జార్జి ఫెర్నాండెజ్: పైకి అమెరికా వ్యతిరేకి, లోపల సి.ఐ.ఏ ఏజెంటు!


George in chainsవికీలీక్స్ పత్రాలు మరోసారి సంచలనం సృష్టిస్తున్నాయి. డబ్బుతో సంబంధం లేకుండా వికీలీక్స్ తో ఒప్పందం చేసుకున్న ది హిందు పత్రిక తాజాగా మరిన్ని ‘డిప్లొమేటిక్’ కేబుల్స్’ లోని అంశాలను సోమవారం నుండి ప్రచురిస్తోంది. ‘డిప్లొమేటిక్ కేబుల్స్’ అంటే అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ (విదేశాంగ శాఖ) కూ, వివిధ దేశాలలో అమెరికా నియమించుకున్న రాయబారులకు మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు. హెన్రీ కిసింజర్ అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ (విదేశాంగ మంత్రి) గా పని చేసిన కాలంలో భారత దేశంలో నియమించబడిన అమెరికా రాయబారులకు, హెన్రీ కిసింజర్ కూ జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను ‘కిసింజర్ కేబుల్స్’ పేరుతో ది హిందు ప్రచురిస్తోంది.

రాజీవ్ గాంధీ ప్రధాని కాక ముందు స్వీడన్ ఆయుధ కంపెనీలకు ఏజెంటుగా (దళారి/కాయిదా/బ్రోకర్) పని చేశాడని 1975-76 నాటి కిసింజర్ కేబుల్స్ ద్వారా తెలుస్తోంది. కాగా తనను తాను అమెరికా సామ్రాజ్యవాద వ్యతిరేక ఛాంపియన్ గా చెప్పుకునే కార్మిక నాయకుడు, ఎన్.డి.ఏ కూటమి మాజీ నేత జార్జి ఫెర్నాండెజ్ వాస్తవానికి ఎమర్జెన్సీ సమయంలో సి.ఐ.ఎ నుండి డబ్బులు స్వీకరించడానికి సిద్ధపడ్డాడని, అరెస్టయిన ఫెర్నాండెజ్ ను విడుదల చేయమని చెప్పడానికి అమెరికా ప్రయత్నించి కూడా తమ రాయబారి వారించడంతో ఆగిపోయిందని కిసింజర్ కేబుల్స్ ద్వారా వెల్లడయింది. భారత దేశంలో కమ్యూనిస్టులను అణచివేయడానికి స్వయంగా ఇందిరా గాంధీయే, అది కూడా 1951లోనే (అనగా నెహ్రూ ప్రధానమంత్రిత్వం కిందనే), సి.ఐ.ఎ నుండి నిధులు స్వీకరించిందని కూడా కిసింజర్ కేబుల్స్ ద్వారా తెలుస్తున్నది.

ఎమర్జెన్సీ రోజుల్లో జార్జి ఫెర్నాండెజ్ అంటే ఒక విప్లవ నేత. ఇందిరా గాంధీ నియంతృత్వ పాలన అనే కొండను ఢీకొన్న వీర ధీర పోటేలు. రైల్వే కార్మికుల నాయకుడుగా దేశ వ్యాపిత సమ్మెలకు నాయకత్వం వహించి భారత దేశ వ్యాపార, ప్రయాణ వ్యవస్ధలకు ప్రధాన నాడీ వ్యవస్ధగా పని చేసే రైల్వేలను స్తంభింపజేసిన కీర్తిని కలికితురాయిగా ధరించిన ఫైర్ బ్రాండ్. ఎమర్జెన్సీ ప్రకటించడంతోనే అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయి ఆ కాలంలో దేశాన్ని ఉర్రూతులూపిన నగ్జలైటు ఉద్యమంతో భుజం భుజం కలిపిన సాహసిక విప్లవకారుడు. అలాంటి ధీర వీర పోటేలు, ఫైర్ బ్రాండు, విప్లవకారుడు గారి అసలు రంగును, అమెరికా సామ్రాజ్యవాదం అనే నిజమైన భారీ పర్వతాన్ని ‘ఇరాక్, ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధ వాస్తవాలను అమెరికన్ ప్రజలకు తెలియజేయాలన్న ఒక సామాన్య కన్విక్షన్’ తో, సి.ఐ.ఎ రహస్య కంప్యూటర్ల మెమొరీ డిస్కుల అట్టడుగు పొరల్లో దాగిన నరహంతక యుద్ధ వాస్తవాలను వెలికి తీయడం ద్వారా, బ్రాడ్లీ మేనింగ్, జూలియన్ ఆసాంజే అనబడే అతి చిన్న మేకపిల్లలు ఢీకొని వెల్లడి చేశాయి.

