సరబ్ జిత్ సింగ్ చనిపోయాడు. పాకిస్ధాన్ లోని జిన్నా ఆసుపత్రి డాక్టర్లు ‘బతకడం కష్టమే’ అని చెప్పినట్లుగానే ఆయన చనిపోయాడు. మరణ శిక్ష ఎదుర్కొంటున్న ఇద్దరు పాకిస్ధానీ ఖైదీలు లాహోర్ లోని కోల్ లఖ్పట్ జైలులో అమానుషంగా దాడి చేయడంతో కోమాలోకి వెళ్ళిన సరబ్ జిత్ సింగ్ గురువారం తెల్లవారు ఝామున 1 గంటకు తుది శ్వాస విడిచాడని పాక్ అధికారులు ప్రకటించారు. గత శుక్రవారం దాడికి గురైన సరబ్ జిత్ సింగ్ వారం రోజులు కోమాలో ఉన్నారు.
1990లో పాకిస్ధాన్ లో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 14 మంది పౌరులు చనిపోయిన కేసులో సరబ్ జిత్ సింగ్ దోషి అని న్యాయస్ధానాలు తేల్చాయి. అప్పటి అధ్యక్షుడు ముషర్రాఫ్ క్షమాభిక్షకు నిరాకరించగా, ఇటీవలి అధ్యక్షుడు జర్దారీ శిక్ష అమలును నిరవధికంగా వాయిదా వేశాడు. ప్రభుత్వానికి సంబంధం లేని వ్యక్తుల (non-state actors) దాడిలో సరబ్ జిత్ సింగ్ చనిపోయాడని పాక్ ప్రభుత్వం చెబుతోంది. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం సరబ్ జిత్ సింగ్ హత్యపైన దర్యాప్తుకు ఆదేశించగా దాడిని నివారించలేకపోయినందుకు జైలు అధికారులపై చర్యలు ఏవని భారత ప్రభుత్వం, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
సరబ్ జిత్ సింగ్ మరణం పైన పార్లమెంటు దిగ్భ్రాంతికి లోనైందని ది హిందు పత్రిక చెబుతోంది. ప్రతిపక్షాలు పార్లమెంటులో ఆగ్రహంతో పాకిస్ధాన్ వ్యతిరేక నినాదాలు చేశారని వార్తలు చెబుతున్నాయి. సభ్యుల గొడవతో పలుసార్లు వాయిదా పడిన ఉభయ సభలు చివరికి సరబ్ జిత్ పైన దాడిని ఖండిస్తూ, ఆయన మరణానికి సానుభూతి ప్రకటిస్తూ తీర్మానాలు ఆమోదించాయి.
“ఒక పాకిస్ధాన్ జైలులో సహచర ఖైదీల క్రూర దాడికి గురయిన తర్వాత పాకిస్ధాన్, లాహోర్ లోని జిన్నా ఆసుపత్రిలో ఉన్న భారతీయ పౌరుడు సరబ్ జిత్ సింగ్ బాధాకర మరణం పట్ల ఈ సభ తన దిగ్భ్రాంతిని, దుఃఖాన్ని వ్యక్తం చేస్తోంది” అని లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ ప్రవేశపెట్టిన తీర్మానం పేర్కొంది.
“పాకిస్ధాన్ జైలులో సరబ్ జిత్ సింగ్ ఎదుర్కొన్న అమానవీయ అనుభవాన్ని ఈ సభ ఖండిస్తోంది. నేరస్ధులను చట్టం దృష్టికి తెచ్చి శిక్షిస్తారని ఆశీస్తోంది” అని సదరు తీర్మానం పేర్కొంది. సరబ్ జిత్ సింగ్ పట్ల గౌరవ సూచకంగా సభ్యులు కొద్ది నిమిషాలు లేచి నిలబడి మౌనం పాటించారని తెలుస్తోంది. “పార్లమెంటు మొత్తం ముక్త కంఠంతో ఎలుగెత్తుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ సమస్య చాలా కాలంగా నలుగుతోంది. కుటుంబ సభ్యులకు మా సానుభూతి” అని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు అరుణ్ జైట్లీ ఆవేశం ప్రకటించారు.
