ఇలాంటి దారుణాలు పశ్చిమ దేశాల్లోనే జరుగుతాయి…


Mick Philpott, Mairead -Photo: Mirror

Mick Philpott, Mairead -Photo: Mirror

మాజీ భార్య పైన నేరం నెట్టడానికి తాజా భార్యతో కలిసి ఇంటికి నిప్పు పెట్టి ఆరుగురు పిల్లలని చంపుకున్న జంట కధ ఇది. 8 వారాల పాటు కొనసాగిన కోర్టు విచారణలో 56 యేళ్ళ నిందితుడు మిక్ ఫిల్ పాట్ అత్యంత అసహజమైన జీవితం గడిపిన వ్యక్తిగా పత్రికల్లో స్ధానం సంపాదించాడు. ఐదుగురు భార్యలతో మొత్తం 17 మంది పిల్లలకు జన్మ ఇవ్వడం, పదేళ్లపాటు ఇద్దరు భార్యలతో ఒకే ఇంటిలో గడపడం, మిత్రులతో కలిసి భార్యతో లైంగిక చర్యలలో పాల్గొనడం… ఇవన్నీ విచారణలో బైటికి రావడంతో ఫిల్ ఇప్పుడు బ్రిటన్ తో పాటు ప్రపంచ వ్యాపితంగా పత్రికలకు ఆహారంగా మారాడు.

మిత్రుడు పాల్ మోస్లీ (46), భార్య మైరీడ్ (32) లతో కలిసి ఇంటికి నిప్పు పెట్టిన మిక్ ఫిల్, ఆ తర్వాత పిల్లలను తానే కాపాడి, నేరాన్ని మాజీ భార్య విల్స్ (29) మీదికి నెట్టాలని పధకం పన్నాడని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. అయితే ఫిల్ పాట్, మంటలని అదుపు చేయలేకపోవడంతో అవి ఆరుగురు పిల్లలని కబళించాయి. పదేళ్ళు మిక్, మైరీడ్ లతో కలిసి ప్రభుత్వం సమకూర్చిన ఇంటిలో నివసించిన విల్స్ దుర్ఘటనకు మూడు నెలల ముందు తన 5 గురు పిల్లలతో కలిసి ఇంటినుండి వెళ్లిపోయింది. ఐదుగురు పిల్లల్లో నలుగురు మిక్ ఫిల్ తో కలిగినవారు కాగా మరొకరు వేరే భర్త వలన పుట్టిన పిల్లాడని పత్రికలు తెలిపాయి.

మధ్య ఇంగ్లండులోని డెర్బిలో మే, 2012లో ఈ దుర్ఘటన సంభవించింది. చనిపోయిన పిల్లలు 5 నుండి 13 సంవత్సరాల మధ్య వయసు గలవారు. వీరిలో ఐదుగురు ఫిల్ వలన మైరీడ్ కు జన్మించగా, అందరిలోకి పెద్దవాడు వేరే భర్త ద్వారా జన్మించాడని  బి.బి.సి తెలిపింది. ఫిల్ ఎలాంటి వాడైనప్పటికీ పిల్లలను బాగానే చూసుకున్నాడని అతని తరపు లాయర్లు వాదించినా కోర్టు దానిని పరిగణించలేదు.

21 యేళ్ళ వయసులో 17 యేళ్ళ తన గర్ల్ ఫ్రెండ్ ని కత్తితో అనేకసార్లు పొడిచి హత్య చేయడానికి ఫిల్ ప్రయత్నించినట్లు కోర్టు విచారణలో వెల్లడి అయింది. గర్ల్ ఫ్రెండ్ తల్లిని కూడా కత్తితో పొడిచిన ఫిల్ అప్పటి నేరానికి 7 సంవత్సరాల ఖైదు శిక్ష ఎదుర్కొన్నాడు. అయితే మూడేళ్లు జైలులో గడిపాక అతన్ని వదిలిపెట్టారు. అనంతరం నిరంతర ప్రేమ సంబంధాల ప్రయాణం సాగించిన మిక్ ఫిల్ పాట్, ఏకంగా పిల్లల కర్మాగారాన్నే నిర్మించాడు.