నవంబరు 1975లో ఇండియా నుండి అమెరికాకి వెళ్ళిన కేబుల్ ప్రకారం “సి.ఐ.ఎ నుండి నిధులు తీసుకోవడానికి ఆయన ఇప్పుడు (1975లో) కూడా సిద్ధంగా ఉన్నాడు.”  ఎమర్జెన్సీ పాలనకు వ్యతిరేకంగా ప్రభుత్వ సంస్ధల భవనాలను డైనమేట్లతో పేల్చివేయడానికి ఫెర్నాండెజ్ ప్రయత్నాలు ముమ్మరం చేశాడని అందులో భాగంగానే మొదట ఫ్రాన్సును, తర్వాత సి.ఐ.ఎ ను నిధుల సహాయం కోరాడని ది హిందు తెలిపింది. ఫ్రెంచి రాయబార ప్రతినిధి (Labour Attache) మాన్ ఫ్రెడ్ తర్లాక్ తో సమావేశం అయిన ఫెర్నాండెజ్ ఫ్రెంచి ప్రభుత్వం నుండి నిధులు కావాలని అర్ధించగా ఆయన తిరస్కరించినట్లు తెలుస్తోంది. అయితే సి.ఐ.ఎ వ్యక్తులను తనకు పరిచయం చేయాలని ఫెర్నాండెజ్ కోరగా తనకూ ఎవరూ తెలియదని తర్లాక్ చెప్పాడట. కిసింజర్ కేబుల్ ప్రకారం నవంబరు 1, 1975 తేదీన గానీ, ఆ తేదీకి దగ్గర్లో గాని ఈ సమావేశం జరిగింది. ఈ మేరకు నవంబరు 28, 1975 తేదీన ఇండియా నుండి అమెరికా స్టేట్ డిపార్ట్ మెంటు కు కేబుల్ వెళ్లింది. (Cable: 1975NEWDE15543_b)

తర్లాక్ తో జరిగిన సమావేశంలో విధ్వంసక కార్యకలాపాల్లో పాల్గొనడానికి తనతో పాటు 300 మందిమి సిద్ధంగా ఉన్నామని, దక్షిణాన అప్పటికే రెండు రైల్వే బ్రిడ్జిలను, బొంబే, పునాల మధ్య ఒక బ్రిడ్జిని పేల్చివేశామని ఫెర్నాండెజ్ తెలిపాడు. బోంబేలో రెండు డాక్ లకు నిప్పు పెట్టామని కూడా ఆయన చెప్పాడు. తనతో కలిసి పని చేస్తున్న నగ్జలైట్లు జులై 1975లో మద్రాసులో ఎల్.ఐ.సి భవనానికి నిప్పు పెట్టారని ఫెర్నాండెజ్ చెప్పాడని తెలుస్తోంది. అయితే ఫెర్నాండెజ్ చెప్పిన ఈ మాటలను మొదట అమెరికన్లు అనుమానించారు. “జార్జి ఫెర్నాండెజ్ గతంలో పశ్చిమ రాయబారుల దగ్గర ఇలాగే తాను, తన గ్రూపు రైలు పట్టాల పేల్చివేతకు బాధ్యులమని గొప్పలు చెప్పుకున్నాడు” అని మరొక కేబుల్ (1976NEWDE05180_b) లో అమెరికా రాయబారి పేర్కొన్నాడు.

