భార్యల మార్పిడి, వరకట్నం, అత్యాచారం: నేవీలో సాంస్కృతిక పతనం!


నౌకాదళ విశ్రాంత ఉద్యోగులకు ఆరోగ్య సేవల పధకం ప్రారంభిస్తున్న ఎ.కె.ఆంటోని

నౌకాదళ విశ్రాంత ఉద్యోగులకు ఆరోగ్య సేవల పధకం ప్రారంభిస్తున్న ఎ.కె.ఆంటోని

ఉన్నత స్ధాయి పరీక్షలు నిర్వహించి నౌకాదళ అధికారులను ఎన్నుకుంటారు. ఉన్నత విద్యార్హతలు ఉంటేనే ఈ పరీక్షలలో నెగ్గడం సాధారణంగా సాధ్యపడుతుంది. అలాంటి అధికారులు సాంస్కృతిక జీవనంలో భారత సమాజానికి ఆదర్శంగా ఉండేలా జీవిస్తారని ఆశిస్తాము. ఆధునిక సమానతా విలువలను ఒంటబట్టించుకుని స్త్రీలకు తగిన గౌరవ, మర్యాదలు ఇస్తారని ఊహిస్తాము.

కానీ అలాంటి ఊహలకు, ఆశలకు తాము అర్హులము కాదని నౌకాదళ అధికారులు కొందరు చెప్పదలుచుకున్నట్లు కనిపిస్తోంది. ఉన్నతాధికారి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు ఆర్మీ చట్టాల ప్రకారం ఒక అధికారి డిస్మిస్ కాగా, మరో అధికారి భార్య తన భర్త పైనా, ఆయన సహచరులు మరియు ఉన్నతాధికారుల పైనా వరకట్న వేధింపులు,  లైంగిక అత్యాచారం, భార్యల మార్పిడికి ఒత్తిడి ఆరోపణలు చేసింది.

తన పై అధికారి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు లెఫ్టినెంట్ కమాండర్ స్ధాయి అధికారిని రక్షణ మంత్రి ఆంటోని శుక్రవారం విధులనుండి తొలగించినట్లు ప్రకటించారు. నేవల్ హెడ్ క్వార్టర్స్ వారు నిర్వహించిన విచారణలో సదరు అధికారి “సోదర-అధికారి భార్య నుండి అనురాగాన్ని దొంగిలించినట్లు” రుజువైందని పి.టి.ఐ శనివారం తెలిపింది. విచారణ నివేదికను అనుసరించి అధికారిని డిస్మిస్ చేస్తూ తీసుకున్న చర్యలను రక్షణ మంత్రి ఆమోదించారని పి.టి.ఐ తెలిపింది.

డిస్మిస్ అయిన వ్యక్తి సీనియర్ అధికారి అని ఇండియన్ ఎక్స్ ప్రెస్ వార్త ద్వారా తెలుస్తోంది. సదరన్ కమాండ్ పరిధిలో జరిగిన ఈ వ్యవహారం కొద్ది సంవత్సరాల క్రితం వెలుగులోకి వచ్చింది. సాయుధ బలగాల చట్టం ప్రకారం సహచర అధికారుల భార్యలతో వివాహేతర సంబంధాలు నెరపడం శిక్షార్హమైన నేరం. డిస్మిస్ అయిన అధికారి పేరును పత్రికలు తెలియజేయలేదు.

ఇదిలా కొనసాగుతుండగానే కొచ్చి నౌకాదళ కేంద్రంలో ఒక అధికారి భార్య తన భర్త, ఆయన సహచర అధికారులు, ఉన్నతాధికారుల పైనా తీవ్రమైన ఆరోపణలు చేసింది. నౌకాదళ అధికారుల్లో భార్యల మార్పిడి జరుగుతోందని ఆమె ఆరోపించింది. దానికి అంగీకరించనందుకు తన భర్త కొలీగ్ అధికారులు, ఉన్నతాధికారులు తనను లైంగికంగా వేధించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త వరకట్నం కోసం వేధిస్తున్నారని కూడా ఆమె ఆరోపించింది.

అయితే మహిళ ఆరోపణలను నేవీ అధికారులు తిరస్కరిస్తున్నారు. భార్యాభర్తల మధ్య ఉన్న తగాదాను పరిష్కరించడానికి నేవీలోని ఇతర అధికారులు, వారి భార్యలు తీవ్రంగా ప్రయత్నించారని వారిపైన మహిళ అవాంఛనీయ ఆరోపణలు చేయడం సరికాదని సదరన్ కమాండ్ అధికారులు రక్షణ మంత్రికి ఒక నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది.

