బొగ్గు: రాజకీయుల ఆదేశాలు తీసుకోవద్దు, సి.బి.ఐతో సుప్రీం


Supreme courtబొగ్గు కుంభకోణం విచారణకు సంబంధించి ఇక నుండి రాజకీయ కార్యనిర్వాహకుల (political executive) నుండి ఆదేశాలు తీసుకోవద్దని సుప్రీం కోర్టు సి.బి.ఐ ని ఆదేశించింది. ఏప్రిల్ 26 తేదీన సి.బి.ఐ సమర్పించిన అఫిడవిట్ లో అత్యంత కలతపరిచే అంశాలు ఉన్నాయని సుప్రీం వ్యాఖ్యానించింది. బొగ్గు కుంభకోణం విచారణలో సుప్రీం కోర్టుకు సి.బి.ఐ సమర్పిస్తున్న (దర్యాప్తు) పురోగతి నివేదికలను కోర్టుకు సమర్పించే ముందు ప్రభుత్వ మంత్రులకు బ్యూరోక్రాట్ అధికారులకు చూపిస్తున్నామని సి.బి.ఐ అఫిడవిట్ లో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ వాస్తవాన్ని కోర్టునుండి దాచిపెట్టడం పట్ల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చిన్న విషయం కాదని వ్యాఖ్యానించింది.

ఇష్టానుసారం బొగ్గు గనులను కేటాయించడం వలన ప్రభుత్వానికి 1.86 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ నివేదించిన దరిమిలా సుప్రీం కోర్టులో ఈ కుంభకోణంపై విచారణ జరిపించాలని పిటిషన్ దాఖలయింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సి.బి.ఐ విచారణకు ఆదేశించింది. 2జి కుంభకోణం మాదిరిగా బొగ్గు కుంభకోణం విచారణను కూడా స్వయంగా పర్యవేక్షించడానికి సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఎప్పటికప్పుడు విచారణ పురోగతి నివేదికలను తమకు సమర్పించాలని ఆదేశించింది.

ఈ నివేదికలను కోర్టుకు ఇవ్వడానికి ముందే మంత్రులు బ్యూరోక్రాట్ అధికారులు చూసి సవరణలు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో గత మార్చి 8 తేదీన అఫిడవిట్ సమర్పించాలని సి.బి.ఐ ని ఆదేశించింది. గతంలో ఎన్నడూ లేనట్లుగా తమ నివేదికలు ప్రభుత్వానికి చూపడం లేదని అఫిడవిట్ లో హామీ ఇవ్వాలని సుప్రీం కోరింది.

ఆరోపణల గురించి అడిగినపుడు మార్చి 8 తేదీన అడిషనల్ సొలిసిటర్ జనరల్ హరేన్ రావల్ ‘పురోగతి నివేదికలను నేరుగా కోర్టుకు సమర్పిస్తున్నామని, మధ్యలో ఎవరూ చూడడం లేదని’ కోర్టుకు తెలిపాడు. అయితే ఏప్రిల్ 26 తేదీన సి.బి.ఐ సమర్పించిన అఫిడవిట్, ఈ వాదన నిజం కాదని తేల్చింది. సి.బి.ఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా సమర్పించిన అఫిడవిట్ లో ‘నివేదికను సుప్రీం కోర్టుకు ఇవ్వడానికి ముందు న్యాయ శాఖ మంత్రి అశ్విని కుమార్ తోనూ, ప్రధానమంత్రి కార్యాలయం మరియు బొగ్గు శాఖల సంయుక్త కార్యదర్శిలతోనూ పంచుకున్నామని’ సి.బి.ఐ స్పష్టం చేసింది. దీనితో అదనపు సొలిసిటర్ జనరల్ కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినట్లయింది.

అటార్ని జనరల్ జి.ఇ.వాహనవతి

అటార్ని జనరల్ జి.ఇ.వాహనవతి

అయితే ఇందులో తన తప్పేమీ లేదని హరేన్ రావల్ స్పష్టం చేస్తున్నారు. అటార్నీ జనరల్ (ఎ.జి) పి.ఇ.వాహనవతి తమ కార్యక్రమాల్లో జోక్యం చేసుకుంటున్నందునే ఈ పొరబాటు దొర్లిందని ఆయన సోమవారం రాత్రి ఎ.జి కి రాసిన లేఖలో పేర్కొన్నట్లు ది హిందు తెలిపింది. అయితే హరేష్ రావల్ ఈ విషయమై వివరణ కోరగా ఏమీ చెప్పలేదని పత్రిక తెలిపింది. “నేనే తప్పూ చేయలేదు. నిజం నిలకడ మీద తెలుస్తుంది” అన్నారని తెలిపింది.

న్యాయ శాఖ మంత్రి అశ్వినీకుమార్ వద్ద హాజరు కావాలని తనకు ఎ.జి నుండి ఆదేశాలు అందిన విషయాన్ని రావల్ గుర్తు చేశారని, అక్కడకు వెళ్ళగా ఎ.జి కూడా ఉన్నారని అభిజ్ఞ వర్గాలను ఉటంకిస్తూ ది హిందు తెలిపింది. సి.బి.ఐ సమర్పించిన పురోగతి నివేదికలన్నింటినీ మంత్రి అశ్విని కుమార్ కి చూపాల్సిందిగా ఎ.జి ఆదేశించారని దాని ప్రకారమే సి.బి.ఐ వ్యవహరించిందని ఇందులో తనను బలిపశువు చేస్తున్నారని హరేన్ రావల్ ఆక్రోసిస్తున్నట్లు పత్రిక తెలిపింది.

