తమిళనాడు రాష్ట్రం భారత దేశం నుండి విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పడడానికి అప్పటి డి.ఎం.కె రాష్ట్ర మంత్రి ఒకరు అమెరికా సాయం కోరినట్లు అమెరికా రాయబార పత్రాల ద్వారా తెలుస్తోంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధి ఎమెర్జెన్సీ పాలన విధించిన వారం రోజులకు తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వానికి నాయకత్వం వహించిన ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ నేత, రాష్ట్ర కార్మిక మరియు గృహ శాఖ మంత్రి కె.రాజారాం అమెరికా రాయబారిని కలిసి తమిళనాడు ప్రత్యేక దేశంగా విడిపోదలుచుకుంటే అమెరికా మద్దతు ఇస్తుందా అని అమెరికా రాయబారిని అడిగినట్లు వికీలీక్స్, ది హిందు సంస్ధలు ప్రచురిస్తున్న ‘డిప్లొమేటిక్స్ కేబుల్స్’ ద్వారా తెలిసింది. ఈ మేరకు ది హిందు పత్రిక బుధవారం ఒక వార్తా కధనం ప్రచురించింది.
ఎమర్జెన్సీ పాలనతో తమిళనాడులో కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికీ, డి.ఎం.కె నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికీ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఈ నేపధ్యంలో రాష్ట్ర కార్మిక, గృహ నిర్మాణ మంత్రి కె.రాజారాం చెన్నైలోని అమెరికా రాయబారిని కలిశాడని ది హిందు తెలిపింది. తమిళనాడు ప్రత్యేక దేశంగా ఏర్పడాలని నిర్ణయిస్తే అందుకు అమెరికా సాయం చేయగలదా అని రాజారం ప్రశ్నించినట్లు లీక్ అయిన కేబుల్ ద్వారా తెలుస్తోంది. అయితే అందుకు అమెరికా రాయబారి నిరాకరించాడని కూడా కేబుల్ ద్వారా స్పష్టం అవుతోంది.
“ఇది భారత దేశ అంతర్గత సమస్య. భారత దేశంతో పాటు ఇతర దేశాల భౌగోళిక సమగ్రతకు అమెరికా మద్దతు ఇస్తుంది” అని తాను రాజారంకి సమాధానం ఇచ్చానని అమెరికా రాయబారి తమ ప్రభుత్వానికి జులై 3, 1975 తేదీన పంపిన కేబుల్ (1975NEWDE08889_b, secret) లో తెలిపాడు. అటువంటి ఆలోచనకు తాము మద్దతు ఇవ్వబోమని తాను నేరుగా చెప్పానని రాయబారి తెలిపాడు. డి.ఎం.కె ప్రభుత్వం ‘ఇండియన్ యూనియన్’ నుండి స్వతంత్రం కోసం ప్రయత్నించాలని ఆలోచిస్తోందా అన్న అమెరికా రాయబారి ప్రశ్నకు రాజారాం కూడా “లేదు, ఉన్నత స్ధాయిల్లో అలాంటి ఆలోచన లేదు” అని బదులిచ్చినట్లు కూడా కేబుల్ ద్వారా తెలుస్తోంది.
డి.ఎం.కె పార్టీ మాతృ సంస్ధ ‘ద్రవిడార్ కజగం’ (డి.కె). స్వతంత్ర తమిళ దేశం కోసం డి.కె వ్యవస్ధాపకుడు అన్నాదురై నేతృత్వంలో డిమాండు లేవనెత్తారు. అయితే ఎమెర్జెన్సీ విధించడానికి 13 సంవత్సరాల ముందే డి.ఎం.కె పార్టీ ప్రత్యేక దేశం డిమాండును వదులుకుంది. ఇండియా చైనా యుద్ధం అనంతరం నెహ్రూ ప్రభుత్వం 1963లో శక్తివంతమైన ‘దేశద్రోహ వ్యతిరేక చట్టం’ చేయడంతో సి.ఎన్.అన్నాదురై ప్రత్యేక దేశం డిమాండు వదులుకున్నాడని, అప్పటినుండి ఫెడరల్ వ్యవస్ధ (ఫెడరల్ పాలనా వ్యవస్ధ, యూనియన్ పాలనా వ్యవస్ధ వేరు వేరు) ఏర్పాటును డిమాండ్ చేయడం ప్రారంభించింది. డి.ఎం.కె మొదటిసారి కేంద్రంలో మంత్రిత్వ శాఖలను తీసుకున్నది 1989లోనేనని 2000 తర్వాత కూటమి ప్రభుత్వాలలో కూడా పాలు పంచుకుంటోందని ది హిందు వ్యాఖ్యానించింది.
