బొగ్గు కేటాయింపులు చట్ట విరుద్ధం -పార్లమెంటు కమిటీ


Manmohan-Singh-coal-scamబొగ్గు గనుల కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వం నియమించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రభుత్వ నిర్వాకాన్ని ఎండగట్టింది. ఇష్టమొచ్చిన వారికి ఇష్టారీతిన బొగ్గు గనులను కేటాయించారని, గనుల కేటాయింపులో ఎలాంటి పారదర్శకత గానీ, సక్రమమైన పద్ధతులు గానీ పాటించలేదని దుయ్యబట్టింది. ప్రజలు అప్పజెప్పిన అధికారాన్ని తీవ్రంగా దుర్వినియోగపరిచారని జాతీయ సహజ వనరులను కొద్ది సంఖ్యలోని కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఉదారంగా దోచిపెట్టిందని తేల్చి చెప్పింది. 1993-2010 మధ్య కాలంలో దేశాన్ని పాలించిన ప్రభుత్వాలన్నీ దేశానికి మసి పూయడంలో భాగస్వామ్యం వహించారని కమిటీ, ప్రభుత్వాలను తూర్పారబట్టింది.

వివిధ కంపెనీల కోసం ఉద్దేశించిన బొగ్గు గనులను అభివృద్ధి చేయకపోయినప్పటికీ ప్రభుత్వాలు అదేమని అడిగిన పాపాన పోలేదని నివేదించింది. ‘బొగ్గు/లిగ్నైట్ గనుల కేటాయింపు, అభివృద్ధి, సామర్ధ్య నిర్ధారణల సమీక్ష’ పేరుతో పార్లమెంటు స్టాండింగ్ కమిటీ రూపొందించిన విచారణ నివేదికను మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. యు.పి.ఏ ప్రభుత్వాలతో పాటు ఎన్.డి.ఏ ప్రభుత్వ హయాములో కూడా బొగ్గు కుంభకోణం వ్యాప్తి చెందిన విషయం కమిటీ నిగ్గు దేల్చడంతో ఈ కుంభకోణం చివరికి విచారణకు వెళ్లకుండా చేయడంలో పాలక, ప్రతిపక్షాలు లోపాయకారీగా ఒక్కటయ్యే అవకాశం కనిపిస్తోంది.

1993-2010 మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వాలు జరిపిన బొగ్గు గనుల కేటాయింపులన్నీ అనధికారికంగా జరిగాయని, అవన్నీ చట్ట విరుద్ధమేనని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తేల్చిచెప్పింది. అక్రమంగా, చట్ట విరుద్ధంగా జరిగిన కేటాయింపులన్నింటినీ రద్దు చేయాలని, కనీసం ఇప్పటివరకూ ఉత్పత్తి ప్రారంభించని గనులనయినా రద్దు చేయాలని కమిటీ సిఫారసు చేసింది.

“1993-2010 మధ్య కాలంలో (బొగ్గు గనుల) కేటాయింపుకు అత్యంత గోప్యమైన విధానాన్ని అనుసరించారు… ప్రభుత్వం ఉదార బుద్ధితో, యధేచ్చగా, తన చిత్తం వచ్చిన రీతిలో కేటాయింపులు జరపడానికి వీలు లేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 1993-2004 మధ్య కాలంలో బొగ్గు గనుల దరఖాస్తులు ఎవరెవరి నుండి ఎన్నెన్ని వచ్చినదీ బొగ్గు మంత్రిత్వ శాఖ అసలు రికార్డులు నిర్వహించకపోవడం… ఒక నిర్దిష్ట కంపెనీ చేసిన దరఖాస్తును పరిగణించడానికి స్క్రీనింగ్ కమిటీ జరిపిన సమావేశాల మినిట్స్ మాత్రమే అందుబాటులో ఉంచారు” అని కమిటీ నివేదిక పేర్కొన్నట్లుగా ది హిందు తెలిపింది.

ఉద్దేశ్యపూర్వకంగానే….

మొత్తం కేటాయింపుల పద్ధతే అనధికారికంగా జరిగినందున ఏ ఒక్క కంపెనీ కూడా అక్రమ వేలంల లబ్ది పొందడానికి వీలు లేదని కమిటీ స్పష్టం చేసింది. కనుక కేటాయించిన బొగ్గు గనులన్నింటినీ -కనీసం ఉత్పత్తి ప్రారంభం కానీ గనులనయినా- వెంటనే రద్దు చేయాలని కోరింది. ప్రైవేటు కంపెనీలు “ఉద్దేశ్యపూర్వకంగానే” తమకు కేటాయించిన గనులను అభివృద్ధి చేయకుండా అట్టే పెట్టుకున్నాయని నివేదిక ఆరోపించింది.  సమీక్ష/మానిటరింగ్ కమిటీలు అంతిమ ప్రాజెక్టుల అంశాన్ని (బొగ్గు గనులను వాస్తవంగా ఎందుకు పొందాయి అన్న అంశాన్ని) పూర్తిగా విస్మరించాయని ఫలితంగా కేటాయింపుల ప్రక్రియ మొత్తం లక్ష్య రహిగంగా, గోప్యంగా జరిగిందని భావించడానికి బలం చేకూరిందని నివేదిక తేల్చి చెప్పింది.

