మన్మోహన్ ప్రభుత్వానికి ఫుల్ మార్కులా? -కార్టూన్


The Hindu

The Hindu

కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ తానే ప్రధాన మంత్రి కావొచ్చని మన్మోహన్ చెప్పినట్లు ఈ మధ్య పత్రికలు గుసగుసలాడాయి. బ్రిక్స్ సమావేశం నుండి తిరిగొస్తూ విమానంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని ఇచ్చిన అస్పష్ట సమాధానం ఈ గుసగుసలకు కారణం. మీరు మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా అన్న ప్రశ్నకు ఆయన ఊహాగానాలకు బదులివ్వను అని చెబుతూనే ‘బ్రిడ్జి దగ్గరకు వెళ్ళాక దాన్ని ఎలా దాటాలనేది ఆలిచిస్తాం” అన్నారు. దానర్ధం మళ్ళీ ప్రధాని పదవి ఆయన కోరుతున్నట్లే అని పత్రికలు ఊహించగా బి.జె.పి సీరియస్ గా రియాక్ట్ అవడం కూడా జరిగిపోయింది.

ఇంతకీ విషయం ఏమిటంటే మళ్ళీ కాంగ్రెస్సే పెద్ద పార్టీగా అవతరిస్తే పరిస్ధితి ఏమిటని కాంగ్రెస్ పెద్దలు మధిస్తున్నారు. ప్రధాన మంత్రి స్ధానంలో మన్మోహన్ ఉండగా కాంగ్రెస్ నాయకురాలుగా సోనియా గాంధీ కొనసాగిన ద్వికేంద్రక అధికార ప్రయోగం విఫలం అయిందని దిగ్విజయ్ సింగ్ లాంటివారు వాపోతుంటే, అసలు అదే విజవంతం అయిందని జనార్ధన్ ద్వివేది లాంటి వారు సర్టిఫికేట్ ఇస్తున్నారు. రానున్న రోజుల్లో అటు కాంగ్రెస్ అధ్యక్ష పదవి, ఇటు ప్రధాన మంత్రి పదవి రెండూ రాహుల్ గాంధీ యే నిర్వహించాలని దిగ్విజయ్ శిబిరం ప్రతిపాదిస్తున్నట్లు కనిపిస్తోంది. ‘పి.ఎం ఇన్ వెయిటింగ్’ అని ‘ది ఎకనమిస్టు’ పత్రిక అభివర్ణించిన చిదంబరం ఆశలకు నీళ్ళు వదులుకున్నట్లేనా అని ప్రశ్నిస్తున్నవారు లేకపోలేదు.

ఇదిలా ఉండగా తాము మరిన్ని సంస్కరణలకు తెర తీయబోతున్నామని మన్మోహన్, చిదంబరం లు చెప్పుకొస్తున్నారు. ప్రభుత్వంలో బ్యూరోక్రసీ రెడ్ టేపిజం, అవినీతి, కూటమి ప్రభుత్వ నిర్వహణ… ఇవన్నీ సమస్యలే అయినా 8 శాతం వృద్ధి రేటు నమోదు చేసినప్పుడు కూడా ఇవి ఉన్నవేనని ఆయన ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్’ సమావేశంలో గుర్తు చేశాడు. అప్పట్లో అతి ఆశావాదంతో ఉన్న పరిశ్రమలు, ఇప్పుడు అతి నిరాశావాదంతో ఉన్నాయని ప్రధాని అన్నారు. పరిమిత అర్ధంలో ఇది తెలివైన మాటే కావచ్చు. నిజానికి ప్రధాని ఇలా అర్ధవంతంగా మాట్లాడడం అరుదు. అంతలోనే తాము ఎక్కడికీ పారిపోవడం లేదని, అదే తమ విజయమని కూడా అనేశారు.

ఆయనను పారిపోకుండా అదృశ్య శక్తులేవో కట్టేశాయని, మాట్లాడకుండా నోరు మూసాయని అందుకే ఆయన ఆమాట అనాగలిగారని ఈ కార్టూన్ సూచిస్తున్నట్లుంది. ఇంతకీ ద్వికేంద్రక అధికార వ్యవస్ధే ఆయన పారిపోకుండా ఉండడానికి కారణం కాదు కదా!?

వ్యాఖ్యానించండి