అమెరికా రాయబారి తమ ప్రభుత్వానికి పంపిన కేబుల్ ప్రకారం రాజారం ఇంటివద్దనే ఈ సమావేశం జరిగింది. రాజారం తమకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాడని, వివిధ సందర్భాల్లో తాము తరచూ కలుసుకునేవాళ్ళమని రాయబారి తన లేఖలో రాయడం విశేషం. కాబట్టి ఆయన చెప్పింది నమ్మదగినదే అని రాయబారి అభిప్రాయం. డి.ఎం.కె పార్టీలో యువకులు సొంత తమిళ దేశం కోసం తీవ్రంగా చర్చించుకుంటున్నారని కానీ ఉన్నత స్ధాయిలో ఈ ఆలోచన లేదని రాజారాం రాయబారికి తెలిపాడు. “ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడానికి యు.ఎస్.ఎస్.ఆర్ తదితర కమ్యూనిస్టు దేశాలు శ్రీమతి గాంధీకి మద్దతు ఇస్తున్నాయి. అది ఫలవంతం అయితే కమ్యూనిస్టు ప్రభావం పెరుగుతుంది కనుక తమిళనాడు విడిపోవాలి” అని డి.ఎం.కె యువత భావిస్తోందని రాజారాం చెప్పినట్లు తెలుస్తోంది. యువ కార్యకర్తల ధోరణి వల్లనే ‘స్వతంత్ర తమిళనాడు’ ఆలోచనకు అంకురార్పణ జరిగిందే తప్ప డి.ఎం.కె ఉన్నత నాయకుల్లో ఈ ఆలోచన లేదని రాజారాం చెప్పడలిచాడు. అమెరికా కాన్సలేట్ జనరల్ తమ ప్రభుత్వానికి చెప్పింది కూడా అదే.
అయితే కేబుల్ లో ఉన్న మరో అంశం ఈ ‘అంకురార్పణ కధ’తో విభేదిస్తున్నట్లు కనిపిస్తోంది. ‘లోకల్ ఎడ్యుకేటర్’ ఒకాయన కూడా అమెరికా రాయబారిని కలిశాడట. తనకు గతంలో పని చేసిన అమెరికా రాయబారులతో సాన్నిహిత్యం ఉందని, కరుణానిధి కూడా తనకు బాగా తెలుసని చెప్పాడట. “భారత దేశంలోని మిగిలిన ప్రాంతం అంతా కమ్యూనిస్టు ప్రభావిత నియంతృత్వం’ లో ఉన్నట్లయితే అమెరికా సహాయం చెయ్యొచ్చని నేను కరుణానిధికి చెప్పాను” అని ఆ ఎడ్యుకేటర్ (ఈయనని అంతకు ముందు ఎప్పుడూ తాను కలవలేదని రాయబారి రాశాడు) తనతో అన్నట్లు రాయబారి తన కేబుల్ లో తెలిపాడు.
అయితే కరుణానిధి మాత్రం సదరు ఎడ్యుకేటర్ అభిప్రాయంతో విభేదించాడు(ట). వియత్నాం అనుభవం తర్వాత ఆసియాలో మళ్ళీ కొత్తగా వేలు పెట్టే సాహసం చెయ్యకపోవచ్చని కరుణానిధి వ్యాఖ్యానించాడట. అంటే అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి కూడా ప్రత్యేక తమిళ దేశం గురించి చర్చించినట్లే ఇక్కడ అర్ధం ధ్వనిస్తోంది. కాబట్టి డి.ఎం.కె ఉన్నత స్ధాయిల్లో ఆ ఆలోచన లేదనడం కూడా సరైంది కాదని ఇక్కడ అర్ధం వస్తోంది.