పురోగతి నివేదికలను చూసిన తర్వాత సి.బి.ఐ అధికారులపై అశ్వినీ కుమార్ విరుచుకుపడినట్లు సోమవారం ఈనాడు పత్రికలో ప్రచురితమైన వ్యాసం ద్వారా తెలుస్తున్నది. అశ్విని కుమార్ ధోరణితో సి.బి.ఐ అధికారికి అహం దెబ్బతిన్నదని, అవమానంతో ఆయన ఈ సంగతిని పత్రికలకు లీక్ చేశారని వ్యాస రచయిత వీరేంద్ర కపూర్ తెలిపారు.

ఈ వరుస ఘటనల నేపధ్యంలో సి.బి.ఐ ని అఫిడవిట్ దాఖలు చేయాలని కోరిన సుప్రీం కోర్టు, అఫిడవిట్ లోని అంశాల పట్ల మంగళవారం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. క్రిక్కిరిసిన కోర్టు హాలులో జస్టిస్ ఆర్.ఏం.లోధా నేతృత్వంలోని బెంచి సి.బి.ఐ అధికారులను కడిగి పారేసింది. రంజిత్ సిన్హా అఫిడవిట్ లోని అంశాలు అత్యంత కలత చెందే విధంగా ఉన్నాయని సి.బి.ఐ సంస్ధ తన స్వతంత్రతను పునరుద్ధరించుకోవాలని సూచించింది. విచారణ నివేదికలను ప్రభుత్వంతో పంచుకోవడం వలన “మొత్తం (విచారణ) ప్రక్రియనే కుదిపివేసినట్లయింది” అని సుప్రీం వ్యాఖ్యానించింది. రాజకీయ యాజమానుల నుండి సూచనలు అందుకోవలసిన అవసరం సి.బి.ఐ కి లేదని బెంచి స్పష్టం చేసింది.

“మా మొదటి పని రాజకీయ జోక్యం నుండి సి.బి.ఐని విముక్తి చేయడం” అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీం వ్యాఖ్యలతో భారత రాజకీయ నాయకులు, వారితో నిండిన ప్రభుత్వాల నిజ స్వరూపం ఏమిటో మరోసారి తేటతెల్లం

అడిషనల్ సొలిసిటర్ జనరల్ హరీన్ రావల్

అడిషనల్ సొలిసిటర్ జనరల్ హరీన్ రావల్

అయింది. దేశంలోని ప్రధాన నేరాలను అరికట్టే అధికారాలు కలిగి ఉన్న నాయకులు, అధికారులే నేరాలకు పాల్పడుతూ, విచారణను కూడా పక్కదారి పట్టిస్తున్నారని స్పష్టం అవుతోంది. సి.బి.ఐ కి రాజ్యాంగం అప్పగించిన స్వతంత్ర ప్రతిపత్తి వాస్తవంలో లేదని ఉద్యోగ విరమణ తర్వాత ఒనగూడే అదనపు పదవుల కోసం బ్యూరోక్రాట్ అధికారులు రాజకీయ నాయకులు చెప్పినట్టల్లా ఆడుతున్నారని స్పష్టం అవుతోంది.

ఇదిలా ఉండగా సుప్రీం కోర్టు అక్షింతల నేపధ్యంలో న్యాయ శాఖ మంత్రి అశ్విని కుమార్ ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిసారని తెలుస్తోంది. అశ్వినీ కుమార్ సి.బి.ఐ పురోగతి నివేదికలను ప్రభావితం చేసిందే ప్రధాని మన్మొహన్ సింగ్ కోసం. సుప్రీం వ్యాఖ్యల తర్వాత ‘స్వతంత్ర భారతంలో అత్యంత అవినీతి ప్రభుత్వం యు.పి.ఎ-2’ అని బి.జె.పి విమర్శించగా, లెఫ్ట్ పార్టీలు అశ్వినీ కుమార్ రాజీనామా చేయాలనీ, ప్రధాని పార్లమెంటుకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసాయి. సుప్రీం కోర్టు ఇంకా తన అంతిమ అభిప్రాయం చెప్పలేదని అది వచ్చాక తదనుగుణంగా నిర్ణయిస్తామని కాంగ్రెస్ ప్రతినిధి జనార్ధన్ ద్వివేది పత్రికలతో అన్నారు. సుప్రీం కోర్టు వ్యాఖ్యలతో కేంద్ర ప్రభుత్వంలో సంక్షోభం ముసురుకుంటున్న ఛాయలు కనిపిస్తున్నాయి.

(సుప్రీం కోర్టు ఆదేశాల గురించి మరో టపాలో చూద్దాం.)

2 thoughts on “బొగ్గు: రాజకీయుల ఆదేశాలు తీసుకోవద్దు, సి.బి.ఐతో సుప్రీం

  1. *మా మొదటి పని రాజకీయ జోక్యం నుండి సి.బి.ఐని విముక్తి చేయడం*
    ఈ మాట ఆచరణ రూపం దాల్చిన రోజు, భారతదేశం అభివృద్ది పథంలోకి దూసుకొని వేళ్లే మొదటి రోజు అవుతుంది.

  2. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్న రాజకీయ, అధికార గణ ద్వయం వైఖరిలో మార్పు రావడం సాధ్యం కాదు. ఆదేశాలకు బదులు ఈ వ్యవహారంలో సీబీఐతో పాటు సంబంధిత మంత్రులపై కఠిన చర్యలకు ఆదేశిస్తే ఫలితం ఉండేదేమో

వ్యాఖ్యానించండి