ఫెర్నాండెజ్ అప్పట్లో రైల్వే కార్మిక సంఘానికి నాయకుడు. ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ నాయకుడుగా 1974లో రైల్వే సమ్మెకు నాయకత్వం వహించి రైల్వే వ్యవస్ధను స్తంభింపజేసిన పేరు సంపాదించాడు. జూన్ 26, 1975 తేదీన ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ ప్రకటించడంతో అజ్ఞాతవాసంలోకి వెళ్ళాడు. అలాంటి వ్యక్తి స్వయంగా తర్లాక్ ని కలవడం, ప్రతిపక్ష నాయకుడుగా సి.ఐ.ఎ నిధులను, అమెరికా ప్రభుత్వ సహాయాన్ని కోరడం బట్టి ఆయన దిగజారుడుతనం అర్ధం అవుతోంది. ఎమర్జెన్సీ అనంతరం జనతా పార్టీ ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా పని చేసిన ఫెర్నాండెజ్ ‘ఇందిరా గాంధీ’ కి డబ్బులు ఇచ్చిందన్న ఆరోపణతో 1977లో కోకోకోలాను దేశం నుండి వెళ్లగొట్టాడు. ఇందిరకు కోకోకోలా 20 లక్షల రూపాయలు డబ్బు ఇచ్చిందని ఫెర్నాండెజ్ ఆరోపించి తన చర్యకు కారణంగా చూపాడు.

George_Fernandesఅయితే ఇందిరా గాంధీకి డబ్బు ఇచ్చింది కోకోకోలా కాదని సి.ఐ.ఎ అని 1973-75 మధ్య ఇండియాలో పని చేసిన అమెరికా రాయబారి డేనియల్ పాట్రిక్ మొనిహాన్ తన పుస్తకం (A Dangerous Place) లో చెప్పాడని ది హిందు తెలిపింది. 1950లలో కమ్యూనిస్టులను ఎన్నికల్లో ఎదుర్కోడానికి సి.ఐ.ఎ ఈ డబ్బు కాంగ్రెస్ పార్టీకి, మరీ ముఖ్యంగా ఇందిరా గాంధికి  ముట్టజెప్పిందని పుస్తకంలో పేర్కొన్నట్లు పత్రిక తెలిపింది. అయితే ఈ విషయాన్ని ఫెర్నాండెజ్ పట్టించుకోలేదని ది హిందు వ్యాఖ్యానించింది.

ఫెర్నాండెజ్ కోరిన విధంగా సి.ఐ.ఎ గాని, అమెరికా గాని ఫెర్నాండెజ్ కు నిధులు తదితర సహాయం అందజేసిందీ లేనిదీ కేబుల్స్ లో లేదని తెలుస్తోంది. అయితే ఫెర్నాండెజ్ పైన అమెరికాకు అనూహ్య స్ధాయిలో పెరిగిన ఆసక్తిని మాత్రం కేబుల్స్ పట్టిస్తున్నాయి. జూన్ 10, 1976 తేదీన జార్జి ఫెర్నాండెజ్ ను ఎమర్జెన్సీ ప్రభుత్వం అరెస్టు చేశాక ఆయనను విడుదల చేయించడానికి అమెరికా అమిత ఆసక్తి చూపినట్లు అమెరికా విదేశాంగ శాఖ నుండి వచ్చిన ఒక కేబుల్ ద్వారా తెలుస్తోంది. ఆగస్టు 6, 1976 తేదీన ఢిల్లీలోని అమెరికా ఎంబసీకి వచ్చిన కేబుల్ ఇలా పేర్కొంది. “ప్రతిపక్ష నాయకుడు జార్జి ఫెర్నాండెజ్ గురించిన సమాచారం తెలివిగా (దొంగచాటుగా అని అర్ధం కావచ్చు) ఏ సమాచారం సంపాదించగలిగినా డిపార్ట్ మెంటుకు ఉపయోగం. అతనికి వ్యతిరేకంగా జరుగుతున్న పరిశోధన గురించి కూడా సమాచారం సేకరించాలి. ఫెర్నాండెజ్ గురించి వివరాలు కావాలని (స్టేట్) డిపార్ట్ మెంటు కు (అమెరికా ప్రభుత్వం నుండి) అనేక ఎంక్వైరీలు వస్తున్నాయి.” (Cable: 1976STATE195162_b) నవంబరు 10 తేదీన అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ హెన్రీ కిసింజరే స్వయంగా ఫెర్నాండెజ్ కేసు గురించి వివరాలు కోరుతూ కేబుల్ పంపాడు.

