ప్రధాని జర్మనీ పర్యటన, ఏ రోటి కాడ ఆ పాట!


ఏంజెలా మెర్కెల్ తో కలిసి అరుదైన నవ్వులతో ప్రధాని

ఏంజెలా మెర్కెల్ తో కలిసి అరుదైన నవ్వులతో ప్రధాని

భారత ప్రధాని మన్మోహన్ ప్రస్తుతం జర్మనీ పర్యటనలో ఉన్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం జర్మనీ కంపెనీలు ఆతృతగా ఎదురు చూడగా అది పెద్దగా ముందుకు సాగలేదని తెలుస్తోంది. ఆరు వాణిజ్య ఒప్పందాలు కుదిరాయని ప్రకటించాయి. సోలార్ ఎనర్జీ లాంటి సాంప్రదాయేతర ఇంధన టెక్నాలజి, విద్య, వ్యవసాయం తదితర రంగాలలో ఈ ఒప్పందాలు కుదిరినట్లు తెలుస్తోంది. ఆరేళ్లలో ఒక బిలియన్ యూరోలు రుణం ఇస్తామని హామీ ఇచ్చారుట. జర్మనీ కార్ల దిగుమతులపై అధిక పన్నులు వేయడం పట్ల జర్మనీ విమర్శించగా వీలువెంబడి ఈ సమస్య పరిష్కరిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.

కాగా ప్రధాన మంత్రికి  ముందు జర్మనీ వెళ్ళిన విదేశీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, జర్మనీ విదేశీ మంత్రితో కలిసి ఇరాన్ అణు కార్యక్రమంపై సుద్దులు చెప్పబూనారు. ఇరాన్ వెళ్ళినపుడు ఇరాన్ అణు కార్యక్రమం ఆ దేశం సొంత విషయం అని చెప్పడం పశ్చిమ దేశాలు వెళ్ళినపుడు ఇరాన్ అణు కార్యక్ర్కమాన్ని కట్టడి చేసుకోవాలనడం ‘ఏ రోటీ కాడ ఆ పాట పాడడమే.’ ఈ పాట మార్పిడి ఇండియా అణు కార్యక్రమ హక్కులకు ఎదురు తిరుగుతుందని మంత్రివర్యులు గమనించకపోవడం వింత.

“భారత ఆటో రంగానికి మేము ఇస్తున్న సుంకాల రక్షణ పైన కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ అంశంపై తీవ్రంగా చర్చించాము” ప్రధాన మంత్రి చెప్పగా, ” మా మంత్రులు ఈ వారంలోనే బ్రస్సెల్స్ లో సమావేశం అయినపుడు ఈ విషయంలో ప్రగతి సాధిస్తాము. ఇప్పుడు కొంత ముందుకు వెళ్ళినా చేరవలసిన చోటికి ఇంకా చేరలేదు” అని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ చెప్పారు. భారత ఆటో రంగ పరిశ్రమను కాపాడడం కోసం (భారత కార్ల తయారీదారుల అమ్మకాలు పడిపోకుండా ఉండడం కోసం) జర్మనీ కార్ల దిగుమతులపై భారత్ అధిక సుంకం విధిస్తున్నది. ఇది అన్నీ దేశాలు చేసేపనే.

భారత దేశం నుండి కార్మికులు, ఉద్యోగులు పశ్చిమ దేశాలకు వలస పోకుండా అక్కడ అనేక పరిమితులు విధిస్తారు. ఋణ సంక్షోభం సాకుచూపి ఇటీవల ఈ పరిమితులు తీవ్రం చేశారు కూడా. ప్రపంచీకరణ వలన ప్రపంచం కుగ్రామం అయిందని చెబుతూనే తమ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం ఆ దేశాలు వెనుదీయవు. అదే పని భారత దేశం లాంటి వర్ధమాన దేశాలు చేస్తే మాత్రం గుండెలు బాదుకుని గోల గోల చేస్తాయి. పశ్చిమ దేశాల పెట్టుబడుల కోసం మన మార్కెట్ల గేట్లు బార్లా తెరవాలి. మన జనం అక్కడికి వెళ్లాలంటే మాత్రం చీమ దూరే సందు ఉంచుతారు. అక్కడ కూడా సవాలక్షా తనిఖీలు!

తమ పెట్టుబడుల (ఎఫ్.డి.ఐ) ప్రవేశం కోసం పశ్చిమ దేశాలు గట్టిగా డిమాండ్ చేస్తాయి. కానీ భారత విద్యార్ధులు, ఉద్యోగార్ధుల ప్రవేశం కోసం నియంత్రణ ఎత్తివేయాలని భారత పాలకులు డిమాండ్ చేయగా ఎప్పుడూ వినలేదు, కనలేదు. ఉదాహరణకి ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ తదితర సేవల రంగంలో తమ కంపెనీలకు పూర్తిస్ధాయి అనుమతులు ఇవ్వాలని యూరోపియన్ యూనియన్, అమెరికాతో కలిసి తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నది. ఆ ఒత్తిడికి తల ఒగ్గి కేబినెట్ ఇన్సూరెన్స్ బిల్లు ఒకే చేసింది కూడా. ఇప్పుడు పర్యటనలొ ప్రధాని ఈ విషయం చెప్పి త్వరలోనే పార్లమెంటు కూడా ఇన్సూరెన్సు బిల్లు ఆమోదిస్తుందని హామీ కూడా ఇచ్చేశారు. (పార్లమెంటు తరపున ఏకపక్షంగా, చర్చ జరక్కుండానే, ప్రధాని ఎలా హామీ ఇవ్వగలరు?) కానీ బ్రిటన్, అమెరికాలు భారత విద్యార్ధుల భావితవ్యాన్ని అంధకారంలో పడేస్తూ ఆయా యూనివర్శిటీల పైన కఠిన నిబంధనలు విధించి, కొన్నింటిని మూసివేసినా అడిగిన మంత్రి లేడు. బ్రిటన్ లో స్ధానిక లాబీయిస్టులే లాబీ చేసుకోగా నిన్నో, మొన్నో ఒక యూనివర్సిటీ తెరిచారు.

