రానున్న ఎన్నికల్లో ఎవరికి ఓటేయ్యాలి? ప్రజలను ఎటువంటి వివక్ష లేకుండా పాలన చేయడం అటుంచి వారి మానాన వారిని బతకనిచ్చే పార్టీలు ఇండియాలో ఏమున్నాయని? వనరులన్నీ విదేశీ కంపెనీలు తరలించుకుపోతున్నా నోరు మూసుకున్నందుకు కాళ్ళ కింద భూమిని కూడా ఇప్పుడు లాక్కుపోతున్నారు. ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వకపోయినా చిల్లర కొట్టు పెట్టుకుని స్వయం ఉపాధి కల్పించుకుంటే దాన్ని తీసుకుపోయి వాల్ మార్ట్ కి అప్పజెపుతున్నారు.
ఇన్ని చేసినా సహించి ఊరుకుంటే నువ్వు ముస్లింవి కనుక చంపుతాను అని ఒకరోస్తే, నువ్వు సిక్కువి కనుక చంపుతాను మరొకరొస్తారు. నువ్వు దళితుడివి కనుక నీకు భూమి అక్కర్లేదు, చదువు అక్కర్లేదు, మా యింట్లో సేవ చేసుకుని బతుకు అని కొట్టొస్తే రక్షించే నాధుడు ఈ గడ్డపైన కనపడడు. మరణ శిక్ష పడిన ఖైదీలు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకుంటే వాటిపైన పదేళ్ళకు పైగా మఠం వేసుకునే కూర్చునే రాష్ట్రపతులు మనకి ప్రధమ పౌరులు. మరణ శిక్షలను సైతం రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే నీతిమాలిన పార్టీలు తప్ప ఈ దేశ ప్రజలకు మరో దిక్కు లేకుండో పోయింది.
1984లో ఇందిరా గాంధీ హత్య తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్ నాయకుల ప్రత్యక్ష పర్యవేక్షణలో సిక్కులపై సాగిన ఊచకోత ఈ దేశ ప్రజాస్వామ్య పాలనకు న్యాయ వ్యవస్ధల సమగ్రతకు సవాలు విసరగా 30 యేళ్ళు గడిచిన దానికి గట్టి సమాధానం ఇచ్చిన పరిస్ధితి న్యాయ స్ధానాలకు లేకపోయింది. 2002లో గుజరాత్ లో ముస్లింల ఊచకోతకు 1984 నాటి సిక్కుల ఊచకోత విద్వేషం, సెంటిమెంట్లు ప్రాతిపదికన ‘ఏం చేసినా చెల్లుతుందనే’ భూమికను కల్పించిందంటే అతిశయోక్తి కాదేమో! సిక్కుల ఊచకోతకు సంబంధించి జగదీష్ టైట్లర్ కి సి.బి.ఐ ఇచ్చిన క్లీన్ చిట్ చెల్లదని శుక్రవారం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో నాటి గాయం ఇపుడు మళ్ళీ సిక్కులను సలుపుతోంది. దరిమిలా దేశ ప్రజలను రెండు చీకటి ఘోరాలు వెంటాడుతున్నాయి, ‘ఎవరికి ఓటు వేయాలో తేల్చుకోమంటూ.’
రాజ్యం లో ప్రజలు ప్రశాంతంగా ఉంటె ప్రభువుల అవినీతి గురించి చేర్చిన్చుకుంటారని ప్రజల మద్య కుల, మత మరియు ప్రాంత విభేదాలతో ప్రజల్లో అనిఖ్యతను పాలకులు ప్రోచాహిస్తారని ఒక అభిప్రాయం ఉండేది. ప్రస్తుత పరిస్తుతలను చూస్తే అది నిజమనిపిస్తుంది.
అదేం కాదు. ప్రజాభిప్రాయాన్ని మోడీకి అనుకూలంగా మలచడానికి మన మీడియా చేసే ఒక పాత ‘ ఫీట్’ అంతే. ఈ గాయం గెలికితే సిక్కులు కాంగ్రెస్‌కి దూరం జరిగి మోడీకి దగ్గరవ్వాలని. మిగతా రాష్ట్రాలలో కూడా (దాదాపు) ఇలాంటి సన్నివేశాలే నడుస్తున్నాయి . చూస్తూ ఉండండి మోడీ కోసం మీడియా పడే పాట్లు