“ఆ జైలు గదుల వద్ద పక్షులు కూడా ఎగరలేవు. ఎందుకంటే అక్కడ ఖైదీలను (పరస్పర సంబంధం లేకుండా) వేరుగా ఉంచుతారు… ఒక ఖైదీ పైన ఆ విధంగా దాడి ఎలా చేయగలరు. తోడేళ్ళ ముందుకు సరబ్ జిత్ ను విసిరినట్లు కనిపిస్తున్నందున, ఈ చర్య ప్రభుత్వేతర వ్యక్తులు చేసిందని చెబుతున్న పాకిస్ధాన్ మాటల్ని నమ్మలేము” అని అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ఉభయ సభల్లోనూ ఆ పార్టీ, ఈ పార్టీ అని కాకుండా దాదాపు సభ్యులంతా ఇవే భావోద్వేగాలు వ్యక్తం చేశారు. భారత దేశం నడక ఇక ఆగిపోయిందన్నట్లే వారు వ్యవహరించారు. పాకిస్ధాన్ ని అడ్డు తొలగించుకుంటే తప్ప భారత దేశ నడక ముందుకు సాగడం కష్టం అన్నట్లుగా వారి వ్యాఖ్యలు ఉన్నాయి.
భారత పార్లమెంటు సభ్యులకు జేజేలు. ఒక సాధారణ పౌరుడికి పార్లమెంటులో ఇలాంటి గౌరవం దక్కడం అత్యంత అరుదైన సంఘటనల్లోకెల్లా అరుదైనది. అది కూడా ‘టెర్రరిస్టు’గా కోర్టులు నిర్ధారించిన వ్యక్తి మరణానికి (వేరే దేశపు కోర్టులు ఐతే కావచ్చు గాక!) ప్రజా ప్రతినిధులు, మంత్రులు లేచి నిలబడి సంతాపం ప్రకటించడం ఊహించలేని విషయం.
కానీ భారత ప్రజా ప్రతినిధులకు పాకిస్ధాన్ లోని భారతీయ ఖైదీలే కనిపిస్తారా? పాక్ జైళ్ళలో జరిగే దాడులే కనిపిస్తాయా? ప్రభుత్వేతర వ్యక్తుల దాడుల పైన ఇంత ఆగ్రహం, ఆవేదన, ఆక్రోశం వెళ్లగక్కుతున్న నేతలు భారతీయ జైళ్ళలో కనీసం విచారణ అనేది లేకుండా, బెయిలు అనేది ఎరగకుండా, కోర్టుకు తీసుకెళ్లే నాదుడే లేకుండా సంవత్సరాల తరబడి మగ్గుతున్న వేలాది ఆదివాసీ ఖైదీల మాటేమిటి? మరీ ముఖ్యంగా జైలులో విచారణ పేరుతో ఒక ఆదివాసీ మహిళా టీచర్ మానంలో రాళ్ళు, లాఠీలు జొనిపిన పోలీసు అధికారులు, జైళ్ల అధికారుల మాటేమిటి? సోనీ సోరి సంగతిని ఈ దేశ మహిళామణులు సోనియా గాంధీ, మీరా కుమార్, సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్ ఇత్యాది నేతలు పట్టించుకున్నారా? కనీసం విచారణకు ఆదేశించారా?
పాకిస్ధాన్ పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం సరబ్ జిత్ సింగ్ మరణం పైన విచారణ చేయడానికి హై కోర్టు జడ్జిని నియమించింది. సరబ్ జిత్ విగత దేహం పైన అటాప్సి నిర్వహించడానికి ఎనిమిది మందితో కూడిన అత్యున్నత స్ధాయి వైద్య బృందాన్ని ప్రకటించింది.