అమెరికా నుండి వచ్చిన కేబుల్స్ కు ఇక్కడి అమెరికా రాయబారి స్పందించాడు. ఫెర్నాండెజ్ పాల్గొన్న ‘బరోడా డైనమైట్ పేలుడు కేసు’ గురించి, ఆయనను, ఆయన సహచరులను అరెస్టు చేయడానికి ఇందిర చేస్తున్న ప్రయత్నాలను గురించి సమాచారం పంపాడు. ఫెర్నాండెజ్ ను విడుదల చేయాలని అమెరికా ప్రభుత్వం కోరితే ఎలా ఉంటుందని ఈ సందర్భంగా కిసింజర్ రాయబారి అభిప్రాయం కోరాడు. ఆయన విడుదల కోసం అమెరికా ప్రభుత్వం పైన ప్రైవేటుగా ఒత్తిడి వస్తున్నదని కిసింజర్ చెప్పడం గమనార్హం. ఈ ఐడియాను ఇక్కడి అమెరికా ఎంబసీ ఉప అధిపతి డేవిడ్ టి. ష్నీదర్ తిరస్కరించాడు. అలా చేస్తే అమెరికాకు మంచి జరగక పోగా చెడే ఎక్కువ జరుగుతుందని రాయబారి తన కారణాలను చెప్పాడు. ఎమర్జెన్సీ ఎత్తివేశాక కూడా ఫెర్నాండెజ్ పైన నిర్బంధం కొనసాగే అవకాశం ఉన్నదని కనుక ఆయనకు దూరంగా ఉంటేనే మేలని చెప్పినట్లు తెలుస్తోంది. కానీ అమెరికా రాయబారి ఊహించినడానికి విరుద్ధంగా జరగడం ఇప్పుడు చరిత్ర. పైగా ఫెర్నాండెజే కోకోకోలా, ఐ.బి.ఎం కంపెనీలను ఇండియా నుండి వెళ్లగొట్టాడు. తనకు సాయం చేయని కోపాన్ని ఆయన ఆ విధంగా తీర్చుకున్నట్లు కనిపిస్తోంది.

ఇవన్నీ కేవలం ఇందిరా గాంధీ, ప్రతిపక్ష నాయకులకు మధ్య జరిగిన తగాదా మాత్రమే అనుకుంటే పొరపాటు. రాజకీయ స్వప్రయోజనాలు నెరవేర్చుకోవడానికీ, దేశంలో వెల్లువెత్తుతున్న ప్రజాపోరాటాలను అణచివేయడానికి అవసరమైతే దేశాన్ని చీకటి పాలనలోకి నెట్టడానికి సైతం సిద్ధమేనని కాంగ్రెస్ నిరూపించుకోగా, తమ స్వప్రయోజనాల కోసం అవసరమైతే కుట్ర కుతంత్రాల పుట్ట అయిన సి.ఐ.ఎ పంచన చేరడానికి కూడా  సిద్ధమేనని జార్జి ఫెర్నాండెజ్ లాంటివారు నిరూపించుకున్నారు.

అమెరికాకు వ్యతిరేకంగా సోషలిస్టు రష్యా పంచన కాంగ్రెస్ చేరడం ఒట్టి బూటకమని, కాంగ్రెస్ నేతృత్వంలోని పాలకవర్గాల దళారీ ప్రయోజనాల కోసమే అమెరికా, రష్యాల మధ్య చక్కర్లు కొట్టారు తప్ప నెహ్రూ చెప్పిన ‘సోషలిస్టిక్ పాట్రన్ ఆఫ్ సొసైటీ’ ఏ కోశానా వారి దృష్టిలో లేదని కిసింజర్ కేబుల్స్ ద్వారా స్పష్టం అవుతోంది. భారత దేశంలోని మార్క్సిస్టు-లెనినిస్టు విప్లవ పార్టీలు భారత పాలకుల అసలు రంగు గురించి 1970 ల నాడే చేసిన సైద్ధాంతీక సూత్రీకరణ ఈ విధంగా అమెరికన్ ‘డిప్లొమేటిక్ కేబుల్స్’ ద్వారానే రుజువు కావడం భారత విప్లవకారులకు ఆ మాటకొస్తే ప్రపంచవ్యాపితంగా పోరాడుతున్న మార్క్సిస్టు-లెనినిస్టు శక్తులకు అనూహ్య దిశ నుండి వచ్చిన పక్కా మద్దతు, రుజువు అని చెప్పవచ్చు.

