పోలీసు పరిణామ క్రమం -కార్టూన్


పోలీసు సంస్కరణల గురించి దశాబ్దాల తరబడి పాలకులు చెబుతూనే ఉన్నారు. పోలీసు వ్యవస్ధలో సమూల మార్పులు తీసుకురావాలని సుప్రీం కోర్టు కూడా అనేకసార్లు చెప్పింది. బ్రిటిష్ వలస పాలన అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన పోలీసు హైరార్కీ వ్యవస్ధ ప్రజలకు సేవ చేయడం మాని రాజకీయ బాసుల సేవలో తరిస్తూ ప్రజావ్యతిరేక స్వభావాన్ని సంతరించుకుందని ఈ పరిస్ధితిని మార్చాలని కొన్నిసార్లు పోలీసు సంఘాలు కూడా డిమాండ్ చేశాయి.

సంస్కరణలలో భాగంగా ఏ చర్యలు తీసుకోవాలో, రాజకీయ నాయకులకు కాకుండా ప్రజలకు ఎలా జవాబుదారీగా ఉండాలో అనేక కమిటీలు టన్నుల కొద్దీ నివేదికలు తయారు చేసి ప్రభుత్వాలకు సమర్పించాయి. అవన్నీ చెదలు పట్టి నాశనం అవుతుండగానే పోలీసులు మునుపటి సెన్సిబిలిటీస్ కూడా కోల్పోయి సంస్కరణల ద్వారా సాధించదలచిన లక్ష్యానికి సరిగ్గా వ్యతిరేక దిశలో పరిణామం చెందుతున్నారని ది హిందు కార్టూన్ సూచిస్తోంది.

ఈ పరిస్ధితికి పోలీసులను పూర్తిగా భాధ్యులను చేయడం కూడా భావ్యం కాకపోవచ్చు. పోలీసుల చేతిలో లాఠీ ఎలాంటిదో వ్యవస్ధను ఏలుతున్న వారి చేతిలో పోలీసులు అలాంటివారు. లాఠీ సొంతగా పని చేయలేనట్లే పోలీసు కూడా సొంత బుద్ధితో పని చేసే పరిస్ధితి లేదు. పోలీసు వ్యవస్ధను అలా తీర్చిదిద్దిన పాలకవర్గాలు, రాజకీయ నాయకులదే ప్రధాన బాధ్యత. సంస్కరణల బాధ్యత కూడా వారి చేతుల్లో ఉండడమే అవి ఒక్కంగుళం కూడా ముందుకు సాగకపోవడానికి కారణం!

ది హిందు

ది హిందు

One thought on “పోలీసు పరిణామ క్రమం -కార్టూన్

వ్యాఖ్యానించండి