దక్షిణ ఛత్తీస్ ఘర్ లో స్కూలు పిల్లలకు పాఠాలు చెప్పుకునే గిరిజన ఆదివాసీ టీచర్ సోనీ సోరిని మావోయిస్టులతో కేవలం సంబంధాలు ఉన్నాయనే పేరుతో ఎనిమిది అక్రమ కేసులు బనాయించారు. అందులో ఆరు కేసుల్లో ఆమె నిర్దోషి అని కోర్టులు తీర్పు చెప్పాయి. నిన్ననే ఆరో కేసులో ఆమె నిర్దోషి అని దంతెవాడ కోర్టు తీర్పు చెప్పింది. సోనీ సోరితో పాటు మరో 15 మంది గిరిజనులు నిర్దోషులుగా కోర్టు తీర్పు చెప్పింది. స్ధానిక కాంగ్రెస్ నాయకుడి పైన దాడి చేసిందని, పేలుడు పదార్ధాలతో ఎస్సార్ స్టీల్ కంపెనీ వాహనాలు పేల్చివేసిందని, ఎస్సార్ స్టీల్ యజమానులను బెదిరించి డబ్బు వసూలు చేసి అన్నల కోసం తీసుకెళ్తుండగా అరెస్టు చేశామనీ, పోలీసుల పైన కాల్పులు జరిపిందనీ… ఇలా ఎనిమిది అక్రమ కేసులను భారత పోలీసులు ఒక నిస్సహాయ భారతీయ ఆదివాసీ గిరిజన మహిళపైన బనాయించారు.
ది హిందు పత్రిక ప్రకారం గత సంవత్సరం రెండు కేసుల్లో ఆమె నిర్దోషి అని కోర్టులు తేల్చాయి. గత ఫిబ్రవరిలో మరో రెండు కేసులు కొట్టేశారు. ఇంకా రెండు కేసులు పెండింగులో ఉన్నాయి. అనేకవాహనాలు తగలబెట్టిందని ఒక కేసు, ఎస్సార్ స్టీల్ కంపెనీ జనరల్ మేనేజర్, కంపెనీ కాంట్రాక్టర్ ల నుండి డబ్బు వసూలు చేసి మావోయిస్టులకు అందజేయడానికి పధకం వేసిందంటూ మరో కేసు. పోలీసులు కంపెనీ అధికారుల పైన కూడా కేసులు మోపారు, మావోయిస్టులకు నిధులు ఇస్తున్నారని. విచిత్రం ఏమిటంటే ఈ అధికారులిద్దరికి అరెస్టు చేసిన కొద్ది నెలల్లోనే కోర్టు బెయిలు ఇచ్చేసింది. కానీ అదే కేసులో అరెస్టయిన సోనీ సోరి, సహ నిందితుడు కొడోపి లకు బెయిల్ ఇవ్వలేదు. న్యాయానికి డబ్బు వాసన తెలియదనేవారు అమాయకులా?
ఒక్క సోనీ సోరి, కొడోపి లే కాదు. ఛత్తీస్ ఘర్, జార్ఖండ్, ఆంధ్ర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ తదితర రాష్ట్రాల చీకటి కోట్లలో వేలాది ఆదివాసి ప్రజలు, ఈ దేశ మూలవాసులు… విచారణ లేకుండా మగ్గుతున్నారు. న్యాయవాదుల ప్రకారం వారి పై మోపిన కేసులను ఉన్నత కోర్టులయితే కనీసం అనుమతించవు. అంత చిన్న, అపహాస్యపూరితమైన కేసులవి. ఒకవేళ అనుమతించినా గంటల్లో బెయిలు వచ్చే కేసులు. కానీ వారికి ఆస్తులు లేవు. డబ్బు పెట్టలేరు. లాయర్లను కొనలేరు. కనీసం తనపై ఏ కేసు ఉందో కూడా తెలుసుకోలేరు. డాక్టర్ బినాయక్ సేన్, సోనీ సోరి, కొడోపి… వీరు పత్రికల దృష్టికి వచ్చారు గనక ఈ మాత్రమైనా తెలిసింది. అలా ఎవరి దృష్టికి రాని అమాయక గిరిజనులు వెలుగా జైళ్ళలో మగ్గుతున్నారు. ఒక్క సరబ్ జిత్ సింగ్ ది మాత్రమే జీవితామా? ఆయనవి మాత్రమే ప్రాణాలా? ఆయన మాత్రమే భారత పౌరుడా?
