ఈ హిందు కార్టూన్ కి అర్ధం? -కార్టూన్


The Hindu

The Hindu

ఈ కార్టూన్ కి అర్ధం ఏమై ఉండొచ్చు?

‘ది హిందు’ పత్రికలో ప్రచురించబడిన కార్టూన్ లను వివరించడం ద్వారా వివిధ రాజకీయ, ఆర్ధిక పరిస్ధితులను పాఠకుల దృష్టికి తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తున్నాను. చాలాసార్లు ఒక వ్యాసం చెప్పలేని విషయం నాలుగైదు అర్ధవంతమైన గీతలతో కూడిన కార్టూన్ శక్తివంతంగా చెబుతుంది. అందువలన ఒక పాఠకుడి సలహా మేరకు ‘కార్టూన్లు’ అని ఒక ప్రత్యేక కేటగిరి మొదలు పెట్టి వివిధ కార్టూన్లు ప్రచురిస్తున్నాను.

అయితే ఈ రోజు ది హిందు పత్రికలో వచ్చిన ఈ సురేంద్ర గారి కార్టూన్ కొంచెం సేపు అర్ధం కాలేదు. సాధారణంగా అప్పటికి దేశంలో చర్చలో ఉన్న ఒక ప్రధాన అంశాన్ని తీసుకుని ఎడిటోరియల్ పేజిలో కార్టూన్ గీస్తుంటారు. నా గెస్ ఏమిటంటే, ఈ కార్టూన్ ఆంగ్ల సామెత ‘స్కెలెటన్ ఇన్ ద క్లోజెట్’ కు ప్రతిబింబిస్తోందా అని.

ప్రజా జీవితంలో ఉన్నవారి వెనుక వారి ప్రతిష్టకు భంగం కలిగించే రహస్యాలు అప్పటివరకూ బైటికి రాకుండా ఉంటేనో, అప్పుడే కొత్తగా బైటికి వస్తుంటేనో ఈ సామెతను వారికి వర్తింపజేస్తుంటారు. ఫలానా రాజకీయవేత్త లేదా అలాంటి సెలబ్రిటీ అల్మరాలో (బట్టలు లాంటివి ఉంచుకునే బీరువా లేదా అలాంటిది) కంకాళాలు లెదా అస్ధిపంజరాలు దాగి ఉన్నాయి అంటే ఆయన బైటికి చెప్పుకోవడానికి ఇష్టపడని, ప్రతిష్టకు హాని తెచ్చే రహస్యాలు ఏవో ఉన్నాయని అర్ధం.

వికీలీక్స్ ద్వారా బైటపడిన అమెరికా రాయబార పత్రాలను ది హిందు పత్రిక వరుసగా ప్రచురిస్తోంది. ఇందులో ప్రధానంగా ఇండియాకి సంబంధించిన అమెరికా రాయబార పత్రాల పైన పత్రిక కేంద్రీకరించి ప్రచురిస్తోంది. రాజీవ్ గాంధీ ప్రధాని కాకముందు స్వీడిష్ ఆయుధ కంపెనీకి దళారీగా పని చేయడం, సంజయ్ గాంధికి చెందిన మారుతి కంపెనీ ఒక బ్రిటిష్ పౌర మరియు మిలట్రీ విమాన కంపెనీకి దళారీగా పని చేయడం లాంటి రహస్యాలు ఈ కేబుల్స్ వెల్లడించినట్లు గత రెండు, మూడు రోజుల్లో ది హిందు బైటపెట్టింది. ఎన్నికలు ఒక సంవత్సరంలో ఉన్నాయి. ఇవి ముందస్తు ఎన్నికలుగా మారొచ్చని కూడా కొందరు సూచిస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి ‘స్కెలెటన్స్ ఇన్ ద క్లోజెట్’ లాంటివి. ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన కాంగ్రెస్ నాయకుడి ప్రచార సామాగ్రి వెనుక నుండి కాంగ్రెస్ పార్టీకి మచ్చతెచ్చే కంకాళాలు బైటికి వస్తున్నాయని కార్టూనిస్టు సురేంద్ర చెప్పదలిచారని నాకనిపిస్తోంది.

ఇది కాకుండా ఇంకేమైనా అర్ధం ఉందంటారా?

One thought on “ఈ హిందు కార్టూన్ కి అర్ధం? -కార్టూన్

వ్యాఖ్యానించండి