భారత దేశంలో చెడబుట్టిందీ గ్రామం. మందీ మార్బలం అంతా చేతుల్లో ఉంచుకుని కూడా ‘మహిళా సాధికారత’ విషయంలో మాటలు తప్ప చేతల్లోకి వెళ్లని ప్రభుత్వాల నిష్క్రియా సంస్కృతి ఎల్లెడలా వ్యాపించి ఉన్న రోజుల్లో ఈ గ్రామం తనదైన పర్యావరణ-స్త్రీవాదాన్ని (Eco-feminism) పాటిస్తోంది. ఆడోళ్లపై ఫ్యూడల్ అహంభావం, అణచివేత, చిన్న చూపు విస్తృతంగా వ్యాపించి ఉండే రాజస్ధాన్ రాష్ట్రంలోనే ఈ వింత చోటు చేసుకోవడం విశేషం. గత అనేక సంవత్సరాలుగా పిప్లాంత్రి గ్రామ ప్రజలు ఆడపిల్లలను జాగ్రత్తగా సాకడమే కాక, ఆడపిల్ల పుట్టినపుడల్లా 111 చెట్లు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతోంది. కేవలం చెట్లు నాటి ఊరుకోరు వాళ్ళు. ఆడపిల్ల పెరిగే కొద్దీ నాటిన ప్రతి చెట్టూ ఎదిగొచ్చి కాయో, పండో ఇచ్చేవరకూ కాపాడుతారు.
గత కొన్ని సంవత్సరాలలో పిప్లాంత్రి గ్రామ ప్రజల కృషి ఫలితంగా అక్కడ ఇప్పుడు 2.5 లక్షల చెట్లు తలలూపుతూ తమ సంతోషాన్ని ప్రకటిస్తుంటాయి. వేప, రావి, మామిడి, ఆమ్ల తదితర చెట్లు పిప్లాంత్రి గ్రామం చుట్టూ నిలబడి కాలుష్యం చొరబడకుండా కాపలా కాస్తున్నాయి. ది హిందు పత్రిక ప్రకారం ప్రతి సంవత్సరం సగటున 60 మంది ఆడపిల్లలు ఇక్కడ పుడుతున్నారని గ్రామ సర్పంచి శ్యామ్ సుందర్ పలివాల్ తెలిపాడు. కొద్ది సంవత్సరాల క్రితం చనిపోయిన తన కూతురు కిరణ్ సంస్మరణార్ధం శ్యామ్ సుందర్ ఈ వినూత్న పర్యావరణ-స్త్రీవాద చొరవను ప్రారంభించి గ్రామస్ధుల చేత అమలు చేయిస్తున్నాడు.
ఫిక్సుడ్ డిపాజిట్
శ్యామ్ సుందర్ చెప్పిన విషయాల ప్రకారం పిప్లాంత్రి గ్రామం కూడా ఆడపిల్లల పట్ల వివక్ష చూపేదే. ఆడ పిల్లల్ని కనే కుటుంబాల్లో దాదాపు సగం మంది తమ కూతురిని పెంచుకోవడానికి విముఖత వ్యక్తపరిచేవారు. ఆడపిల్లను సాకడానికి ఆసక్తి చూపేవారు కాదు. అలాంటి కుటుంబాలను గ్రామ పంచాయితీ నియమించిన కమిటీ గుర్తిస్తుంది. ఈ కమిటీలో గ్రామ పాఠశాల ప్రిన్సిపాల్ తో పాటు పంచాయితీ, అంగన్వాడీ కార్యకర్తలు సభ్యులుగా ఉంటారు.
గ్రామస్ధుల నుండి రు. 21,000 సేకరించి ఆడపిల్ల తల్లిదండ్రుల నుండి మరో రు. 10,000 సేకరిస్తారు. మొత్తం రు. 31,000 లను పుట్టిన ఆడపిల్ల పేరున ఫిక్సుడ్ డిపాజిట్ చేస్తారు. 20 సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అయ్యేలా చేసే ఈ మొత్తం ఆడపిల్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని వేరే చెప్పనవసరం లేదు.
