాదని. వ్యక్తిగత తగాదా అంటున్న భారత ప్రభుత్వం మాటల్ని పాక్ ప్రజలు విశ్వసించగలరా?
పార్లమెంటులో మన పెద్దలు అంత ద్వేషం వెళ్ళగక్కాక మన మాటలని విశ్వసించాలని కోరే హక్కు మనకు ఉంటుందా అన్నది కూడా ప్రశ్నే. సరబ్ జిత్ సింగ్ పైన ఇటుకలతో దాడి జరిగింది కనుక సొనాయుల్లా ఖాన్ పైన కూడా ఇటుకలతో దాడి జరిగింది. ఈ నేపధ్యంలో భారత జైళ్లలో ఉన్న 220 పాకిస్ధానీ ఖైదీలకు భద్రతా చర్యలు పటిష్టం చేయాలని కేంద్ర హొమ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అనవసర ఆవేశాలతో ఉద్రిక్తతలు రెచ్చగొట్టి ఆనక భద్రత పెంచుతున్నామని చెప్పడం ప్రభుత్వ నాయకులు చేయదగ్గ పని కాదు.
ఇదేదో పాకిస్ధాన్ కు మద్దతుగా రావడం కాదు. ప్రభుత్వాల స్ధాయిలో వ్యవహారాలు జరుగుతున్నపుడు కాసింత ఆలస్యం, ఎదురు చూపులు తప్పవు. వీటిని హుందాగా స్వీకరించి పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. కానీ హుందాతనం అనేది రాజకీయ పార్టీలకు తెలియని పదం. ఎంత పచ్చిగా విద్వేషం వెళ్లగక్కితే ప్రజల దృష్టిలో అంత దేశభక్తి చాంపియన్లము అవుతామని వారి దురాశ. ఈ దురాశను, ప్రజలను పక్కదారి పట్టించి పబ్బం గడుపుకునే మోసాన్ని ఎత్తి చూపడమే ఇక్కడి ఉద్దేశ్యం.
డెలిగేట్స్ డెలిగేషన్ చెయ్యకుండా లిటిగేషన్ లు చేస్తుంటే ఇలా అమాయుకులు బలి అవుతూనే ఉంటారు
దెయ్యాలు వేదాలు వల్లెవేసినట్లు, కాషాయ నాయకుల నుండి మానవత్వం, సానుభూతి లాంటి మాటల ప్రవాహానికి కాస్తైనా అడ్డుకట్ట వేసినందుకు..
.చూశారా ఆ దేశస్తులు ఎంత రాక్షసులోనంటూ తమ విద్వేష దేశభక్తిని విచ్చల విడిగా వెల్లగక్కుతున్న కుహన దేశభక్తుల ఎమోషనల్ వొమిటింగ్ కి సడన్ బ్రేక్ వేసినందుకూ..
ఎదవలు ఏ ఒక్క దేశంలోనో ఉండరనీ, మన లోనే, మన మధ్యనే తిరిగే వారిలో కూడా చాలా మంది ఉంటారనీ.. ససాక్ష్యాలతో నిరూపించినందుకు వినోద్ కుమార్ కి కృతఞతలు.
యాధృచ్చికంగా జరిగినదా లేక ప్రణాళిక ప్రకారంగా జరిగినదా ఖచ్చితంగా మనకు తెలియదు. ఐతె ఇది కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని మనవాళ్ళు ఇది ప్రతీకారమే అని వాళ్ళు అనుకొవడం తప్పదు.ఇలాంటివి ఆగనంతకాలం పాక్ తొ సత్సంబంధాలు నెరపడం కష్టమే.