Victims -Photo: BBC

Victims -Photo: BBC

బ్రిటన్ పోర్టల్ ‘ఆరంజ్’ ప్రకారం, మిక్ ఫిల్ పాట్, తననుండి విడిపోయిన విల్స్ తో, వారి పిల్లల కస్టడీ గురించి కోర్టు యుద్ధం నడుపుతున్నాడు. ‘man slaughter’ గా కోర్టు నిర్ధారించిన దుర్ఘటన జరగడానికి మూడు నెలల ముందు విల్స్ మిక్ ఇంటి నుండి తన 5 గురు పిల్లలతో వెళ్లిపోయింది. అప్పటివరకూ, సుమారు 10 సంవత్సరాలు 11 మంది పిల్లలతో మిక్, మైరీడ్, విల్స్ లు ఒకే ఇంటిలో సంతోషంగానే గడిపారట. కేసు విచారణలో పాల్గొన్న జడ్జి జస్టిస్ మిసెస్ తిరల్ వాల్ వ్యాఖ్యలను బట్టి మిక్ ప్రతి సంబంధంలోనూ తన భార్యలతో లేదా గర్ల్ ఫ్రెండ్స్ తో హింసాత్మకంగానే వ్యవహరించాడు.

ఈ నేపధ్యంలో విల్స్ నుండి పిల్లలను తిరిగి తెచ్కుకునే ప్రయత్నంలో ఆమె పైన ఒక నేరం బనాయించడానికి మిక్, మోస్లీ, మైరీడ్ లతో కలిసి పధకం వేశాడు. గాసోలిన్ తో ఇంటికి నిప్పు పెట్టి ఆ నేరాన్ని విల్స్ పైకి నేట్టాలని వారి పధకం. అనుకున్న మేరకు మొదట నిప్పు పెట్టి, ఇల్లు పూర్తిగా అంటుకునే లోపు మిక్ నిచ్చెన సాయంతో మొదటి అంతస్ధులోని గదిలోకి కిటికీని బద్దలు కొట్టడం ద్వారా దూరి పిల్లలను రక్షించాలి. అయితే పెట్రోలు పోసాక చెలరేగిన మంటలు అలవికానంత భారీగా చెలరేగాయి. మిక్ నిచ్చెన అయితే ఎక్కాడు గానీ, కిటికీ అద్దాలు బద్దలు చేయలేకపోయాడు. ఫలితంగా ఆరుగురు పిల్లలు కాలిన గాయాలతో చనిపోయారు. ఐదుగురు పిల్లలు ఇంటివద్దనే చనిపోగా, ఒకరు ఆసుపత్రిలో కన్ను మూశాడు.

అనుకున్నట్లుగానే మిక్ బృందం పోలీసులకు విల్స్ పైనే ఫిర్యాదు చేసింది. ఆ మేరకు విల్స్ అరెస్టు అయింది. కానీ ముగ్గురు ధరించిన బట్టల నుండి వచ్చిన పెట్రోలు వాసన పోలీసులకు అనుమానం కలిగించింది. మిక్, మైరీడ్ లు ఉంటున్న హోటల్ గదిలో ఎలక్ట్రానిక్ పరికరాలు అమర్చి వారి సంభాషణ విన్నారు. దానితో నేరస్ధులు పట్టుపడ్డారు. మిక్, మోస్లీ ల నేరాలను జ్యూరీ ఏకగ్రీవంగా ఆమోదించగా, మైరీడ్ నేరాన్ని మెజారిటీతో ఆమోదించింది. శిక్ష ఏమిటో కోర్టు ప్రకటించవలసి ఉంది. సుదీర్ఘ కాలం పాటు జైలు శిక్ష పడవచ్చని పత్రికలు చెబుతున్నాయి.

ఫిల్ సాగించిన అసహజ, అనైతిక, అసాంఘిక జీవన వివరాలను బ్రిటిష్ పత్రికలు గత కొన్ని వారాలుగా కధలు కధలుగా ప్రచురించాయి. రోజుకో కధ ప్రచురిస్తూనే వాటి పట్ల అసహ్యం, ఆగ్రహం, తీవ్ర వ్యతిరేకత ప్రకటించాయి. కానీ అలాంటి అసహ్యాన్ని పత్రికల్లో ప్రచురించవలసిన అవసరం ఉన్నదా అన్న అనుమానమే వాటికి లేకపోవడం ఆశ్చర్యకరం.

ది హిందు పత్రిక ఈ రోజు (ఏప్రిల్ 3, 2013) నిందితుల నేరం రుజువైందని కోర్టు ప్రకటించిన సందర్భంగా ఈ వార్త ప్రచురించింది. అయితే ఆ పత్రిక మిక్ ఫిల్ పాట్ అనైతిక జీవనం గడిపాడని చెప్పిందే తప్ప వివరాలు ఇవ్వకుండా నిగ్రహం పాటించింది. అసహ్యాన్ని అక్షరాలుగా మార్చి పాఠకులలో అనవసరమైన ఆసక్తి రేకెత్తించడానికి ఆ పత్రిక ప్రయత్నించలేదు. పశ్చిమ దేశాలలో సెలబ్రటీల వ్యక్తిగత జీవితాలను బహిరంగం చేయడమే పనిగా వందల కొద్దీ పత్రికలు, పోర్టల్సూ పని చేస్తున్నాయి. వాటి ఆదాయం బిలియన్ల డాలర్లలో ఉన్నదని ఒక అంచనా. ప్రపంచ స్ధాయిలో మీడియా మొఘల్ గా ప్రసిద్ధి చెందిన రూపర్డ్ మర్దోక్ తన ‘సన్’ పత్రికను అలాగే పైకి తెచ్చిన ప్రముఖుడు(!)

