మన్మోహన్ ఫైలుకి పరిష్కారం లేదు -కార్టూన్


Manmohan in & outది హిందు పత్రికలో కేశవ్ కార్టూన్లు చాలా సెన్సిబుల్ గా ఉంటాయి. ఒక్కోసారి కేశవ్ కవి కాబోయి కార్టూనిస్టు అయ్యారా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కార్టూన్లకు కవిత్వానికి ఉన్నంత లోతు ఉంటుంది. ఆ లోతు ఒక్కోసారి చాలామందికి అందదు. (నాక్కూడా.) ఈ కార్టూన్ అందులో ఒకటిగా కనిపిస్తోంది.

‘మిస్టర్ క్లీన్’గా ఒకప్పుడు మన్ననలు అందుకున్న మన్మోహన్ సింగ్ ఇప్పుడు అవినీతి రాజుగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మన్మోహన్ కి ఆపాదిస్తున్న అవినీతి ద్వారా ఆయన స్వయంగా లబ్ది పొందకపోవడమే మన్మోహన్ అవినీతిలోని విచిత్రం. తానుగా అవినీతికి పాల్పడకుండా అవినీతి పరులైన మంత్రులకు, కంపెనీలకు శక్తివంతమైన అవినీతి ఉపకరణంగా ఉపయోగపడడం మన్మోహన్ అవినీతిలో ప్రత్యేకత. ఆయన నేర్చుకుని, నమ్మి, అమలు చేస్తున్న ఆర్ధిక విధానాలు అనివార్యంగా ఆయనను ‘అవినీతి ఉపకరణం’ స్ధానంలో కూర్చోబెట్టాయి. ప్రభుత్వాన్ని శాసించగల శక్తివంతమైన స్ధానంలో కూర్చొని అవినీతికి పాల్పడకుండా ఉంటే సరిపోదు. ఆ స్ధానంలో ఉన్నవారు అవినీతి జరగకుండా కట్టడి చేయాలి కూడా. కానీ మన్మోహన్ అందుకు సిద్ధంగా లేరు. అందుకే భారత రాజకీయ రంగం, కార్పొరేట్ రంగం జమిలిగా పాల్పడుతున్న కోటాను కోట్ల అవినీతిలో ఆయన కూడా భాగస్వామి.

2జి కుంభకోణానికి సంబంధించి ప్రధాని మన్మోహన్ కి చెప్పకుండా తాను ఒక్క పనీ చేయలేదని మాజీ టెలికాం మంత్రి ఏ.రాజా జె.పి.సి కి రాసిన లేఖలో స్పష్టం చేశాడు. ఏ.రాజాను కూడా సాక్షిగా జె.పి.సి ముందుకు పిలవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినా ప్రధాని మన్మోహన్, ఇతర కాంగ్రెస్ నేతలను కాపాడడానికే ఏర్పాటయిన జె.పి.సి నేత చాకో అందుకు ఒప్పుకోలేదు. కానీ జె.పి.సి నివేదికలో ఏ.రాజా పేరు పాతిక కంటే ఎక్కువసార్లు వచ్చిందని పత్రికలు తెలిపాయి. ప్రత్యక్షంగా ఆయన పేరు పాతికపైన సార్లు వస్తే పరోక్ష ప్రస్తావనలకు లెక్కేలేదట. కానీ ఏ.రాజాను సాక్షిగా జె.పి.సి పిలవలేదు. ఇంతకంటే మించిన ‘అధికారిక అవినీతి కవరేజి’ ఇప్పటివరకు (భవిష్యత్తు ఎవరికి తెలుసు గనక!) మరొకటి లేదేమో.

ఇక  బొగ్గు కుంభకోణం ఇంకా ఘోరం. ప్రధాని మన్మోహన్ బొగ్గు మంత్రిగా ఉండగా జరిగిన కేటాయింపులన్నీ అక్రమమేనని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తేల్చి చెప్పింది. ఒక పద్ధతంటూ లేకుండా, అర్హత ఉన్నదీ లేనిదీ చూడకుండా అడిగినవాడికి అడిగినట్లు విస్తారమైన, అమూల్యమైన బొగ్గు గనులను ధారాదత్తం చేశారని సదరు కమిటీ తూర్పారబట్టింది. ఈ అవినీతిపైన సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సి.బి.ఐ విచారణ చేస్తుంటే సి.బి.ఐ నివేదికలను సైతం మన్మోహన్, ఆయన అనుంగు సహచరుడు అశ్వినీ కుమార్ ప్రభావితం చేయడానికి తెగబడ్డారు. మన్మోహన్ కి సన్నిహితుడుగా పేరు పొందిన అశ్వినీ కుమార్ ఎవరిని కాపాడడానికి సి.బి.ఐ ని ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారో పత్రికలు స్పష్టంగానే చెబుతున్నాయి.

ఇలాంటి ప్రధాని “IN” బాస్కెట్ లోనే శాశ్వత స్ధానం ఇచ్చేశారని, ఆయన “OUT” బాస్కెట్ లోకి పంపే ప్రయత్నాలేమీ లేవని కార్టూనిస్టు సూచిస్తున్నట్లు కనిపిస్తోంది. ఖాళీగా ఉన్న బాస్కెట్ కు “OUT” లేబుల్ ఉండాల్సిఉండగా ఆ లేబుల్ లేదు. అంటే మన్మోహన్ “IN” స్ధానాన్ని కాంగ్రెస్ రాసి ఇచ్చేసిందని అర్ధం కాబోలు. మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పరచగల బలం కాంగ్రెస్ కి వస్తే మళ్ళీ ప్రధాని అయ్యే అవకాశాన్ని మన్మోహన్ సింగే కొట్టిపారేయడం లేదని పత్రికలు చెబుతున్నాయి. మరో పక్క రాహుల్ గాంధీ తాను ప్రధాని పదవికి అర్హుడిని కాదని పదే పదే చెబుతున్నారు. ఆత్మాభిమానం లేకుండా, తన సొంత బుర్రతో ఆలోచించకుండా, అమ్మగారు, యువరాజు, మంత్రులు, కంపెనీల అధిపతులు, విదేశీ పెత్తందార్లు ఇత్యాదూలంతా చెప్పిందల్లా చేయగల విధేయుడు ఇంతకు మించి మరొకరు లేరేమో. అందుకే మన్మోహన్ అవినీతి ఫైలుకి పరిష్కారం లేదు.

One thought on “మన్మోహన్ ఫైలుకి పరిష్కారం లేదు -కార్టూన్

వ్యాఖ్యానించండి