గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ఇటీవల జరిగిన బి.జె.పి అత్యున్నత స్ధాయి సమావేశంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యునిగా నియమించబడ్డారు. ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ తన సొంత నాయకత్వ బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారని, అందులో నరేంద్ర మోడి ఒకరని పత్రికలు తెలిపాయి. ఆరు సంవత్సరాల క్రితం బి.జె.పికి రాజ్ నాధ్ సింగ్ అధ్యక్షుడుగా ఉన్నపుడే మోడిని పార్లమెంటరీ బోర్డు నుండి తొలగించారని, అదే వ్యక్తి నేతృత్వంలో మోడిని మళ్ళీ బి.జె.పి తన పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా నియమించుకున్నారని ‘ది హిందు’ తెలిపింది.
ఈ నియామకంతో బి.జె.పి తరపున ప్రధాని అభ్యర్ధిగా నరేంద్ర మోడి పేరు దాదాపు ఖాయమైనట్లేనని పత్రికలు నిర్ణయించినట్లు కనిపిస్తోంది. అయితే బి.జె.పిలో మోడి ఒక్కో ఆటంకం దాటే కొద్దీ ఎన్.డి.ఎ మిత్రుల్లో కూడా మోడి వ్యతిరేక స్వరం పెరుగుతోంది. ముఖ్యంగా ప్రధాన ఎన్.డి.ఎ పక్ష జనతా దళ్ (యునైటెడ్) పార్టీయే మోడి అభ్యర్ధిత్వాన్ని తాము అంగీకరించేది లేదని పరోక్షంగా సూచిస్తోంది. ప్రధాన మంత్రి అభ్యర్ధికి సెక్యులరిస్టు లక్షణాలు ఉండాలని, మోడి పార్లమెంటరీ బోర్డుకు ఎన్నికయిన రోజే జె.డి(యు) నాయకులు ప్రకటించడం ఇందుకు తార్కాణం. బీహార్ జె.డి(యు) ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అయితే బీహార్ లో మోడి ఎన్నికల ప్రచారానికే ఒప్పుకోలేదు. అభివృద్ధిలో తాము ముందంటే, తాము ముందని నితీశ్, మోడీలు సందర్భం వచ్చినప్పుడల్లా పోటీ పడడం తెలిసిన విషయమే. ఈ నేపధ్యంలో రాజకీయ పార్టీల పునరేకీకరణ తధ్యంలా కనిపిస్తోంది.
జె.డి(యు) వ్యతిరేకత ఎలా ఉన్నా బి.జె.పి పార్టీలోనే ప్రధాన మంత్రి అభ్యర్ధిత్వానికి పోటీ నెలకొని ఉంది. అదే సమయంలో మోడీకి మద్దతు పెరుగుతున్నట్లు వివిధ పద్ధతుల్లో పి.ఆర్ క్యాంపెయిన్ జోరుగా సాగుతోంది. బి.జె.పి కార్యకర్తల్లో మోడి అనుకూల ప్రచారం ఎంతగా ఉన్నదో ఈ కార్టూన్ చెబుతోంది. ప్రతి ఒక్కరూ మోడిలా కనిపించడానికి బి.జె.పి పార్లమెంటు బోర్డు సభ్యులు ప్రయత్నిస్తున్నారా? తద్వారా తామూ అభ్యర్ధులమే అని చెబుతున్నారా? లేక అందరూ మోడి అభ్యర్ధిత్వానికి మద్దతుగా ఉన్నారా?
