రెండేళ్ల క్రితం భారీ ప్రమాదం సంభవించిన ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రంలో మళ్ళీ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. మూడో నెంబరు అణు రియాక్టరు వద్ద వాడిన అణు ఇంధనాన్ని చల్లబరిచే కూలింగ్ వ్యవస్ధ రెండు గంటల సేపు విఫలం అయిందని జపాన్ వార్తా సంస్ధ క్యోడో న్యూస్ ఏజన్సీని ఉటంకిస్తూ ‘ది హిందు’ తెలిపింది. నెల రోజులలో ఇక్కడ విద్యుత్ సరఫరా విఫలం కావడం ఇది రెండోసారి. తక్షణ ప్రమాదం ఏమీ లేదని అణు కర్మాగారం నిర్వహిస్తున్న ‘టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ’ (టెప్కో) ప్రకటించినట్లు తెలుస్తోంది.
మూడో నెంబరు రియాక్టర్ వద్ద శుక్రవారం అలారం మోగడంతో వాడిన ఇంధనం (spent fuel) నిల్వ చేసిన ఫ్యూయెల్ ట్యాంకును చల్లబరిచే వ్యవస్ధకు విద్యుత్ సరఫరా ఆగిపోయిందని తెలిసిందని జపాన్ అణు నియంత్రణ సంస్ధ ప్రకటించింది. విద్యుత్ సరఫరా లేకపోతే ఇంధనాన్ని చల్లబరిచే నీటి సర్క్యులేషన్ వ్యవస్ధ పని చేయడం ఆగిపోతుంది. చల్లబరిచే ప్రక్రియ ఆగిపోతే ఇంధన రాడ్లు వేడెక్కి రేడియేషన్ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. విద్యుత్ సరఫరా ఆగిపోయాక ఇలాంటి ప్రమాదకర పరిస్ధితి ఏర్పడడానికి రెండు వారాలు పడుతుందని కనుక భయపడవలసిన అవసరం లేదని టెప్కో కంపెనీ చెబుతోంది.
మార్చి 19 తేదీన కూడా ఇలాగే అణు కర్మాగారానికి విద్యుత్ సరఫరా ఆగిపోయింది. 1, 3, 4 రియాక్టర్ల వద్ద వాడిన ఇంధన రాడ్లను నిలవ చేసే ట్యాంకులకు అనుసంధించిబడిన కూలింగ్ వ్యవస్ధ దీనివలన ఒక రోజంతా పని చేయలేదు. విద్యుత్ సరఫరా కంపెనీ నుండి విద్యుత్ సరఫరా కావడంలోనే ఏదో లోపం ఉందని దానివల్లనే విద్యుత్ ఆగిపోయిందని టెప్కో కంపెనీ మొదట ప్రకటించింది. ఒక రోజంతా పరిశోధన జరిగాక తమ ప్లాంటులోనే స్విచ్ బోర్డు వద్ద వైర్ తెగిపోయి విద్యుత్ సరఫరా ఆగిపోయిందని ఆ తర్వాత తెలిపింది. స్విచ్ బోర్డు వద్ద ఎలుక చచ్చిపడి ఉందని బహుశా దానివల్లనే విద్యుత్ సరఫరా ఆగిపోయి ఉండవచ్చని తెలిపింది.
టెప్కో చెప్పిన కారణంతో ఓడ లోని ఇనుమును ఎలుకలు కొరికి తినేసిన కధ చాలామందికి జ్ఞప్తికి తెచ్చింది. ఈ రోజు విద్యుత్ సరఫరా విఫలం కావడానికి కారణం ఏమిటో టెప్కో కంపెనీ ఇంకా చెప్ప లేదు. ఈసారి చచ్చిన ఎలుకను తినడానికి పిల్లి వచ్చి ఉండవచ్చు. జపాన్ ప్రజలు మాత్రం అణు విద్యుత్ కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేయడం కొనసాగుతోంది. ప్రజా వ్యతిరేకతకు జడిసి దేశంలోని 50 అణు విద్యుత్ కర్మాగారాలలో రెండింటిని మాత్రమే పని చేయిస్తున్నారు.
మూడు నెలల క్రితం ప్రధాని పదవి చేపట్టిన షింజో అబే అణు రియాక్టర్లను తిరిగి పని చేయించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ మేరకు తన కోరికను తెలిపాడు కూడా. ఆయన కోరిక వెనుక అణు కంపెనీల లాబీ ఒత్తిడి ఉన్నదని వివిధ సంస్ధలు, ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రజా వ్యతిరేకత అణు లాబీ ప్రయత్నాలకు గండి కొడుతున్నా, ఏదో ఒక రోజు జపాన్ లో అణు విద్యుత్ ప్లాంటులు తిరిగి తెరుచుకునే అవకాశం కనిపిస్తోంది.