ప్రైవేటు కంపెనీలు తమకు కేటాయించబడిన గనులను అభివృద్ధి చేయకపోవడంపై కమిటీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ విషయంలో బొగ్గు మంత్రిత్వ శాఖ నుండి వివరణ కోరింది. అంతిమ ప్రాజెక్టు ఏమిటో వివరం లేని కంపెనీల జాబితా తమకు ఇవ్వాలని మంత్రిత్వ శాఖను కోరింది. “ఇప్పటివరకు 195 బొగ్గు బ్లాకులను కేప్టివ్-మైనింగ్ కోసం కేటాయిస్తే అందులో 30 బ్లాకుల్లో మాత్రమే ఉత్పత్తి ప్రారంభం అయింది. 2004-2008 మధ్య కేటాయించిన 166 కేప్టివ్-మైనింగ్ గనుల్లో కేవలం 2 మాత్రమే ఉత్పత్తి ప్రారంభించాయి.” అని కమిటీ తన నివేదికలో వివరించింది. 195 బ్లాకుల్లో 44.23 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ వెలికి తీసిన బొగ్గు విలువను మదింపు చేయడానికి ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడంపై కమిటీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పర్యవేక్షక కమిటీ ఉదాసీన వైఖరి వల్లనే బొగ్గు గనుల అభివృద్ధి జరగలేదని కమిటీ ఆరోపించింది.

యు.పి.ఏ ప్రభుత్వ హయాంలో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ప్రత్యక్ష పర్యవేక్షణలోనే భారీ సంఖ్యలో బొగ్గు గనులను కేటాయించారు. కమిటీ నివేదికను బట్టి 1993-2010 మధ్య కాలంలో 195 బ్లాకులను కేటాయించగా ప్రధాని బొగ్గు మంత్రిగా విధులు నిర్వహించినా 2004-2008 మధ్య కాలంలోనే 166 బ్లాకుల కేటాయింపులు జరిపినట్లు కమిటీ నివేదిక ద్వారా స్పష్టం అవుతోంది. అంటే బొగ్గు కుంభకోనానికి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యక్ష బాధ్యులని తేలుతోంది. ఇలాంటి పరిస్ధితిలో తక్షణం తన పదవికి రాజీనామా చేయ్వలసిన ప్రధాని ఇంకా చూరు పట్టుకుని వేలాడడం గర్హనీయం. ప్రధాని రాజీనామా చేయాలన్న విపక్షాల డిమాండును కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చడం ఇంకా గర్హనీయం. భారత దేశంలో పార్లమెంటరీ బురద భరించలేని దుర్గంధాన్ని వెదజల్లుతోందనడానికి ఇంతకంటే మరో దృష్టాంతం అవసరం లేదు.

ప్రజల చేత ఏనాడూ ప్రత్యక్షంగా ఎన్నుకోబడని ఒక వ్యక్తి, హార్వర్డ్ యూనివర్సిటీలో అంతర్జాతీయ బహుళజాతి కంపెనీలకు ఎలా సేవలు చేయాలో నేర్చుకుని వచ్చిన ఒక ప్రజా వ్యతిరేక మేధావి, పేద దేశాల వనరులను పశ్చిమ దేశాలకు కట్టబెట్టడంలో వరల్డ్ బ్యాంకులో ఓనమాలు దిద్దుకుని వచ్చిన ఒక దళారీ… భారత దేశం లాంటి పదుల కోట్ల వెనుకబడిన ప్రజలకు నాయకత్వం వహిస్తున్నపుడు ఏమి జరుగుతుందో దేశంలో ఇప్పుడు అదే జరుగుతోంది.

3 thoughts on “బొగ్గు కేటాయింపులు చట్ట విరుద్ధం -పార్లమెంటు కమిటీ

  1. ఎవరో హార్వర్డ్ లో చదువుకుని వచ్చిన ఆయన ఏదొ అయ్యడన్నారు అక్కడ ఎవరి ఏమి అవుతారో మన చెతుల్లో లేదు కదా ఇది పరోక్ష ప్రజాస్వామ్యం ఇక్కద మనం ఎవరిని ఎన్నుకుంటున్నాం? కాంట్రాక్టర్లని ,వ్యాపారులని, నడవ లేని వాల్లని, మాత్ల్లాడ లేని వాల్లని మనం ఎన్నుకోని ఆ హార్వర్డ్ మేధావిని నిందించటం ఎందుకు ఐనా మనం పంపుతున్న ప్రతినిధులకి ఆయన లాంటి వాల్లే కరెక్ట్

వ్యాఖ్యానించండి