కాంగ్రెస్ నాయకుడు నెహ్రూయే సోషలిజం తెస్తాడని సి.పి.ఐ నాయకులు ప్రజా పోరాట కాడిని ఒక వైపు నుండి కింద పడేస్తే, ‘కేరళ, బెంగాల్ ల మార్గమే మన మార్గం’ అంటూ సి.పి.ఎం కూడా మరో వైపు నుండి కాడి కింద పడవేసి రివిజనిస్టు పార్లమెంటరీ పంధాను స్వీకరించిన క్రమం మరోసారి తేటతెల్లం అయిందని చెప్పడం సందర్భోచితం కాగలదు. దళారీ పాలకుల సోషలిజం శోష వచ్చి ఎన్నడో మూలన పడిపోగా నూతన ఆర్ధిక విధానాలతో సరికొత్త రక్తం ఎక్కించుకుని ప్రజల ప్రయోజనాలపై అనేక రెట్లు దాడులను తీవ్రం చేయడం కళ్ళముందున్న వాస్తవం. దేశ ఖనిజ, నీటి, స్పెక్ట్రమ్ వనరులను పరాయి దేశాల కంపెనీలకు ధారాదత్తం చేస్తున్న నూతన ఆర్ధిక విధానాలు సైతం కమ్యూనిస్టు శంఖంలో బాప్తిజం పొంది అభివృద్ధి కాముక విధానాలుగా ప్రజల ముందు రొమ్ము విరుచుకుని నర్తిస్తున్న విపరీత పరిస్ధితి కూడా నేటి వాస్తవమే.

6 thoughts on “జార్జి ఫెర్నాండెజ్: పైకి అమెరికా వ్యతిరేకి, లోపల సి.ఐ.ఏ ఏజెంటు!

 1. v.shekar garu nadoka sandeham?

  1) pettubadidari vidananni avalambinchey america. communist siddantalanu kaligina fernandez nu bayataku tesuku ravadaki chesina prayatnala valla americaku vachey falitam emiti?

  2) american prabutvam indira gandhini support chesi socialist-leninist bava prabhavitha desannani emergency time lo tama margam loki techukuney prayatnam yenduku cheyalentaru?

  danyavadalu!.

 2. శివమురళి గారు,

  1. ఫెర్నాండెజ్ కు కమ్యూనిస్టు సిద్ధాంతాలు లేవు. తాను సోషలిస్టుని చెప్పుకున్నమాట నిజమే. కాని అలా చెప్పుకునేవారంతా సోషలిస్టులు కారు. ఫెర్నాండెజ్ కనీసం నకిలీ సోషలిస్టు కూడా కాదు. ఉత్త సోషలిస్టు. లేకపొతే బి.జె.పితో ఆయన స్నేహం సాధ్యం కాదు.

  2. సోషలిస్టు-లెనినిస్టు ప్రభావంలో మన దేశం ఉందని (లేక ఉండేదని) మీరు చెబుతున్నారు (అనుకుంటున్నాను). సోషలిస్టు ఫెర్నాండెజ్ కి వ్యతిరేకంగా ఇందిర తదితర కాంగ్రెస్ నాయకులను తమ ప్రభావంలోకి అమెరికా తెచ్చుకుని ఉండొచ్చు కదా అన్నది మీ ప్రశ్న అనుకుంటాను. ఫెర్నాండెజ్ సోషలిస్టు కాదని చెప్పాను కనుక ఈ ప్రశ్నకు ఆస్కారం లేదు (మీరు చెప్పిన అర్ధంలో).

  సోషలిజం, లెనినిజం అంశాలపై మీకున్న అవగాహన నాకు తెలియదు. కనుక సమాధానం ఇవ్వడం కొంచెం కష్టమే. మీ ప్రశ్నలని ఇంకా వివరించగలరేమో చూడండి.

 3. Hindu lo vasthunna news nu miru marintha vipulanga rayadam abinanda niyam.
  Alaagey andhuloni (Hindhu loni) migatha mukyamaina vishayaalu ( defence,Science&Tech ect related) vishayyalu kuda post chestey UPSC Aspirants ku baaga help ga vuntundhani na abhiprayam.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s