తాము అంతర్గతంగా విచారణ చేశామని, ఈ విచారణలో మహిళ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తేలిందని చెబుతూ నేవీ అధికారులు పూర్తిగా సదరు నిందితుల పక్షం వహిస్తున్నారు. ఏమీ జరగకుండానే భర్తతో పొసగకపోయినంత మాత్రాన భర్త కొలీగ్స్ పైనా, ఉన్నతాధికారుల పైనా, వారి భార్యల పైన కూడా ఆధారం లేని ఆరోపణలు చేయడానికి ఒక మహిళ ఎందుకు సిద్ధపడుతుందన్నది తర్కించుకోవాల్సిన అంశం.

మహిళ ఆరోపణలపై రక్షణ మంత్రి తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. “రక్షణ మంత్రిత్వ శాఖ ఇలాంటి ఫిర్యాదులను తీవ్రంగా పరిగణిస్తుంది. విచారణ చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే విధులనుండి తొలగిస్తాం. తప్పు చేసినవారిని ఎవర్నీ వదిలిపెట్టం” అని రక్షణ మంత్రి అన్నారని ది హిందు తెలిపింది. “ఫిర్యాదుపై నేవీ నుండి విచారణ నివేదికను కోరాను. అదింకా పూర్తి కాలేదు” అని మంత్రి ఆంటోని మాజీ ఆర్మీ అధికారులకు ఆరోగ్య సేవల పధకం ప్రారంబిస్తూ అన్నారు.

నేవీ విచారణతో పఆటు మరో రెండు విచారణలు జరుగుతాయని మంత్రి తెలిపారు. ఒక విచారణ ఢిల్లీ పోలీసుల ఆధ్వర్యం లోనూ మరొకటి కేరళ పోలీల ఆధ్వర్యంలోను జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. విచారణ కొనసాగుతున్నందున భార్యల మార్పిడి, వరకట్నం, అత్యాచార ప్రయత్నం ఆరోపణలు వచ్చిన కేసులో ఇప్పుడే ఏమీ చెప్పలేనని ఆయన తెలిపారు.

కొచ్చిలోని స్ధానిక హార్బర్ పోలీసు స్టేషన్ లో మహిళ ఫిర్యాదు చేయడంతో నౌకాదళ అధికారుల్లోని అవాంఛనీయ ధోరణులు వెలుగులోకి వచ్చాయి. హార్బర్ పోలీసు స్టేషన్ 10 మంది అధికారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. మహిళ భర్త, అతని సహచర, ఉన్నత అధికారులు తొమ్మిది మంది వీరిలో ఉన్నారు. ఐ.పి.సి సెక్షన్ 498 (వివాహం ఐనా మహిళను దురుద్దేశంతో బలవంతంగా పట్టుకుపోవడం) కింద ఏప్రిల్ 4 తేదీన కేసు నమోదు అయినట్లు పత్రికలు తెలిపాయి.

తనను వరకట్నం కోసం భర్త వేధించాడని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. భర్త సీనియర్లు, కొలీగ్సు తనను లైంగికంగా వేధించారని పేర్కొంది. కుటుంబ హింసకు సంబంధించిన సరికొత్త కోణం ఈ కేసులో వెల్లడయిందని భావించవచ్చు. ముఖ్యంగా ఆర్ధికంగా ఉన్నత స్ధాయిలో ఉన్న వర్గాలు ‘హై సొసైటీ కల్చర్’ పేరుతో వందల ఏళ్ల పరిణామ క్రమంలో మానవుడు సాధించిన నాగరికతా విలువలకు సమాధి కడుతున్నారు. ఈ విలువలకు నౌకాదళ అధికారులు సైతం పట్టం కట్టడం కడు శోచనీయం.

One thought on “భార్యల మార్పిడి, వరకట్నం, అత్యాచారం: నేవీలో సాంస్కృతిక పతనం!

  1. Wife swapping is not an extra ordinary incident. There are many people who do it secretly. In this context, some defense officers are involved in it. So it became a yellow news for media. I think you might have read Tapi Dharmarao’s story on ravikela pandaga that was practiced in Andhra some hundreds of years ago.

వ్యాఖ్యానించండి