జనం బాధలంటే రాజకీయ నాయకులకు ఎంత చులకనో! ప్రజల కష్టాలకు వారు ఎదుర్కొంటున్న మోసాలకు సానుభూతి పలుకుతూనే వారి పరిస్ధితి పైన కుళ్ళు జోకులు వేయడం నాయకులకు తేలికైన విషయం. తాజాగా మమతా బెనర్జీ కూడా ఇలాంటివారి జాబితాలో చేరిపోయారు.
పశ్చిమ బెంగాల్ లో శారదా చిట్ ఫండ్స్ సంస్ధ బోర్డు తిప్పేయడంతో లక్షలాది జనం దాచుకున్న సొమ్ము కోల్పోయి గొల్లుమంటున్నారు. మోసపోయిన వారి కోసం 500 కోట్ల రూపాయల కార్పస్ నిధి ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి మమత ప్రకటించింది. అంతవరకు బాగానే ఉంది. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి లేదా కేంద్ర మంత్రి ఇలా ఆర్ధిక మోసాలకు గురయిన ప్రజల కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. మమత మొదటిసారి ఆ పని చేసిందని భావిస్తుండగానే ఆ వెంటనే మరో వార్త కనపడింది.
మమత ప్రకటించిన 500 కోట్ల రూపాయల నిధుల కోసం ఆమె సిగరెట్ అమ్మకాల పైన 10 శాతం అదనపు పన్ను విధించింది. ఈ పన్ను వసూలయితేనే ప్రకటించిన మేరకు 500 కోట్ల సర్దుబాటు సాధ్యపడుతుంది. ప్రకటిత మొత్తం సమకూరడానికి జనం మామూలు కంటే ఎక్కువ సిగరెట్లు తాగాలని మమత కోరిందని పత్రికలు తెలిపాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతున్నది ఏమీ లేదన్నమాట!
విద్యారంగం కోసం అత్యంత తక్కువ మొత్తంలో ఖర్చు పెడుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ మొత్తాన్ని పెంచడం కోసం ‘ఎడ్యుకేషన్ సెస్’ పేరుతో ఆదాయ పన్ను పైన 3 శాతం సెస్ విధించినట్లు శారదా చిట్ ఫండ్ మోసం వల్ల నష్టపోయినవారిని ఆదుకోవడానికి ప్రజల్లో ధూమపానం అలవాటు పెరగాలని మమత కోరుతోంది. చూడ్డానికి బెంగాల్ ముఖ్యమంత్రి జోకినట్లు కనిపించినా మోసం చేసినవారి నుండి వసూలు చేసి చెల్లించడానికి బదులు జనం లోనే ధూమపానం చేసేవారి చేత చెల్లింపులు చేయించడానికి మమత ఎత్తు వేసింది. ఇది జోకు అని మమత చెప్పదలిస్తే అయితే ‘క్రూయెల్ జోక్’ అని చెప్పక తప్పదు.
త్రీణమూల్ కాంగ్రెస్ రెబెల్ ఎం.పి కబీర్ సుమన్ మమత క్రూయెల్ జోక్ ని విమర్శించాడు. “పొగ తాగడం చెడ్డ విషయం. దానిపైన పన్ను వేస్తే వెయ్యొచ్చు గాక! కానీ సుదీప్త సేన్ (శారదా చిట్స్ అధినేత) చేసిందానికి నేను బాధ్యుడినా? నేను తాగే ప్రతి సెగరెట్ కి అదనపు పన్ను నేను ఎందుకు చెల్లించాలి? నేనేమీ ప్రజల్ని పీడించలేదే. నేనేమీ వారి డబ్బును పిండుకోలేదే” అని కబీర్ సుమన్ ప్రశ్నించాడని డెక్కన్ హెరాల్డ్ తెలిపింది.
కబీర్ సుమన్ మాటల్లో వాస్తవం ఉన్నది.