ఫిక్సుడ్ డిపాజిట్ చేయడంతోనే పంచాయితీ సర్పంచి ఆగిపోడు. “ఆడ పిల్ల తల్లిదండ్రుల చేత ఒక అఫిడవిట్ పైన సంతకం చేయిస్తాము. చట్టం నిర్దేశించిన వయసులోపల తమ ఆడపిల్లకు పెళ్లి చేయబోమని, క్రమం తప్పకుండా పాఠశాలకు పంపిస్తామని, తమ ఆడపిల్ల పేరు మీద నాటిన చెట్లను శ్రద్ధగా పెంచుతామని అఫిడవిట్ లో వారు హామీ ఇస్తారు.” అని పలివాల్ తెలిపాడు. మరో విషయం ఏమిటంటే గమ గ్రామంలో ఎవరన్నా చనిపోతే వారి స్మృత్యర్ధం కూడా 11 చెట్లను వారు నాటుతారు.
పిప్లాంత్రి గ్రామానికి జాతీయ గీతం తరహాలో ఒక ప్రత్యేక గ్రామ గీతం ఉన్నది. ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ కూడా పంచాయితీ నిర్వహిస్తోంది.
ఆలోవెరా
ఈ చెట్లు క్రమంగా గ్రామస్ధులకు ఉపాధిని కూడా కల్పించడం మరో విశేషం. ముఖ్యంగా ఆలోవెరా మొక్కకి ఉన్న ఔషధ విలువల వలన వాటి ద్వారా వివిధ ఉత్పత్తులు తయారు చేయవచ్చని గ్రామస్ధులకు తర్వాత్తరవాత తెలిసి వచ్చింది. “క్రమంగా ఆలోవెరా మొక్కలను వివిధ రకాలుగా ప్రాసెస్ చేసి, మార్కెట్ చేయవచ్చని మేము తెలుసుకున్నాం. మేము కొందరి నిపుణులను గ్రామానికి ఆహ్వానించాం. మా ఆడవాళ్ళకు ఆలోవెరా మొక్కల ప్రాసెసింగ్ లో శిక్షణ ఇవ్వాలని వారిని కోరాం. ఇప్పుడు గ్రామ మహిళలు ఆలోవెరా రసం, జెల్, పచ్చడి తదితర ఆలోవెరా ఉత్పత్తులను తయారు చేస్తున్నారు” అని గ్రామ సర్పంచి తెలిపాడు.
హజారే సందర్శన
ఈ గ్రామం గురించి తెలిసి సామాజిక కార్యకర్త అన్నా హజారే ఒకసారి సందర్శించాడట. గ్రామస్ధుల కృషిని, వారు సాధించిన ప్రగతిని ఆయన ప్రశంసించినందుకు వారు చాలా సంతోషపడుతున్నారు. “కానీ గ్రామీణాభివృద్ధి విషయంలో ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలతో పోలిస్తే రాజస్ధాన్ బాగా వెనకబడి ఉంది. గ్రామాలు సాధికారత సాధించాలంటే ఇంకా కష్టపడాల్సి ఉంది” అని పలివాల్ అంటున్నాడు.
ఆడపిల్లలకు డబ్బు రూపేణా ఫిక్సుడ్ డిపాజిట్ వెయ్యడం వారికి నిస్సందేహంగా ఉపయోగమే. అయితే అది ఆడపిల్లలపై ఉన్న చిన్న చూపు ధోరణిని పరోక్షంగా ఆమోదించినట్లుగా కనిపిస్తోంది. ఆమోదించే ఉద్దేశ్యం ఈ పధక రూపకర్తలకు ఉందని చెప్పడం అన్యాయం అవుతుంది. కానయితే ఆడపిల్లల పట్ల ఉండే పాత కాలపు దృక్పధాన్ని ఈ చర్య ప్రతిబింబిస్తోందని వారికి తెలియకపోవచ్చు. ప్రగతిశీల దృక్పధాన్ని అందించవలసిన ప్రభుత్వ పెద్దలే వెనుకబడిన భావజాలాన్ని పెంచి పోషిస్తున్నపుడు వారితో పోలిస్తే పిప్లాంత్రి గ్రామ ప్రజల కృషి బహుధా ప్రశంసనార్హం, కొన్ని కోణాల్లో అనుసరణీయం కూడా.


good one
Ilanti gramam okati India lo vundadam entho garvinchdagga vishayam.Every one has to appreciate it.
All the best for its future efforts.