తాటిచెట్టు ఎందుకెక్కావంటే దూడ మేతకు అన్నాట్ట! -కార్టూన్


Coal-gate

“అబ్బే ఏ దారిలో వెళ్లాలో తెలుసుకోడానికి ఇక్కడకు వచ్చారంతే!”

బొగ్గు కుంభకోణం నుండి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ను, ఆయనతో పాటు కాంగ్రెస్ (యు.పి.ఏ) ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అధికార పార్టీ నేతలు పిల్లి మొగ్గలు అన్నీ ఇన్నీ కాదు. బొగ్గు కుంభకోణం పైన విచారణ జరుపుతున్న సి.బి.ఐ సుప్రీం కోర్టుకు దశలవారీగా స్ధాయి నివేదికలను (status reports) సమర్పిస్తోంది. మార్చి నెలలో నివేదికను కోర్టుకు సమర్పించడానికి ముందు న్యాయ శాఖ మంత్రి అశ్వని కుమార్ సి.బి.ఐ అధికారులను పిలిపించుకుని నివేదికలో సవరణలు చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఎందుకలా చేశారని ప్రతిపక్షాలు అడిగితే తాను సవరణలు ఏమీ చేయలేదని నివేదికలో గ్రామర్ తప్పులు ఉంటే వాటిని సవరించడం మాత్రం చేశాడని ఉభయ సభల్లో కాంగ్రెస్ పెద్దలు సమర్ధించుకొచ్చారు.

అంతకుముందు సుప్రీం కోర్టులో ప్రభుత్వం తరపున హరీన్ రావల్ ఇచ్చిన హామీకి ఇది విరుద్ధం. ఆరోపణలు తిరస్కరిస్తూ ఆయన సి.బి.ఐ నివేదిక కేవలం కోర్టుకు మాత్రమే సంబంధించినదని, దానిని ప్రభుత్వంలో ఎవరూ చూడడానికి ఉద్దేశించింది కాదని, ఎవరు చూడను కూడా లేదని సుప్రీం కోర్టుకు గట్టిగా చెప్పాడు. తీరా పార్లమెంటులో ఇచ్చిన సమాధానాలు చూస్తే ప్రభుత్వం మంత్రి సి.బి.ఐ నివేదికను చూడలేదని చెప్పలేదు. చూశాడని చెబుతూనే వ్యాకరణ దోషాలు సవరించాడు తప్ప నీరుగార్చలేదని వివరించారు.

కానీ సి.బి.ఐ డైరెక్టర్ రంజిత్ సింగ్ సుప్రీం కోర్టులో అఫిడవిట్ సమర్పిస్తూ తమ నివేదికను న్యాయ మంత్రి చూడారని తేల్చి చెప్పాడు. న్యాయశాఖ మంత్రి అశ్వని కుమార్ మాత్రమే కాక, ప్రధానమంత్రి కార్యాలయం, బొగ్గు మంత్రిత్వ శాఖల జాయింట్ డైరెక్టర్లు కూడా నివేదికను చూశారని చెప్పాడాయన. అయితే నివేదికలో వారేమయినా మార్పులు చేశారా అన్నది సి.బి.ఐ కోర్టుకు చెప్పలేదు. ఈ విషయంలో కోర్టు ఏమి చెప్పబోతుందో తదుపరి హియరింగ్ లో తేలాక మంత్రి, కార్యదర్శుల జోక్యం దరిమిలా మంత్రి భవితవ్యం ఏమిటో తేలుతుంది. రాజీనామా చేసేది లేదంటున్న న్యాయ మంత్రి పైన సుప్రీం కోర్టు ఏమి చెబుతుందోనని రాజకీయ, బ్యూరోక్రాట్ వర్గాలు ఆతృతగా, ఆందోళనగా ఎదురు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు.

అశ్వనీ కుమార్ ‘వ్యాకరణ దోషాల’ వాదన ఎంత హాస్యాస్పదంగా ఉందో ఈ కార్టూన్ చక్కగా వివరిస్తోంది.

వ్యాఖ్యానించండి