పసి పాపల పైన అత్యాచారాలు జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో తాజాగా జార్ఖండ్ చేరిపోయింది. రెండో తరగతి చదువుతున్న ఆరేళ్ళ బాలిక బుధవారం అత్యాచారానికి గురయింది. అత్యాచారం సంగతి బైటికి వస్తుందన్న ఉద్దేశ్యంతో పాపని గొంతు పిసికి చంపేశారు. నిందితుడు ఎవరైందీ ఇంకా ఆచూకీ దొరకలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదును కేస్ డైరీలో నమోదు చేసిన పోలీసులు వాళ్ళకి, వీళ్ళకి సమాచారం ఇవ్వడం తప్ప స్వయంగా వెతకడానికి పూనుకోలేదని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అత్యాచారం జరిగిందని భావించడానికి ప్రాధమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని, అయితే అటాప్సి పరీక్ష ఫలితాలు వచ్చాకనే నిర్ధారణ చేస్తామని పోలీసులు చెప్పారు.
జార్ఖండ్ రాజధాని రాంచి నగరంలోని దోరందా లో ఈ దారుణం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం పాఠశాల నుండి ఇంటికి వచ్చిన అమ్మాయి ఆ తర్వాత కనిపించకుండా పోయింది. సాయంత్రం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పోలీసులు సరైన ప్రయత్నాలు చేయలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇరుగు పొరుగు వారితో కలిసి బుధవారం రాత్రంతా వెతికిన తల్లిదండ్రులు గురువారం తెల్లవారు ఝామున 3 గంటలకు ఒక నిర్మాణంలో ఉన్న ఇంటిలో తమ కూతురు శవాన్ని కనుగొన్నారు. వారు చూసేటప్పటికి చేతులు, కాళ్ళు తాడుతో కట్టేసి ఉన్నాయని ‘ది హిందు’ తెలిపింది.
“ప్రాధమిక ఆధారాలను బట్టి పాప పైన అత్యాచారం జరిగినట్లు అర్ధమవుతోంది. నిర్ధారణ చేయడానికి మేము వైద్య నివేదికల కోసం ఎదురు చూస్తున్నాము. స్ధానిక పోలీసులు నిన్న పెట్రోలింగ్ నిర్వహించారు. దోషి ఎవరో తెలుసుకోవడానికి ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నాం” అని హాతియా డి.ఎస్.పి తెలిపాడు. రాంచి లోని రిమ్స్ ఆఉపత్రిలో అటాప్సి నిర్వహించినట్లు తెలుస్తోంది. ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
అమ్మాయి తండ్రి వేతన కూలి. ఉదయం 10:30 కి స్కూల్ నుండి ఇంటికి వచ్చిందని, అరగంట తర్వాత కనిపించలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. “స్కూల్ నుండి వచ్చాక పొరుగునే ఆడుకోవడానికి అమ్మాయి బైటికి వెళ్లింది. కానీ అర గంట తర్వాత కనిపించలేదు. ఎవరి ఇంటికయినా వెళ్ళి ఉంటుందని మొదట ఇక్కడ అన్నీ ఇళ్ళల్లో వెతికాము. ఐనా కనపడలేదు. ఎవరో పట్టుకుపోయి ఉంటారని భయపడి సాయంత్రం 6-7 గంటలప్పుడు దోరందా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాము” అని కుటుంబ సభ్యుడొకరు చెప్పారు.
విషయం తెలిసిన వెంటనే తాము వైర్ లెస్ సెట్స్ ద్వారా అన్ని స్టేషన్లకు సందేశం పంపించామని దోరందా పోలీసు స్టేషన్ అధికారులు చెబుతున్నారు. పాలను వెతకడంలో తల్లిదండ్రులకు పేట్రోలింగ్ పోలీసులు సాయం చేశారని వారు చెబుతున్నారు. అయితే సామాజిక కార్యకర్తలు దీనిని తిరస్కరిస్తున్నారు. పోలీసులు స్వయంగా వెతకవలసి ఉండగా అది జరగలేదని, చివరికి తల్లిదండ్రులే వెతికి శవాన్ని కనుగొన్నారని వారు తెలిపారు.