జర్మని-ఇండియాల వ్యాపారం 2011లో 24 బిలియన్ డాలర్లు. చైనా-ఇండియా ల ద్వైపాక్షిక వ్యాపారంతో (74 బిలియన్ డాలర్లు) పోలిస్తే ఇది చాలా తక్కువ. 2011లో భారత్, చైనాకు చేసిన ఎగుమతులే 24 బిలియన్ డాలర్లు ఉండడం గమనార్హం. ఈ నేపధ్యంలో భారత దేశం తన వ్యాపార ప్రయోజనాలకు సమాన ప్రాతినిధ్యం ఇచ్చే దేశాలకు ప్రాతినిధ్యం ఇవ్వడం మేలు. ‘దున్నేతప్పుడు గట్టు మీద, మేసేతప్పుడు చేలో’ ఉండడానికి ఇష్టపడే దేశాలతో జాగ్రత్త అవసరం.

ఇరాన్ అణు విధానం

దశాబ్దాల తరబడి పశ్చిమ దేశాల అణు ఆంక్షలను, అణు అంటరానితనాన్ని ఎదుర్కొన్న దేశాలలో ఇండియా ప్రముఖమైనది. అదే అంటరానితనాన్ని పశ్చిమ దేశాలు ఇరాన్ పైన పాటిస్తున్నాయి. ఆ మాటకొస్తే ఇండియా వద్ద అణ్వస్త్రాలున్నాయి గాని ఇరాన్ వద్ద లేవు. అణు బాంబులు తయారు చేసే ఉద్దేశ్యం ఇరాన్ కి లేదని అమెరికా, ఇజ్రాయెల్ దేశాల గూఢచార సంస్ధలు సి.ఐ.ఏ, మొస్సాద్ లు అనేకసార్లు గట్టి నివేదికలు ఇచ్చాయి. అయినా ఇరాన్ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఐరాస ని అడ్డం పెట్టుకుని ఆ దేశంపై అమానుష ఆంక్షలు అమలు చేస్తున్నాయి పశ్చిమ దేశాలు. ఈ ఆంక్షలకు మద్దతు ఇస్తూ విదేశీ మంత్రి సల్మాన్ ఇచ్చిన ప్రకటన అవాంఛనీయం, స్వవచో వ్యాఘాతం.

“ఇరాన్ తో చర్చలు కొనసాగుతాయని, నిర్దిష్ట కాల పరిమితి పాటించబడుతుందని మేము ఆశిస్తున్నాము. ఈ అవగాహనను ఆమోదిస్తూ వెస్టర్ వెల్లే (జర్మనీ విదేశీ మంత్రి) ఇరాన్ కు అవకాశాల కిటికీ తెరుచుకునే ఉందని తెలిపారు. అణువస్త్రాలు పొందకుండా ఇరాన్ ను అడ్డుకోవాల్సిన అవసరం మనకు ఉంది. ఇందుకోసం ఆంక్షలు ముఖ్యం” అని సంయుక్త విలేఖరుల సమావేశంలో ఖుర్షీద్ అన్నారు. ఇరాన్ కు ఇండియా ఇచ్చిన హామీకి ఇది విరుద్ధం. అనైతికం కూడా. అణు నీతి అందరికి ఒకే విధంగా ఉండాలని ఇండియా అనేక సంవత్సరాలుగా వాదిస్తూ వచ్చింది. ఇరాన్ కు మరో నీతి ఉంటుందని సల్మాన్ పరోక్షంగా సూచిస్తున్నారు. స్వయంగా ఆంక్షలు ఎదుర్కొన్న ఇండియా ఇరాన్ పై ఆంక్షలను సమర్ధించడం ఎంతమాత్రం సమర్ధనీయం కాజాలదు.

One thought on “ప్రధాని జర్మనీ పర్యటన, ఏ రోటి కాడ ఆ పాట!

  1. 1) anu vyapti nirodaka bill pina IRAN tho patu G5, G8 , desalanni santakalu chesai….anvastrala vyapti nirodinchali ani cheppe e desalu vari prayojanala kosam kuppaluga anvastralanu progu chesai.

    2) variki prayojanam kaligincheyla anu indana vanijyam ….vari kanusannallo matrame jaragali aney durahamkaram indulo kana padutundi..(swardha, pakshapatha budhi).

    3)india vishaynikostey mana anvastrala avasaram paschima desalaku kasula panta pandistundi….gata rendu samvatsarala lo ..anvastralanu digumati ekkuvaga chesuku desallo india no 1 postion lo vundhi.

    4)tatkalika prayojanam kosam( runala manjuru) evari daggara vari pata padey rendu nalkala dhorani manaki takshanam prayojanam kaliginchochu…bhavishatulo idi manaku tevra ibbandulanu techi pettagaladu aney danlo etuvanti sandeham ledhu.

వ్యాఖ్యానించండి