యుద్ధం రీత్యా ఎంబసీలు ఖాళీ చేయాల్సి రావచ్చు -ఉత్తర కొరియా


కిమ్ జోంగ్-ఉన్ -ది హిందు

కిమ్ జోంగ్-ఉన్ -ది హిందు

ఉత్తర కొరియా, అమెరికాలు పరస్పర హెచ్చరికలతో ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో గువామ్ లో ఉన్న తమ సైనిక స్ధావారానికి అదనంగా రెండు క్షిపణి విచ్ఛేదక వ్యవస్ధలను అమెరికా గురువారం నాడు చేరవేసింది. దక్షిణ కొరియా ఆధునిక డిస్ట్రాయర్ యుద్ధ పరికరాలను ఉత్తర కొరియా సరిహద్దుకు శుక్రవారం తరలించింది. ఈ నేపధ్యంలో ఉత్తర కొరియాలోని విదేశీ రాయబారులు తమ తమ ఎంబసీలను ఖాళీ చేయాల్సి రావచ్చని ఏప్రిల్ 10 తర్వాత వారికి రక్షణ ఇవ్వడం తమకు కష్టం కావచ్చని అక్కడి ప్రభుత్వం సమాచారం పంపింది. యుద్ధం రావడానికి ఏమాత్రం అవకాశాలు ఉన్నాయి అన్న విషయంలో అంతర్జాతీయ పరిశీలకులు భిన్న అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నారు.

దక్షిణ కొరియా, అమెరికాలు ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయని, ఏ క్షణంలోనైనా దాడి జరిగే పరిస్ధితులున్నాయని, కనుక విదేశీ రాయబారులు తమ కార్యాలయాలను ఖాళీ చేసే విషయాన్ని పరిశీలించాలని ఉత్తర కొరియా ప్రభుత్వం కోరినట్లు చైనా వార్తా సంస్ధ జిన్ హువాను ఉటంకిస్తూ ‘ది హిందు’ తెలిపింది. ఉత్తర కొరియా మధ్య తరహా క్షిపణులను మొబైల్ లాంచర్ల మీదికి లోడ్ చేసిందని దక్షిణ కొరియా వార్తా సంస్ధ యోన్ హాప్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ పరస్పర మోహరింపులతో ఉత్తర కొరియా, అమెరికా మరియు దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్తతలు ఇంకా తీవ్రం అయ్యాయి.

ఎంబసీలను ఖాళీ చేయాలన్న సూచన తమ రాయబార కార్యాలయానికి అందిందని, అయితే ఖాళీ చేసే ఉద్దేశం ఏదీ తమకు లేదని రష్యా విదేశీ మంత్రి సెర్గీ లావరోవ్ చెప్పినట్లు రష్యా టైమ్స్ తెలిపింది. ఇరు పక్షాలు యుద్ధ పరిస్ధితిని రెచ్చగొట్టే అలంకార ప్రాయ ప్రకటనలను మానుకోవాలని, పరిస్ధితులను పరస్పరం చర్చించి చక్కదిద్దుకోవాలని ఆయన కోరాడు. ఇరు పక్షాలు ఉద్రిక్తతలకు కారణమేనని ఆయన వ్యాఖ్యానించాడు.

NK missle rangeవార్షిక సంయుక్త యుద్ధ విన్యాసాల సందర్భంగా అమెరికా అణు బాంబులు జారవిడిచే బి-2, బి-52 బాంబర్ల చేత కొరియా గగనతలంపై విన్యాసాలు చేయించడంతో తాజా ఉద్రిక్తతలు ప్రారంభం అయ్యాయి. యుద్ధ విన్యాసాలు ఆపాలని ఉత్తర కొరియా కోరినప్పటికీ దక్షిణ కొరియా, అమెరికాలు పట్టించుకోలేదు. దానితో అవసరమైతే దక్షిణ కొరియాలో ఉన్న అమెరికా సైనిక స్ధావరం పైనా, గువాంలోని సైనిక స్ధావరం పైనా అణు బాంబులు ప్రయోగించడానికి వెనుకాడబోమని వారం రోజుల క్రితం ఉత్తర కొరియా ప్రకటించింది. ఉత్తర కొరియా ప్రకటన స్పష్టమైన ప్రమాదాన్ని సూచిస్తోందని అమెరికా ఉన్నతాధికారులు ప్రకటించడంతో పరిస్ధితి మరింత వేడెక్కింది.

బ్రిటన్ కూడా ఉత్తర కొరియా నుండి ‘ఎంబసీ ఖాళీ చేయాలన్న’ సలహా అందుకున్నట్లు రష్యా టైమ్స్ తెలిపింది. ఇరు పక్షాలు సంయమనం పాటించాలని చైనా మళ్ళీ కోరింది. ఒక వేళ యుద్ధం అంటూ వస్తే చైనా పాల్గొనాలా లేదా అన్న విషయమై విభిన్న వాదనలు చైనాలో వినిపిస్తున్నాయని తెలుస్తోంది. ఉత్తర కొరియాపై అమెరికా దాడి చేసి తమకు అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పరిస్తే అది నేరుగా చైనా భద్రతకు ప్రమాదం తెస్తుంది. చైనా ఒక వ్యూహాత్మక మిత్రుడిని కోల్పోయినట్లవుతుంది. కనుక చేతులు ముడుచుకుని కోర్చోవడం చైనాకు ఆత్మహత్యా సదృశమే కాగలదు.

ఈ నేపధ్యంలో అమెరికా దక్షిణ కొరియాకు ఇస్తున్నట్లే చైనా కూడా ఉత్తర కొరియాకు అణు రక్షణ వ్యవస్ధ ఇవ్వాలని కొందరు చైనీయులు కోరుతున్నారు. తద్వారా చైనా తన వ్యూహాత్మక ప్రయోజనాలు కాపాడుకోవాలని కోరుతున్నారు. ఉత్తర కొరియాకు అణు రక్షణ కల్పిస్తే అప్పుడు ఆ దేశం అణు పరీక్షలు నిర్వహించే అవసరం తప్పుతుందని వారు సూచిస్తున్నారు. చైనాను సైనికంగా చుట్టుముట్టి ఆ దేశ వాణిజ్య, రక్షణ, వ్యూహాత్మక ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్న అమెరికాను ఆసియాలో నిలువరించాలంటే ఉత్తర కొరియాతో చైనా మిత్రత్వాన్ని కొనసాగించడం అవసరం.

అదే సమయంలో యుద్ధ నివారణకు చైనా ప్రయత్నించవచ్చు. ఉత్తర కొరియాపై ఒత్తిడి తెచ్చి యుద్ధ ప్రయత్నాలను ఆపించాలని కొందరు కోరుతున్నారు. కానీ ఉత్తర కొరియాది ప్రధానంగా, ప్రతిస్పందనే తప్ప ఏక పక్ష స్పందన కాదు. తన మాటను ఉత్తర కొరియా వినకపోవచ్చని కూడా చైనా చెబుతోంది.

వ్యాఖ్యానించండి