పోలీసుల దుర్మార్గం
“కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా దోరందా పోలీసులు కేవలం స్టేషన్ డైరీలో ఒక ఎంట్రీ రాసారంతే. మిస్సింగ్ ఫిర్యాదు ఏది వచ్చినా అది మామూలుగా జరిగిపోతుంది. అంతకు మించి వారేమీ చేయలేదు. చురుగ్గా వెతికే ప్రయత్నాలు చేయలేదు. గత డిసెంబర్ లో కనపడకుండా పోయిన 15 సంవత్సరాల బాలిక ఢిల్లీలో సరోజినీ నగర్ నుండి తల్లిదండ్రులకు ఫోన్ చేసి తనను లైంగికంగా వేధిస్తున్నారని, కొడుతున్నారని చెప్పింది. ఈ విషయం పోలీసులకు చెప్పినా ఇంతవరకు పట్టించుకోలేదు” అని రాంచి లో పని చేసే ప్రభుత్వేతర సంస్ధ ‘దివ్య సేవ సంస్ధ’ ఉద్యోగి బైద్యనాధ్ కుమార్ చెప్పాడని ది హిందు తెలియజేసింది.
పోలీసుల స్పందనా రాహిత్యం, మొరటుతనం, సమాజం నుండి విడివడిన పరిస్ధితి ఈ కొద్ది రోజుల్లోనే అదీ పసిపిల్లల అత్యాచారాల విషయంలోనే దేశం ముందు రుజువయింది. పసి పాప పైన అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు తీసుకోకపోగా దొరికింది సంతోషించమని చెప్పిన పోలీసులు ఢిల్లీలో ఉన్నారు. ఈ కేసులో ఆందోళన చేస్తున్న యువతుల పైన ఒక పోలీసు ఉన్నతాధికారి అత్యంత హీనంగా చేయి చేసుకున్న దృశ్యం వార్తా ఛానెళ్లలో ప్రసారం అయింది. (ఆ దృశ్యాన్ని ఎన్.డి.టి.వి వెబ్ సైట్ లో ఇక్కడ చూడవచ్చు.)
ఉత్తర ప్రదేశ్ లో కూడా ఇదే తరహాలో పోలీసులు బాధితుల పైనే వీరత్వం ప్రదర్శించారు. ఆరేళ్ల పాపని అత్యాచారం చేసి చంపేసి చెత్తకుండీలో పారేశారు. ఈ ఘోరం గురించి అడుగుతున్నందుకు ఆ పాప తల్లిని కొందరు పోలీసులు రోడ్డు పైన పడేసి ఈడ్చిపారేస్తే, ఆందోళనలో భాగం పంచుకోడానికి వచ్చిన అరవైయేళ్ల ముసలావిడని ఉత్తి పుణ్యానికి లాఠీతో రోడ్డుమీదికి తోసేశాడు మరొక సర్కిల్ స్ధాయి పోలీసు అధికారి. (ఆ షాకింగ్ వీడియో ఇక్కడ చూడండి.)
పోర్నోగ్రఫీ
బూతు సినిమాలు పసి పిల్లలపై సైతం అత్యాచారాలకు ప్రేరేపిస్తున్నాయా? ఢిల్లీ బాలిక కేసులో నిందితుడి ఒప్పుకోలు ఈ అనుమానం కలిగిస్తోంది. ఢిల్లీలో అత్యాచారం అనంతరం ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఐదేళ్ల పాప కేసులో నిందితుడు అత్యాచారానికి ముందు ఒక బూతు సినిమా చూశాడని ఢిల్లీ పోలీసులను ఉటంకిస్తూ ఎన్.డి.టి.వి తెలిపింది. బూతు సినిమాలు సెల్ ఫోన్లకు తేలికగా అందుబాటులో ఉన్నాయని లైంగిక నేరాలు పెరగడానికి ఇది ఒక కారణం కావచ్చని ఎన్.డి.టి.వి సూచిస్తోంది.
