రానున్న పార్లమెంటు సమావేశాలకు మరో భారీ ముప్పు పొంచి ఉంది. బడ్జెట్ సెషన్ రెండు విడత సమావేశాలను 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం మరోసారి ముంచెత్తనుంది. కుంభకోణంపై చాసో నాయకత్వంలో ప్రభుత్వం నియమించిన జాయింట్ పార్లమెంటు కమిటీ (జె.పి.సి) తన నివేదిక ఈసారి సమావేశాల్లో ప్రవేశపెట్టనుండడమే ఆ ముప్పు. అదీ కాక మిత్రుల దూరంతో బడ్జెట్ ను ఆమోదింపజేసుకోవడం కాంగ్రెస్ కు కష్టం కావచ్చు. అందుకోసం కొన్ని లొంగుబాట్లు అవసరం పడవచ్చు.
స్పెక్ట్రమ్ కుంభకోణంలో ప్రధాని తప్పేమీ లేదని, అంతా అప్పటి టెలికాం మంత్రి ఏ.రాజాయే సొంత పెత్తనం సాగించాడని, ప్రధానిని తప్పుదారి పట్టించాడని జె.పి.సి తేల్చినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి. జె.పి.సి ముందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ ను కూడా పిలవాలని ప్రతిపక్షాలు పట్టుబట్టినప్పటికీ కాంగ్రెస్ సభ్యులు ఒప్పుకోలేదు. కమిటీలో పాలకపక్షానిదే మెజారిటీ కావడంతో ప్రతిపక్షాల మాట చెల్లలేదు.
తనను కూడా విచారించాలని ఏ.రాజా లిఖిత పూర్వకంగా కోరినప్పటికీ ఆయనను కమిటీ పిలవలేదు. దానికి బదులు ఒక ప్రశ్నావళిని రాజాకు పంపి సమాధానాలు రాబట్టింది. సమావేశానికి వస్తే ప్రతిపక్ష పార్టీలు సొంత ప్రశ్నలతో రాజా చేత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే నిజాలను కక్కించి ఉండేవారు. ఆ భయంతోనే, ప్రతిపక్షాలు ఎంత ఒత్తిడి చేసినప్పటికీ కమిటీ నేత చాసో రాజాను పిలవలేదు.
ఈసారి సమావేశాల్లో డి.ఎం.కె కూడా ప్రతిపక్ష బెంచిల్లో కూర్చొనున్నది. రాజా, కనిమోళిల అరెస్టుతో ఇన్నాళ్ళు మింగలేక, కక్కలేక, రగిలిపోయిన డి.ఎం.కె ఇక ఆ కసినంతా తీర్చుకునే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో రానున్న పార్లమెంటు సమావేశాలు కాంగ్రెస్ పార్టీకి పెను ముప్పే. సోమవారం సమావేశాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో శుక్రవారం, ప్రధాని ఎప్పుడూ లేనట్లు మూడు గంటలపాటు రాష్ట్రపటి ప్రణబ్ తో సమావేశం కావడం ఈ సంగతినే స్పష్టం చేస్తోంది.
