ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజలకు వ్యతిరేకంగా ఉపయోగించడం భారత పాలకుల నైజం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఇందులో నాలుగాకులు ఎక్కువే చదివింది. ఎన్నికల నాటి ప్రమాణాలను సంవత్సరం లోపే పూర్తి చేసేశానని ప్రకటించిన మమత ‘వాగ్దానాలను అమలు చేయండి’ అని అడిగిన ఒక సాధారణ రైతు పైన మావోయిస్టు అని ముద్ర వేసి అరెస్టు చేయించింది. తద్వారా మావోయిస్టులు రైతుల కోసం పని చేస్తున్నారని చెప్పకనే చెప్పింది.
మహిళల హక్కులు, ప్రజల ప్రజాస్వామిక హక్కులు హరించబడుతున్నాయని ఒక టి.వి ఇంటర్వ్యూలో అడిగిన యూనివర్సిటీ విద్యార్ధిని, విద్యార్ధులను ‘మీరంతా మావోయిస్టులు’ అని ముద్ర వేసి ఇంటర్వ్యూని మధ్యలో వదిలేసి పోయిన మమత మహిళలు, ప్రజల హక్కుల కోసం మావోయిస్టులే నిలబడుతున్నారని మరోసారి చెప్పింది.
కదులుతున్న కారులో ఒక మహిళపై జరిగిన సామూహిక అత్యాచారంపై విచారణ కోరితే, ‘తనపై జరుగుతున్న కుట్ర’ అనడం, కార్టూన్ షేర్ చేసిన ప్రొఫెసర్ పైన కేసులు పెట్టి వేధించడం మమత ఫాసిస్టు తరహా పాలనకు కొన్ని సంకేతాలు మాత్రమే. తనకు వ్యతిరేకంగా మాట్లాడితేనే ‘మావోయిస్టులని’ ‘సి.పి.ఎం పార్టీవారని’ చెప్పి పోలీసుల్ని ఉసిగొల్పడం ఆమెకు మామూలు విషయం.
ఇవన్నీ ఒక ఎత్తైతే రాజకీయంగా ఆమె ఒంటరి అయిన/అవుతున్న తీరు మరొక ఎత్తు. సి.పి.ఎం ప్రజావ్యతిరేక పారిశ్రామిక విధానానికి వ్యతిరేకంగా పోరాడుతున్నపుడు మావోయిస్టులకు మద్దతు ఇచ్చిన మమత అధికారానికి వచ్చిన వెంటనే ఫాసిస్టు నిర్బంధాన్ని వారిపై ప్రయోగించింది. కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చినా తమ రైల్వే మంత్రే రైలు ఛార్జీలు పెంచినా, వాటిని సాకు చూపి కాంగ్రెస్ కు దూరం అయింది. చివరికి యు.పి.ఏ నుండి బయిటికి వచ్చేసింది. రాష్ట్రంలో ఉన్న భారీ ముస్లిం ఓటు బ్యాంకు వలన ఎన్.డి.ఎ కి కూడా మద్దతు ఇవ్వలేని పరిస్ధితిలో ఆమె ఉన్నట్లు కనిపిస్తోంది.
ప్రజలను, రాజకీయ నాయకులను, ఒకప్పటి కీలక మద్దతుదారులనూ ఒక్కొక్కరినీ దూరం చేసుకుంటున్న మమత ఇపుడు స్వేచ్ఛగా ఎటూ అడుగు వేయలేని పరిస్ధితిని స్వయంగా కొని తెచ్చుకుందని ఈ కార్టూన్ సూచిస్తోంది.

’’సి.పి.ఎం ప్రజావ్యతిరేక పారిశ్రామిక విధానానికి వ్యతిరేకంగా పోరాడుతున్నపుడు మావోయిస్టులకు మద్దతు ఇచ్చిన మమత ‘‘, అనేది సరిఅయినది కాదు. వాస్తవానికి అక్కడ సిపిఎంకు వ్యతిరేకంగా పోరాటం ఏదైనా జరుగుతుందంటే అది మమతదే. మావోయిస్టులు ఆమెకు మద్దతు ఇచ్చారు అనేది వాస్తవం. సిపిఎంని ఓడించడానికి చేసుకున్న అనైతిక పొత్తు అది. కిషన్ జీని హతమార్చడంతో మావోయిస్టులకు కళ్ళు తెరుచుకున్నాయనుకుంటాను.
అశోక్ గారూ, నగ్జలైట్లను లేదా మావోయిస్టులను లేదా మార్క్సిస్టు-లెనినిస్టు ఐడియాలజీ ఉన్న విప్లవ పార్టీలను అణచివేయడంలోనూ, వారి నాయకులను కార్యకర్తలను హతమార్చడంలోనూ ఈ దేశంలోని భూస్వామ్య, బూర్జువా పార్టీలకు ఎంత చరిత్ర ఉన్నదో, సి.పి.ఐ, సి.పి.ఎం తదితర వామపక్ష పార్లమెంటరీ పార్టీలకు కూడా అంతే చరిత్ర ఉంది.
అలాంటప్పుడు “కిషన్ జీని హతమార్చడంతో మావోయిస్టులకు కళ్ళు తెరుచుకున్నాయనుకుంటాను.” అన్న వ్యాఖ్యానానికి అర్ధం ఏముంటుంది చెప్పండి? మమతకు మద్దతు ఇవ్వడం మహా అయితే మావోయిస్టుల తప్పు ఎత్తుగడ కావచ్చేమో గానీ పోరాటం కాకుండా ఎలా పోయింది!?
మమత చేసింది పోరాటం, మావోయిస్టులు ఆమెకు మద్దతు మాత్రమే ఇచ్చారని చెప్పడం ద్వారా మీరు కూడా మమతకు సర్టిఫికెట్ ఇస్తున్నారు సుమా! మావోయిస్టులను సి.పి.ఎం ప్రభుత్వం హతమార్చింది, మమత ప్రభుత్వం కూడా హతమారుస్తోంది. మమతకు, సి.పి.ఎం కూ లేని తేడా అదే. ఉన్న తేడా ఏమిటంటే ఒకరు కమ్యూనిస్టు సిద్ధాంతాలు చెబుతారు. మరొకరు చెప్పరు.
సిపిఎం ప్రభుత్వం ఏ మావోయిస్టులను చంపిందో చెబితే బాగుంటంది (70లనాటి సంకీర్ణ ప్రభుత్వ వివరాలు కాకుండా). కేంద్రంతో సహా రాష్ట్రాలన్నీ మావోయిస్టులపై నిషేధం విధిస్తే బెంగాళ్ ప్రభుత్వం అలా చేయలేదుకూడా. మావోయిస్టు పార్టీని కూడా వామపక్ష పార్టీగా భావించింది. కావాలని వారే తమది మాత్రమే విప్లవ పార్టీ అనుకుంటూ, మమత లాంటి వారితో పొత్తులు కుదుర్చుకుంటూ సిపిఎంపై దాడులు చేసిందీ, చేస్తున్నదే నిజంగా కనిపిస్తోంది నాకు. నాకు తెలిసిన వివరాలతో నేను ఏర్పాటు చేసుకున్న అభిప్రాయం ఇది. వివరాలు తెలియక ఈ అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకుని కూడా ఉండవచ్చు. ఇతర వివరాల కొరకు ప్రయత్నిస్తా.
.