అయితే ఐ.టి జూనియర్ మంత్రి మిళింద్ దేవర బూతు సినిమాలను ఇంటర్నెట్ నుండి నిషేదించడం కుదరదని స్పష్టం చేస్తున్నాడు. ఒక ఆశ్చర్యకరమైన ప్రతిపాదన కూడా ఆయన చేస్తున్నాడు. “ఒక్క ఊపులో (in a jerk) అలాంటి వాటిని నిషేధించడం కుదరదు. శాంతి భద్రతల విషయంలో ప్రజలతో సంప్రదించడం ముఖ్యం. అలాంటి విషయాలలో సైకాలజిస్టులను, సామాజిక శాస్త్రవేత్తలను సంప్రదించి వారి అభిప్రాయాలూ తీసుకోవడం అవసరం” అని ఆయన అన్నాడు. ఒక్క ఊపులో కాకపోయినా ఎన్ని ఊపుల్లో నిషేధిస్తారో మంత్రి చెప్పి ఉంటే బాగుండేది. అదీకాక బూతు నిషేధించడానికి సైకాలజిస్టులు, సామాజిక శాస్త్రవేత్తల అనుమతి అవసరం ఏమిటి? బూతు నిషేధించొద్దని ఎవరు చేప్గలరు? బిలియన్ల కొద్దీ ఆదాయం ఆర్జిస్తున్న రాజకీయ ధనికులు, వ్యాపారులు తప్ప!
అత్యాచార ప్రతీకారం
“Rape is more about power and domination than sex.” అన్నది ఎంత వాస్తవమో బీహార్ లోని ఈ సంఘటన స్పష్టంగా చెబుతోంది. తమ కుటుంబానికి చెందిన అమ్మాయిని తమ అనుమతి లేకుండా పెళ్లి చేసుకుని కనపడకుండా పోయిన యువకుడి పైన ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఆ యువకుడి తల్లి, చెల్లెళ్లను బలాత్కరించారు అమ్మాయి తరపు బంధువులు.
ఎన్.డి.టి.వి ప్రకారం చంపారన్ జిల్లాలోని ఒక మహిళ, ఆమె 14 యేళ్ళ కూతురిని ఆరుగురు దుండగులు చెరబట్టి సామూహికంగా అత్యాచారం చేశారు. సదరు మహిళ కుమారుడు వారి కుటుంబంలోని అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారు ఎక్కడ ఉన్నదీ అతని తల్లికి తెలిసీ చెప్పడం లేదని అమ్మాయి తరపు వారి అనుమానం. పెళ్లి జరిగి మూడు నెలలయినా వారికి తమ అమ్మాయి ఆచూకీ గానీ కోపం తీర్చుకోవడానికి యువకుడి ఆచూకీ గాని వారికి తెలియలేదు.
దానితో వారు యువకుడి తల్లిని, ఆమె కూతురిని ఏప్రిల్ 18 న కిడ్నాప్ చేశారు. పశ్చిమ చంపారన్ జిల్లాలోని జోకాటియా గ్రామంలో ఈ ఘటన జరిగింది. కిడ్నాప్ చేసిన తర్వాత తల్లీ కూతుళ్ళు ఇద్దరి పైనా ఆరుగురు వ్యక్తులు అత్యాచారం జరిపారు. తమ కూతురిని తీసుకెళ్లినందుకు వారు ఆ విధంగా ప్రతీకారం తీర్చుకున్నారని పోలీసులు చెప్పారు. సంఘటన జరిగిన 36 గంటల్లో ఆరుగురిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. అదే యువకుడి తండ్రి పైన ప్రతీకారం తీర్చుకోదలిస్తే కొట్టడం జరిగి ఉండేది. కానీ ప్రతీకారేచ్చ అత్యాచారాన్ని కోరుకుంది. తమ అమ్మాయిని తీసుకెళ్లారు గనక ప్రత్యర్ధి స్త్రీలను వారు బలి కోరారు. కూతురు ఇష్టపూర్వకంగా వెళ్ళడం కూడా వారికి నచ్చలేదు. పరువు హత్యకు ప్రత్యామ్నాయంగా వారికి ప్రత్యర్ధి స్త్రీలు కనిపించిన ఫలితమే వావి వరుసలు మరిచిన హీనత్వం.
అత్యాచారాలు అన్నీ ఇలాగే జరుగుతున్నాయని కాదు. కారణం ఏదైనా అంతిమంగా సమాజంలో బలహీన స్ధాయిలో ఉన్న స్త్రీలు బలి కావడం ఇక్కడ దారుణమైన విషయం.