సోనీ సోరి పైన అమలు చేసిన అత్యంత అమానుషమైన, క్రూరమైన రాజ్య హింస చాలదన్నట్లు ఆమెకు మతి చలించిందని రుజువు చేయడానికి ఛత్తీస్ ఘర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. మార్చి 14 న ఆమె కోర్టులో హాజరు కావలసి ఉండగా ప్రభుత్వం ఆమెను కోర్టుకు తీసుకురాలేదు. ఒక సైకియాట్రిస్టు ఆమెను చూస్తోందని అందుకే రాలేదని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీనితో అనుమానం వచ్చిన మహిళా హక్కుల సంస్ధలు, జాతీయ మహిళా కమీషన్ బృందంతో తో కలిసి సోనీ సోరిని కలిసి వచ్చారు.
నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ వుమెన్’ ప్రతినిధి అన్నీ రాజా ప్రకారం సోనీ సోరి కి మతి చలించిందని రుజువు చేయడానికి ప్రభుత్వ వర్గాలు ఒక పధకం ప్రకారం కృషి చేస్తున్నాయి. ‘నీకు కోపం వస్తుందా?’ అని సైకియాట్రిస్టు అని అడిగారట. కోపం రానిదెవరికి? “అదే పనిగా ఫిర్యాదులు చేయొద్దు” అని సైకియాట్రిస్టు సలహా. తనపై పోలీసులు, జైలు అధికారులు సాగించిన చిత్రహింసలను, లైంగిక దాడులను ఈ విధంగా మతిచలించి చేసిన ఫిర్యాదులుగా కొట్టిపారేసే ప్రయత్నానికి సైకియాట్రిస్టు సహకారం అందుతోందా?
సోనీ సోరి స్వదస్తూరితో జాతీయ మహిళా కమిషన్ కు ఒక లేఖ అందజేసింది. “మాకు సమన్లు అందిన ప్రతిసారీ మమ్మల్ని కోర్టులో హాజరుపరచాలి. కోర్టుకి వెళ్ళినపుడు మాకు ఆహారం ఇవ్వాలి. నక్సల్ కేసుల వలన మాకు సమయం ప్రకారం వైద్య చికిత్స ఇవ్వడం లేదు…. మా పిల్లల కోసం నాకు సహాయం అవసరం. నక్సల్స్, ప్రభుత్వాల మధ్య ఘర్షణల్లో నేను సర్వస్వం కోల్పోయాను. నక్సల్స్ మా తండ్రిని హింసపెడుతుంటే, నన్ను నక్సల్ సానుభూతిపరురాలిగా ముద్ర వేశారు, నాకేమీ తెలియనప్పటికీ. నాకు చాలా చెప్పాలని ఉంది. కానీ కోర్టులో నా పోరాటం జరుగుతోంది కనుక ఇంతకంటే ఎక్కువగా చెప్పలేను. నేనొక్కటే కోరుతున్నాను. దయచేసి నన్నింక హింసించవద్దు. ఎందుకంటే హింసను భరించే శక్తి నాకిక లేదు. నేను నిజం చెప్పినప్పుడల్లా, నిజం రాసినప్పుడల్లా నన్ను శిక్షిస్తున్నారు. భవిష్యత్తులో అది మళ్ళీ జరగకూడదు.”
రాజ్య సభ ప్రతిపక్ష నాయకులు అరుణ్ జైట్లీ గారూ, ఇది వింటున్నారా? నిజం చెప్పినప్పుడల్లా జైలు అధికారులు, పోలీసులు తనను హింసిస్తున్నారని ఒక నిస్సహాయ అదివాసీ గిరిజన మహిళ ఆక్రోసిస్తోంది. మీ పార్టీ పానలోనే ఉన్న రాష్ట్రంలో నిస్సహాయ మహిళలపై అక్రమ కేసులు బనాయిస్తున్నా పట్టించుకోని మీరు పాకిస్ధాన్ జైళ్ళ వద్ద పక్షులు కూడా ఎగరవని పరిహసించడం వింతగా తోచడం లేదా? సోనీ సోరిని తన సమక్షంలోనే వివస్త్రను చేసి ముగ్గురు పోలీసుల చేత చిత్రహింసలు పెట్టించి ఆమ మానంలో, గుదంలో రాళ్ళు జొనిపించిన జిల్లా ఎస్.పి (అంకిత్ గార్గ్) కి మీ ప్రభుత్వాలు గత సంవత్సరమే రిపబ్లిక్ డే రోజున ‘పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ’ అవార్డు ఇచ్చి సత్కరించాయి. అమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ సోనీ సోరి పైన అమలు చేసిన దారుణాన్ని విచారణ చేయాలని డిమాండ్ చేశాయి. కోల్ కతా మెడికల్ కాలేజీ ఆసుపత్రి వారు ఆమె రహస్యాంగాల నుండి రాళ్ళు వెలికి తీశారు. ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ వైద్యులు ఆమకు మొదట చికిత్స నిరాకరించి విమర్శలు రావడంతో ఆసుపత్రిలో చేర్చుకున్నారు. ఆమె రహస్యాంగాల వద్ద తీవ్రమైన పుండ్లతో (blisters – బలవంతపు రాపిడి వలన పుట్టిన ద్రవంతో నిండిన పుండ్లు) బాధపడుతోందని అక్కడి డాక్టర్లు తేల్చారు. ఇదంతా మన దేశంలోనే మీ పార్టీ అధికారంలోనే ఉన్న రాష్ట్రంలోనే గత మూడేళ్లుగా జరుగుతున్న అమానవీయ హింస.
