ఢిల్లీలో ఐదేళ్ల పాపపై జరిగిన అత్యాచారం విషయంలో దేశం నిశ్చేష్టురాలై ఉండగానే మధ్య ప్రదేశ్ లో మరో ఐదేళ్ల పాపపై దాదాపు అలాంటి ఘోరమే చోటు చేసుకుంది. ఐదేళ్ల పాప పైన 35 సంవత్సరాల త్రాష్టుడొకరు లైంగిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ పాప కూడా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని పత్రికలు చెబుతున్నాయి. పరిస్ధితి క్షీణించడంతో పాపను హుటాహుటిన నాగపూర్ కి ఎయిర్ అంబులెన్సు లో మహారాష్ట్ర లోని నాగపూర్ కి తరలించారు.
మధ్య ప్రదేశ్ లోని ఘన్సౌర్ పట్నంలో ఈ దారుణం జరిగింది. ఏప్రిల్ 17 తేదీన మైనర్ బాలికను చాక్లెట్ తో ఊరించి తీసుకెళ్ళాడు. అత్యాచారం జరిపిన అనంతరం పాప స్పృహ కోల్పోవడంతో పొలాల్లో పారేసి పారిపోయాడు. పాప కోసం వెతికిన తల్లిదండ్రులు పొలాల్లో స్పృహ లేకుండా పడి ఉన్న స్ధితిలో కనుగొన్నారు. హుటాహుటిన జబల్పూర్ లోని మెడికల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ క్రమంగా పాప పరిస్ధితి క్షీణించడంతో శనివారం ఎయిర్ అంబులెన్స్ ద్వారా నాగపూర్ గరలించారు.
నాగపూర్ ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఇపుడు పాపకు చికిత్స అందిస్తున్నారు. ఒక సీనియర్ డాక్టర్ ఆధ్వర్యంలో పాపను పర్యవేక్షిస్తున్నారని తెలుస్తోంది. అయితే పాప పరిస్ధితి ఇప్పుడు మెరుగుపడింది లేనిది తెలియరాలేదు. సంఘటన పట్ల కోపోద్రిక్తులైన ఘన్సౌర్ పట్టణ ప్రజలు శనివారం పట్టణ బంద్ పాటించారు. నిందితుడు ఇంకా పోలీసులకు దొరకలేదు. పోలీసులు వివిధ సెక్షన్లతో కేసు పెట్టి నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఢిల్లీ, బీహార్ లకు పోలీసు బృందాలను పంపించారు. నిందితుడిని ఫిరోజ్ ఖాన్ గా గుర్తించినట్లు తెలుస్తోంది.
మనోజ్ కుటుంబం బహిష్కరణ
ఢిల్లీ బాలిక అత్యాచారానికి కారకుడైన మనోజ్ కుమార్ సాహ్ ను, అతని కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరిస్తూ గ్రామస్ధులు నిర్ణయం తీసుకున్నారు. పంచాయితీ సభ్యులు ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారని ది హిందు తెలిపింది. మనోజ్ తండ్రి ఎలాగూ ఢిల్లీలోనే నివసిస్తున్నందుల అతనిపైన బహిష్కరణ పెద్దగా పని చేయకపోవచ్చు. తల్లి శుక్రవారం గ్రామం వదిలిపెట్టి వెళ్లిపోయింది. మనోజ్ తాత, నాయనమ్మలు మాత్రం గ్రామంలోనే నివసిస్తున్నారు. మనోజ్ తో తనకు సంబంధం లేదని, అతనితో సంబంధాలను గతంలోనే తెంచుకున్నామని వారిద్దరు ప్రకటించడంతో వారిని బహిష్కరణ నుండి మినహాయించారు.
మనోజ్ కి ఆదినుండి క్రిమినల్ చరిత్ర ఉన్నట్లు గ్రామస్ధులు చెప్పారు. స్ధానిక టీచర్ కుమారుడి నుండి ఒక బ్రీఫ్ కేసు దొంగిలించి అతన్ని కత్తితో పిడిచిన కేసులో మనోజ్ నిందితుడు. దానితో గ్రామంలో అతనికి గౌరవం లేదని, ఒకసారి అతని తాతయ్యను కొడుతుండగా గ్రామస్ధులే కల్పించుకుని విడిపించారని గ్రామ ముఖియా తెలిపాడు. మనోజ్ కి మరణ శిక్ష శిక్ష విధించినా తక్కువేనని, గ్రామం పరువు అతను మంటగలిపాడని ముఖియా వ్యాఖ్యానించాడు. మనోజ్ ని ఉరితీసినా తానేమీ బాధపడనని, పైగా శాంతిగా ఉంటానని అతని తాతయ్య చెప్పినట్లు గ్రామస్ధులు చెప్పారు.
ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి మనోజ్ పాల్పడ్డాడంటే అందుకు తగిన పరిస్ధితులు సమాజంలో వివిధ రూపాల్లో ఉన్నట్లే అర్ధం. ఆ రూపాలను పసిగట్టి సమాజం నుండి రూపుమాప వలసిన బాధ్యత సమాజం పైనా, ప్రభుత్వాల పైనా ఉన్నది. ఈ బాధ్యత నిర్వహించడంలో సమాజంతో పాటు, ప్రభుత్వం కూడా విఫలం కావడం నేటి దుస్ధితి. సామాజిక బహిష్కరణ ఒక శిక్షగానే ఉపయోగపడుతుంది తప్ప దానంతట అదే పరిష్కారం కాజాలదు. వైఫల్యాలను సవరించుకోకుండా, స్త్రీ వివక్షకు మూలమైన భూస్వామ్య భావజాలాన్ని రూపమాపకుండా తాత్కాలిక శిక్షలు పరిస్ధితిలో మార్పు తీసుకురాలేవు. కానీ పిల్లి మెడలో గంట కట్టేదెవ్వరు?

