సి.బి.ఐ దయనీయ స్ధితి -కార్టూన్


“రాజకీయ నాయకుల నుండి సి.బి.ఐ ని విముక్తం చేయడం మా తక్షణ కర్తవ్యం” అని సుప్రీం కోర్టు నిన్న సి.బి.ఐకి తలంటుతూ వ్యాఖ్యానించింది. “రాజకీయ నాయకుల ఆదేశాలు పాటించవలసిన అవసరం మీకు లేదు” అని సుప్రీం బెంచి చెప్పాక “ఇక నుండి బుద్ధిగా నడుచుకుంటాం. బొగ్గు కుంభకోణం విచారణ పురోగతి నివేదికలన్నీ నేరుగా మీకే చూపుతాం. ప్రభుత్వానికి చూపించం” అని తలూపి కోర్టు బైటికి వచ్చిన సి.బి.ఐ అధిపతి కోర్టు ఆవరణలోనే మాట మార్చేశారు.

“సి.బి.ఐ స్వతంత్ర సంస్ధ కాదు” అని ఆయన కోర్టు బైట చేసిన వ్యాఖ్య అనేకమందిని ఆశ్చర్యపరిచింది. “సి.బి.ఐ కూడా ప్రభుత్వంలో భాగమే. మేము ప్రభుత్వం నుండి విడిగా లేము. మా నివేదికలు ప్రభుత్వానికి కాక ఇంకెవ్వరికీ చూపుతాము” అని సి.బి.ఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా పత్రికలను ప్రశ్నించారు. ఆ తర్వాత ఏమైందో, కోర్టు నుండి మళ్ళీ మొట్టికాయలు వచ్చాయో ఏమో తెలియదు గానీ తన మాటలను సవరించుకుంటూ ఆయన మరో ప్రకటన పత్రికలకు విడుదల చేశారు. “సి.బి.ఐ ఒంటరిగా ఉనికిలో ఉండదు. మేము వ్యవస్ధలో భాగం. కొన్ని సందర్భాల్లో సలహా సంప్రదింపులు జరిపి అభిప్రాయాలూ తీసుకోవలసి ఉంటుంది” అని ఆ ప్రకటన సారాంశం. (ఎన్.డి.టి.వి)

సి.బి.ఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా మరెవరో కాదు. పశు గ్రాసం కుంభకోణంలో సంవత్సరాల తరబడి విచారణ చేసి బీహార్ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ కు క్లీన్ ఛీట్ ఇచ్చిన సి.బి.ఐ విచారణ బృందానికి నాయకుడు. ఆయనను సి.బి.ఐ డైరెక్టర్ గా నియమించబోతుంటే వద్దంటే వద్దని ప్రతిపక్షాలు, కొందరు బ్యూరోక్రట్లు గట్టిగా చెప్పారట. అయినా వినకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను నియమించుకుంది. అలాంటి వ్యక్తి తాను ఎవరి మనిషినో పత్రికలకే చెబుతారంటే చెప్పారా మరి!

ఈ వ్యవహారంతోనే సుప్రీం కోర్టు సి.బి.ఐ ని రాజకీయుల నుండి విముక్తి చేసే కర్తవ్యాన్ని నెత్తి మీద వేసుకుంది. పదేళ్ళ క్రితం వినీత్ నారాయణ్ కేసులో సి.బి.ఐ స్వతంత్రత గురించి సర్వోన్నత న్యాయస్ధానం మార్గదర్శక సూత్రాలను రూపొందించినా అవి రికార్డులకే పరిమితం అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ సి.బి.ఐ కేసులతో బెదిరిస్తోందని స్వయానా ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు అక్షిలేష్ యాదవ్ లే ఇటీవల ప్రకటించారు. మాయావతి కూడా కాంగ్రెస్ కి మద్దతు ఇస్తున్నారంటే ‘అక్రమాస్తుల కేసులే’ కారణమని పత్రికలు ఒక సాధారణ వాస్తవంగా చెబుతాయి. (తాజ్ కారిడార్ కేసులో మాయావతి పైన సి.బి.ఐ దాఖలు చేసిన ఎఫ్.ఐ.ఆర్ ను సాంకేతిక కారణంతో రద్దు చేసిన సుప్రీం కోర్టు ‘అక్రమస్తుల కేసులో’ ఆమెకు వ్యతిరేకంగా ముందుకు వెళ్లవచ్చని బుధవారం సుప్రీం అనుమతి ఇచ్చేసింది.)

ఈ నేపధ్యంలో సుప్రీం కోర్టు దృష్టిలో సి.బి.ఐ ఎంతటి దయనీయ అభిప్రాయాన్ని పొందిందో ఈ కార్టూన్ సూచిస్తోంది. సాధారణంగా కాపాలాకు కుక్కను పెంచుకుంటాము. అలాంటిది కుక్కపైనే అనుమానం వస్తే? దానికి పరిష్కారం ఇలాగే ఉండాలని కోర్టు చెప్పేసిందని భావించాలి.

The Hindu

The Hindu

One thought on “సి.బి.ఐ దయనీయ స్ధితి -కార్టూన్

వ్యాఖ్యానించండి