రూపార్ట్ మర్డోక్ ఎంత ప్రముఖుడు అంటే వివిధ హత్యలలో, నేరాలలో బాధితులైన వారి సెల్ ఫోన్లను హ్యాక్ చేసి అందులోని విషయాలతో కధలు సృష్టించి సెన్సేషన్ సృష్టించిన ఘనత ఆయన సొంతం. ఆయనగారి హ్యాకింగ్ నేరాలకు శతధా సహకరించిన ‘న్యూస్ ఆఫ్ ది వరల్డ్’ ఎడిటర్లలో ఒకరైన కౌల్సన్ బ్రిటిష్ ప్రధాని కామెరాన్ కు స్పోక్స్ మేన్ గా పని చేయగా, పత్రిక సి.ఇ.ఓ రెబెక్కా బ్రూక్స్ ఆయనకు నమ్మకమైన స్నేహితురాలు. బ్రిటన్ పత్రికల అనైతిక కార్యకలాపాల వలన ఫోర్త్ ఎస్టేట్ పైన బ్రిటిష్ ప్రభుత్వం లార్డ్ లెవిసన్ కమిటీ వేయవలసి వచ్చింది. పత్రికాధిపతుల నేరస్ధ కార్యకలాపాలపై ఆయన నివేదిక చెత్తబుట్టలోకి వెళ్ళడం వేరే సంగతి.

ఇలాంటి పత్రికలు మిక్ ఫిల్ పాట్ అనైతికను అసహ్యించుకోవడం అంటే ఏమని అర్ధం? ఈ పత్రికలు పెంచి పోషించిన మురికినే ఫిల్ పాట్ స్వయంగా ధరించిన సంగతి ఈ పత్రికలకు తెలియదా? ఫిల్ గడిపిన అసహ్య, అనైతిక, అసాంఘిక జీవనం బ్రిటిష్ సంస్కృతిలో ఒక భాగం కావడానికి ఈ పత్రికలు యధాశక్తి సహకరించడం లేదా? వ్యక్తిగత ఇళ్లలోకీ, బెడ్ రూముల్లోకి, చివరికి హత్యకు గురయిన చిన్న పిల్లల సెల్ ఫోన్ల లోకి కూడా తొంగి చూసే ఈ పత్రికలు ఫిల్ మురికిని సెన్సేషనలైజ్ చేసి మరొకసారి లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నాయి తప్ప సమస్య లోతుల్లోకి వెళ్ళే ప్రయత్నం చేయడం లేదు. ఇదే వారి సంస్కృతి. ఇదే పాశ్చాత్య విష సంస్కృతి అంటే. దీనినే ఆధునికత పేరుతో, స్వేచ్ఛ పేరుతో భారత మెట్రో యువత సంభ్రమంతో సొంతం చేసుకుంటోంది. పెరిగిన టెక్నాలజీ పుణ్యమాని అది పల్లెల్లోకి కూడా పాకుతోంది.

3 thoughts on “ఇలాంటి దారుణాలు పశ్చిమ దేశాల్లోనే జరుగుతాయి…

  1. మనకి కూడా ఇటువంటి పత్రికా సమాజం ఉంది కదా. పాశ్చాత్య సంస్కృతిని మనకు అంటిస్తున్న ఇటువంటి పత్రికా సమాజం ఉన్నందుకు మనమంతా గర్వించాలి

  2. మనకి కూడా ఇటువంటి పత్రికా సమాజం ఉంది కదా. పాశ్చాత్య సంస్కృతిని మనకు అంటిస్తున్న ఇటువంటి పత్రికా సమాజం ఉన్నందుకు మనమంతా గర్వించాలి మీడియా వచ్చిన తర్వాతే ఇండియాలో జనజీవనం అస్తవ్యస్తమైనది . అంతకు ముందు ఎవడిపని వాడు చూసుకునేవాడు

  3. పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా అనుకరిస్తూ, భారతీయ సంస్కృతిని విడనాడి, వ్యక్తిగత ఆనందమే ప్రధానమనే మనుష్య రూప జంతువులు ఎక్కువయ్యేకొలదీ ఇలాంటివి మన దేశంలో కూడా జరగవచ్చు. ఇటువంటి భావాల్ని వ్యాప్తి చేసేవాళ్ళు ఇప్పటికయినా తమ పంధా మార్చుకుంటారని ఆశిద్దాం.

వ్యాఖ్యానించండి