ఇవన్నీ అమెరికా రాయబారి అభిప్రాయాలు (impressions) మరియు కొన్ని వాస్తవ సంఘటనల కలయిక. వాటి నుండి వాస్తవ ఘటనలను విడదీసి ఎవరికి వారు ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవలసిందే తప్ప అమెరికా రాయబారి అభిప్రాయాలతో ఏకీభవించనవసరం లేదు. అసలు డిప్లొమేటిక్ కేబుల్స్ లో ఉన్నవన్నీ తప్పే అనీ, కుట్ర అనీ, కట్టు కధలనీ… ఇలా కొంతమంది (లేదా అనేకమంది) భారత రాజకీయ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. పూర్తిగా కొట్టిపారేయడం ఎంత తప్పో, అవే పూర్తి నిజాలని నమ్మడం కూడా అంతే తప్పు. కేబుల్స్ లో ఉన్నవి కట్టుకధలని చెప్పడం సరికాదని ఒక మాజీ (అమెరికా) రాయబారి మాయావతి–వికీలీక్స్ వ్యవహారం సందర్భంగా ధ్రువపరచడం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు.
ప్రస్తుత సందర్భంలోని కేబుల్ తీసుకుంటే రాజారాం అమెరికా రాయబారిని కలవడం నిజం. వారి మధ్య జరిగిన సంభాషణ నిజం. లోకల్ ఎడ్యుకేటర్, రాయబారి ల మధ్య సంభాషణ నిజమే. కానీ లోకల్ ఎడ్యుకేటర్-కరుణానిధి ల సంభాషణ నిజం కావచ్చు, కాకపోనూ వచ్చు. ఇక్కడ సంభాషణలో కరుణానిధి ప్రత్యక్ష పాత్ర లేనందున ఇలా భావించాల్సి ఉంటుంది. ఇక ‘కమ్యూనిస్టు ప్రభావిత నియంతృత్వం’ గురించిన అంచనా చాలా అతి. కమ్యూనిజం గురించిన ఓనమాలు కూడా తెలియని స్ధితి నుండి ఈ అవగాహన పుట్టిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎందుకంటే అప్పట్లో అమెరికా-రష్యాల మధ్య సాగిన కోల్డ్ వార్ ప్రపంచ మార్కెట్లను తమ ప్రభావిత ప్రాంతాలుగా విభజించుకోవడం కోసం జరిగింది తప్ప (అంటే రెండు పెట్టుబడిదారీ రాజ్యాల పోటీ తప్ప) పెట్టుబడిదారీ-కమ్యూనిస్టు రాజ్యాల మధ్య జరిగిన ఘర్షణ అనుకోవడం అవగాహనారాహిత్యం. వాస్తవ పరిస్ధితుల పైన, వివిధ సిద్ధాంత రాద్ధాంతాల పైనా అవగాహన లేకపోవడం నుండి పుట్టిన స్వైర కల్పనలు ఇవి.
ఇందిరాగాంధి అమలు చేసిన ఎమర్జెన్సీ పాలన దేశంలో ఎంతటి అలజడి రేపిందో ఈ కేబుల్ లోని అంశాలు స్పష్టం చేస్తున్నదని భావించవచ్చు. అంతకు మించి ఊహాగానాలు చేయడం వృధా ప్రయాస.
దీనిని బట్టి దేశంలో అప్పటి పరిస్థితులలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడం సబబే కదా ?. అలాగే ఖలిస్తాన్ వేర్పాటు వాదం, ప్రత్యేక తమిళదేశం ఏర్పాటు ప్రత్యేక ఈలం, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుల వెనుక CIA హస్తం, మన రాష్ట్రంలోని ఒక పత్రికాధిపతి హస్తం ఉండొచ్చు. ఎందుకంటే ఈ విషయాలకు సంబంధించిన వార్తలు ఆపత్రికలో ప్రత్యేకంగా వస్తుంటాయి. ఆలోశించండి
mana politics ni entertainment ga chusinanta kalam nayakulu vyaparam ga chusinanta kalam inte manadi PRAJA SWAAMYAM mana lage palakulu untaru palana untundi indira gandhi lanti vallu inko 100 years tarvata vachina emi cheyaleru manaki stict rulers rules ishtam undadu anta enjoy chestaru emnna ayte edustaru kallu tuduchukoni malli enjoy chestaru manaki manchi entertainers kavali peddaga tittevallu navve vallu inka edo vintaga cheyali pani cheyamante kudaradu