అరుణ్ జైట్లీ ఒక్కరే కాదు, ఇప్పుడు సరబ్ జిత్ మరణం పైన కడవల కొద్దీ కన్నీళ్లు కార్చుతూ, నోటితో ఆగ్రహ జ్వాలలు విరజిమ్ముతున్న ప్రజాప్రతినిధులంతా సోని సోరి పై సాగిన హింసకు సమాధానం చెప్పాలి. ఆమెను మతి చలించిన వ్యక్తిగా చూపే ప్రయత్నాలకు దేశ మాన మర్యాదలు మంట గలిపే శక్తి ఉన్నదో లేదో చెప్పాలి.
హ్యాట్సాఫ్ వి శేఖర్ గారు. రాజకీయ నేతల ద్వంద్వ వైఖరి….ఆదివాసీల అరణ్యరోదన. ఖాకీల క్రౌర్యం,అధికారుల అవినీతి, నక్సలైట్ల అరాచకాలు,న్యాయమూర్తుల అన్యాయాలు ఒకటేమిటి….మన నడుస్తున్న చరిత్రని కళ్లకు కట్టారు. ఈ వ్యాసాన్ని దినపత్రికలకు పంపితే చాలా బాగుంటుంది.
విశేఖర్ గారూ,
హిపోక్రసీ, డబుల్ స్టాండర్డ్స్ లాంటి వాటికి నిలువెత్తు నిదర్శంగా ఉన్నాయి ప్రస్తుతం జరుగుతున్న పరిస్తితులు. భావోద్వేగాలు రగిలించే అవకాశం ఎప్పుడు దొరుకుంతుందా అని కాచుక్కూర్చుని ఉన్న ప్రధాన ప్రతిపక్షం , వారికి ఆ అవకాశం ఇవ్వకుండా అదేదో మేమే చెస్తే పోలా అన్నట్లు ఓవర్ యాక్షన్ చేసే అధికార పక్షం కలిసి నానాటికీ పతనం లో పోటీలు పడుతున్నాయి.
విఘ్నేశ్వరరావు గారు,
ధన్యవాదాలు. బ్లాగ్ లో ఆల్రెడీ ప్రచురించాను గనుక దినపత్రికలు వేసుకోవు. ఇక్కడ వెయ్యకుండా పత్రికలకు పంపితేనేమో వాళ్లు వేసుకుంటారో లేదో తెలియదు. వాళ్లు తేల్చుకునేలోపు సందర్భం కాస్తా అసందర్భం అయిపోతోంది. అందుకని పత్రికకు ప్రయత్నించలేదు.
చీకటి గారు, అవును. అన్ని పార్టీలూ పతనంలో పోటీపడుతున్నాయి. జనం తేల్చుకునేవరకూ ఇంతే.
కదిలించే కథనం. చాలా బాగా రాశారు. దీన్ని ఫేస్ బుక్ లో షేర్ చేశాను.
