ఇటలీలో ఎట్టకేలకు ఒక ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఎన్నికలు ముగిసి రెండు నెలలు దాటినా అక్కడ ప్రభుత్వం ఏర్పడలేదు. ఏ పార్టీకి గానీ, ఏ కూటమికి గానీ ప్రభుత్వం ఏర్పాటు చేయగల మెజారిటీ రాకపోవడంతో ఇన్నాళ్లూ పాత ప్రధాని నేతృత్వంలోనే తాత్కాలిక ప్రభుత్వం నడిచిందక్కడ. అయితే శనివారంతో ప్రతిష్టంభనకు తెరపడింది. తెరపడడం కాదు గానీ విచిత్ర పద్ధతిలో తెరపడడమే అసలు వార్త. రాజకీయ సమతలం పైన దాదాపు వైరి శిబిరాలుగా వ్యవహరించే మిత వాద కూటమి, వామపక్ష పార్టీల భాగస్వామ్యంతో కూడిన సెంటర్-లెఫ్ట్ కూటమి కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి నిర్ణయించడం ఇక్కడ అసాధారణం.
సెంటర్-లెఫ్ట్ కూటమి నాయకుడు ఎన్రికో లెట్టా నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నాడు. మాజీ ప్రధాని, ఇటలీలో అత్యంత ధనికుల్లో ఒకరైన సిల్వియో బెర్లుస్కోనికి చెందిన మితవాద కూటమి లెట్టాకు జూనియర్ భాగస్వామిగా ప్రభుత్వంలో చేరుతోంది. బెర్లుస్కొని కూటమి ధనిక వర్గాల పక్షపాతిగా పేరు పొందింది. లెట్టా నేతృత్వంలోని సెంటర్-లెఫ్ట్ కూటమి విషయానికి వస్తే తాను కార్మిక వర్గ పక్షపాతిని అని చెప్పుకుంటుంది. ధనిక వర్గాలకు, కార్మిక వర్గానికి ప్రాతినిధ్యం వహించే రెండు కూటమిలో ఒకే చూరు కింద చేరి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాయన్నమాట! అంటే ఇది వర్గ సంకర ప్రభుత్వం.
నూతన ప్రధాని లెట్టా మోడరేట్ గా పేరుపడిన వ్యక్తి. ది హిందు పత్రిక ప్రకారం ఆయన మాజీ ప్రధాని బెర్లుస్కొని చాలాకాలం రాజకీయ సలహాదారుగా పని చేసిన గియాన్ని లెట్టాకు మేనల్లుడు కూడాను. బంధుత్వమే పని చేసిందో, ఎన్రికో లెట్టా కి ఉన్న ‘మోడరేట్’ అనే ముద్రే ఉపయోగపడిందో కలవవు అనుకున్న రెండు కూటములు భుజం భుజం కలిపి ప్రయాణం మొదలుపెట్టాయి. నూతన ప్రభుత్వంలో బెర్లుస్కొని మరో రాజకీయ సలహాదారు ఏంజెలీనో అల్ఫానో అంతర్గత మంత్రి (హోమ్ మంత్రి) గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అంటే బెర్లుస్కొని పైన ఉన్న అవినీతి కేసులు, సెక్స్ స్కాండల్ కేసులు తగిన విధంగా పరిష్కరించబడతాయని అర్ధం చేసుకోవచ్చు.
అసలు బెర్లుస్కొని మళ్ళీ ఎన్నికల బరిలోకి దిగింది కూడా అందుకేనని పత్రికలు ముందే ఊహించాయి. ప్రధాని పదవి పైన ఆయనకి దృష్టి లేదని తగినన్ని సీట్లు సంపాదించి నూతన ప్రభుత్వ ఏర్పాటులో తన సహాయం తీసుకోక తప్పని పరిస్ధితి కల్పించి తద్వారా తనపైన ఉన్న కేసులను పక్కదారి పట్టించడమో, మాఫీ చేసుకోవడమో చేయాలన్నదే ఆయన పధకం అని పత్రికలు ఊహించాయి. ఇపుడు సరిగ్గా అదే జరుగుతోంది.
చూడడానికి సిద్ధాంత పరంగా వర్గ సంకర ప్రభుత్వం లాగానే కనిపించినా, వాస్తవానికి అది ఏక వర్గ ప్రభుత్వమే. అంటే చెప్పడానికి లెఫ్ట్ అనీ, సెంటర్ అనీ భావాలు వ్యక్తం చేసే సెంటర్-లెఫ్ట్ పార్టీలు, ముఖ్యంగా లెఫ్ట్ పార్టీలు ఏనాడో కార్మికవర్గ సిద్ధాంతానికి టోలోదకాలు ఇచ్చేశాయి. కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని గాలికి వదిలేసి, కార్మిక వర్గ విప్లవాల కోసం కృషి చేయడం మానేసి ధనిక వర్గాలతో చెట్టాపట్టాలు వేసుకుంటూ వారికి సేవలు చేయడమో అవి నిమగ్నం అయ్యాయి. కనుక వ్యక్తం చేసే భావాల పరంగా వర్గ సంకర ప్రభుత్వమే అయినా వాస్తవిక ఆచరణ పరంగా అది ఏక వర్గ ప్రభుత్వమే; అనగా ధనిక వర్గాల ప్రభుత్వమే.
