తన దేశ ప్రజలకోసం సరికొత్త ఐడియాలతో తిరిగొచ్చానని నమ్మబలికిన పాకిస్ధాన్ మాజీ నియంత పర్వేజ్ ముషర్రాఫ్ నేరుగా మొసలి బోనులోకి ల్యాండ్ అయ్యాడు. సాధారణంగా పాకిస్ధాన్ లో మిలట్రీ పాలకులు, కోర్టులు ఒకే పక్షం వహిస్తాయి. ఎక్కడ బెసికిందో గాని ముషర్రాఫ్ ని వెంటనే అరెస్టు చేయాలని ఇస్లామాబాద్ హై కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు అరెస్టు చేసేలోపు మిలట్రీ అందజేసిన అంగరక్షకుల సహాయంతో పోలీసుల కళ్ళు గప్పి ఆయన పారిపోగలిగాడు. ఆయన పారిపోలేదని మద్దతుదారులు చెబుతున్నా, ఒకే నేరం, ఒకే చట్టం అయినపుడు ఒకే విధమైన చర్యకు రెండు భాష్యాలు ఎలా సాధ్యం?
అసలింతకీ ముషర్రాఫ్ పాక్ ఎందుకు తిరిగొచ్చినట్లు? ఆయనపైన దేశ ద్రోహం కేసు మోపి జర్దారీ నేతృత్వంలోని పాకిస్ధాన్ పీపుల్స్ పార్టీ (పి.పి.పి) ఎదురు చూస్తోన్న విషయం అందరికి తెలిసిందే. బేనజీర్ భుట్టోకు సెక్యూరిటీ ఇవ్వకుండా ఆమె హత్యకు పరోక్షంగా సహకరించాడన్న ఆరోపణలు సైతం ఆయనపైన ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో నాలుగు చోట్ల నుండి నామినేషన్లు వేసినా ఆ నాలుగింటినీ ఎన్నికల కమిషన్ వివిధ కారణాలు చెప్పి తిరస్కరించింది. ముషర్రాఫ్ పాక్ కి రాకముందు ముందస్తు బెయిలు మంజూరు చేసిన హై కోర్టు వచ్చాక ఒకసారి బెయిలును రెండు వారాలు పొడిగించింది. మళ్ళీ బెయిలు పొడిగింపు కోరిన ముషర్రాఫ్ విన్నపాన్ని కోర్టు తిరస్కరించడంతో అరెస్టు అనివార్యం అయింది.
ఈ లోపుగానే ముషర్రాఫ్ హడావుడిగా కోర్టు నుండి వెళ్లిపోయాడు. దానితో భద్రతా బలగాలు న్యాయ సూత్రాలను మిలట్రీ పెద్దలకు ఒకరకంగాను, రాజకీయ నాయకులకు మరొక రకంగాను, సాధారణ ప్రజానీకానికి ఇంకా ఘోరంగానూ అమలు చేస్తున్నాయని స్పష్టం అయింది. కోర్టు అనుకోని విధంగా మునుపు ఎన్నడూ లేని విధంగా అవాంఛనీయ నిర్ణయం తీసుకున్నాడని, సుప్రీం కోర్టులో అప్పీలుకు వెళ్తామని ముషర్రాఫ్ మద్దతుదారులు ఫేస్ బుక్ పేజీలో సందేశం పెట్టారని తెలుస్తోంది. పాకిస్ధాన్ లో మొట్టమొదటిసారిగా 5 సంవత్సరాల పూర్తి కాలాన్ని పూర్తి చేసుకున్న కీర్తి పొందిన పి.పి.పి ముషర్రాఫ్ చేత ఊచలు లెక్కపెట్టించాలని కృత నిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే మిలట్రీకి అనుకూలంగా వ్యవహరించే కోర్టులు మిలట్రీ మాజీ నేత ముషర్రాఫ్ పట్ల ఎలా వ్యవహరించనున్నదీ ఆసక్తికరంగా ఉండగలదు.

idantaa musharaff athyaasaki paraakaashta oka sari president ga chesadu inkaa ee gola anta enduku appudu president gaa evolve ayyadu ippudu devolve avutadu prsident to prisoner