వేణు గారు ధన్యవాదాలు. ఫేస్ బుక్ లో ఈ ఆర్టికల్ వచ్చిందా? గతంలో ఇక్కడ పబ్లిష్ చేసిన వెంటనే అక్కడ కనపడేది. ఇప్పుడు ఆ లింక్ కట్ అయినట్లుంది, అలా కనపడడం లేదు.
నేను షేర్ చేసినదానితో సంబంధం లేకుండానే ఫేస్ బుక్ లో మీ టపా వచ్చింది. నేను షేర్ చేశాక దానికింద నేను రాసింది కనపడుతోంది.
There was no denying that Soni Sori ji has gone through unfair and unjust treatment. However, the leftist leaning journalists always find something else to compare with recent events. How about the million Kashmiri Hindu Pandits ? What happened to them ? Did any from the left leaning journalists talk about it ?
Both of these Soni Sori and Sarabjit suffered. So both incidents needs to be condemned, Period. But selective comparison is where the issue comes. If you bring a left leaning cause, I would have to bring equally pathetic cause that was ignored by both the RIGHT and LEFT wing journalists.
http://blogs.wsj.com/indiarealtime/2013/01/22/rahul-panditas-book-on-a-kashmir-exodus/
బుర్జువా ప్రత్రికలు , బుర్జువాలూ,వాళ్ళు చెప్పిందే న్యాయం, అదే శాసనం. 1948 నుంచీ, 1951 వరకూ తెలంగాణా పొరాటంలొ నాజీ పాలన సాగించారు.నెహ్రూ సైన్యం సాగించిన దురాగతాలు లెక్కలేనన్ని ,సుమారు నాలుగు వేలమంది స్త్రీలు చెరచబడ్డారు.అప్పుడేప్రసవించిన స్త్రీ నుంచి నిండు బాలింతవకూ, 10,12 యేళ్ళ బాలికలనూ వదలలేదు. సామూహికంగా స్త్రీలను వివస్త్రను చేచి వూరంతాతిప్పి తలకిందులుగా వేలాడతీయటం జననాంగాలపైన ఎలుకులను వుంచడం ఇత్యాది ఘాతుకాలు వేలమందిని చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఆధీనంలొ వున్న బుర్జువా ప్రత్రికలు స్త్రీల గౌరవానికై పొరాడే ఈ ఉత్తములు ఒక్కమాటన్నా నెహ్రూ సైన్యాలకు వెతిరేకంగా రాయలేదు.
ప్రజలెంతొ ద్వెషించే నైజాం నవాబుకు నెహ్రూ ప్రభుత్వం 1950 లొ రాజప్రముక్ పదవిని కట్టబెట్టింది. రైతులపైన పొలీసులు అనేక సెక్ష్న్లు మొపి యేన్న్ల పాటు జైళ్ళలొ పెట్టెరు లాయర్లు , పొలీసులూ మిలటరీ అధికారుల మాట అలావుంచినా జర్జీలు సైంతం ఈ సాక్షులను క్రస్ పరిక్ష చేయడానికి సాదారణంగా అనుమతించేవారు కాదు.సాక్షి ఏమిచెప్పినా ప్రసిక్యుషన్ కథనానికి అనుకులంగా ఉన్న వాటినే రికార్డు చేసుకునేవారు. పై పద్దతినే ప్రబుత్వ పొలీసు, సైన్యాలూ ఇప్పటికీ పాటిస్తునే వున్నాయి.
కొట్టడం వల్లో తన్నడం వల్లో వచ్చిన కోపాన్ని మానసిక సమస్య అనుకునేవాడు సైకియాట్రిస్ట్ కాడు. సామాజిక ప్రభావాల వల్ల ఏర్పడే ప్రవర్తనా లక్షణాలని సైకియాట్రిస్ట్‌లు మార్చలేరు.
మాటల్లో వర్ణించలేనంత హింసకు గురైన ఆమెను చూస్తే హ్రుదయం ద్రవించింది.. పరాయి దేశంలో జరిగినవే అన్యాయం.. మనదేశంలో జరిగితే సత్కార్యం అని భావించే రాజకీయ నాయకులను చూస్తే అసహ్యం వేసింది.. ఇకనైనా ఆదీవాసుల విషయంలో ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరును మార్చుకోవాలి.
పింగ్‌బ్యాక్: దారికొచ్చిన అద్వానీ | జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