శ్రీలంక ఆటగాళ్లు ఐ.పి.ఎల్ ఆడొద్దు –రావణ ఫోర్స్


తమిళనాడులో శ్రీలంక బౌద్ధ సన్యాసిపై జరిగిన దాడిని నిరసిస్తూ భారత రాయబార కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న రావణ ఫోర్స్ కార్యకర్తలు -ది హిందు

తమిళనాడులో శ్రీలంక బౌద్ధ సన్యాసిపై జరిగిన దాడిని నిరసిస్తూ భారత రాయబార కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న రావణ ఫోర్స్ కార్యకర్తలు -ది హిందు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐదో అంచె టోర్నమెంటులో చెన్నైలో జరిగే మ్యాచుల్లో శ్రీలంక ఆటగాళ్లను ఆడనివ్వరాదని ఐ.పి.ఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం శ్రీలంకలో వాతావరణాన్ని వేడెక్కించింది. శ్రీలంక క్రికెట్ ఆటగాళ్లు ఐ.పి.ఎల్ లో ఆడకుండా తగిన చర్యలు తీసుకోవాలని వివిధ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఆటగాళ్లను ఆపే అధికారం తమకు లేదని శ్రీలంక క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.

శ్రీలంకకు చెందిన బుద్ధిస్టు జాతీయ గ్రూపులు ఐ.పి.ఎల్ లో శ్రీలంక క్రికెట్ ఆటగాళ్లు ఆడకుండా చూడాలని శ్రీలంక క్రికెట్ బోర్డుకు పిటిషన్ సమర్పించాయి. తమిళనాడులో ఆడనంతవరకూ శ్రీలంక ఆటగాళ్లు ఐ.పి.ఎల్ లో పాల్గొనవచ్చని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేయడంతో వివిధ గ్రూపులు తమ దేశ క్రికెట్ బోర్డు పై దృష్టి సారించాయి. ఆరు నూరైనా ఆటగాళ్లను ఇండియా వెళ్లనియ్యవద్దని అవి కోరుతున్నాయి. అయితే ఆటగాళ్లను వెళ్లకుండా ఆపే అధికారం తమకు లేదని బోర్డు స్పష్టం చేసింది. “అక్కడికి వెళ్లవద్దని మేము ఆటగాళ్లను బలవంతపెట్టలేము” అని శ్రీలంక క్రికెట్ కార్యదర్శి నిషాంత రణతుంగ శనివారం ప్రకటించాడు.

ఆటగాళ్లు ఇండియా వెళితే తాము తీవ్ర చర్యలకు పాల్పడతామని రావణ ఫోర్స్ ప్రకటించింది. శ్రీలంక ఆటగాళ్లు ఐ.పి.ఎల్ ను బాయ్ కాట్ చేయాలని పిలుపిచ్చిన గ్రూపుల్లో రావణ ఫోర్స్ ఒకటి. “మేము ఇది జరగనివ్వం. వాళ్ళు వెళ్లినట్లయితే మేము అత్యంత తీవ్ర చర్య తీసుకుంటాము” అని బుద్ధిస్టు గురువు వెన్ ఇత్తకండే సద్ధాతిస్సా అన్నాడని ది హిందూ తెలియజేసింది.

రావణ ఫోర్స్ తో పాటు నేషనల్ భిక్కు ఫెడరేషన్ కూడా శ్రీలంక ఆటగాళ్లు ఐ.పి.ఎల్ బహిష్కరించాలని కోరుతోంది. శ్రీలంక ఆటగాళ్లను తమిళనాడులో ఆడకుండా చూడాలని ముఖ్యమంత్రి జయలలిత ప్రధానికి లేఖ రాసిన దగ్గర్నుండి ఈ సంస్థలు తమ డిమాండ్ ను ముందుకు తెచ్చాయి. చెన్నై జట్టు నుండి నువాన్ కులశేఖర, అకిల దనంజయ లను తొలగించారని వార్తలు వచ్చినప్పటినుండి స్థానిక ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని పత్రిక తెలిపింది. తమిళనాడులో శ్రీలంక వ్యతిరేక శక్తులను మెప్పించడానికి ఈ ఇద్దరు ఆటగాళ్లను తొలగించారని వారు అభిప్రాయపడుతున్నారు.

అర్జున రణతుంగ

అర్జున రణతుంగ

శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ కూడా కులశేఖర, దనంజయ లను తొలగించడం పట్ల నిరసన తెలిపాడు. చెన్నై జట్టు నుండి శ్రీలంక ప్లేయర్లను తొలగించడం తీవ్రమైన చర్య అని, ఈ విషయమై శ్రీలంక తీవ్రంగా ఆలోచించాలని ఆయన వ్యాఖ్యానించాడు. విచిత్రం ఏమిటంటే అర్జున రణతుంగ ప్రకారం శ్రీలంక ఆటగాళ్లు ఐ.పి.ఎల్ లో అడితే అది “శ్రీలంక ప్రభుత్వం యుద్ధ నేరాలకు, మానవ హక్కుల హరణకు పాల్పడిందని వచ్చిన ఆరోపణలను అంగీకరించినట్లే” అట.

“చాలా మంది విస్మరిస్తున్న విషయం ఏమిటంటే, శ్రీలంక మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని జయలలిత, కరుణానిధి భావిస్తున్నందునే వాళ్ళు శ్రీలంక ఆటగాళ్లను తమిళనాడులో ఆడనియ్యొద్దని కోరుతున్నారు. కనుక తమిళనాడు వదిలి ఇతర రాష్ట్రాల్లో ఆడినట్లయితే మన దేశానికి వ్యతిరేకంగా వస్తున్న మానవ హక్కుల ఆరోపణలను ఆమోదించడమే అవుతుంది. ఆటగాళ్లు ఈ సంగతి గ్రహించాలి. శ్రీలంక ఐ.పి.ఎల్ ఆటగాళ్లు ఈ ఆరోపణలను ఆమోదించారని రేపు ప్రపంచం అంటుంది” అని రణతుంగ అన్నాడని ది హిందు మూడు రోజుల క్రితం తెలిపింది.

ఈ లెక్కన రణతుంగ తమిళులపై శ్రీలంక సైనికులు సాగించిన మారణహోమాన్ని ఆమోదిస్తున్నాడన్నమాట! ఆయన దృష్టిలో లక్షలాది మంది తమిళులు దుర్భర పరిస్ధితుల మధ్య ఇప్పటికీ శరణార్థి శిబిరాల్లో తలదాచుకోవలసి రావడం మానవ హక్కుల ఉల్లంఘన కాదు. తమిళ ప్రజలతో కూడా కలిసి అధికారాన్ని పంచుకోవాలని వివిధ ఐక్యరాజ్యసమితి సంస్థలు చేస్తున్న డిమాండుకు రణతుంగ దృష్టిలో అర్ధం లేదు. ఎల్.టి.టి.ఇ తో యుద్ధం పేరుతో తమిళ ప్రజలను వారి స్వస్థలాలనుండి తరిమేయడం, శరణార్థి శిబిరాలపైకి కాల్పులు జరిపి వేలాది మంది ప్రజలను సామూహికంగా చంపడం ఆయన దృష్టిలో యుద్ధ నేరాలు కాదు. శ్రీలంక ఆటగాళ్లు ఐ.పి.ఎల్ ఆడితే ఇవన్నీ నిజమే అనుకుంటారని ఆయన భయపడుతున్నాడు.

రణతుంగ లాంటి పెద్ద మనుషులు ఉంటే రాజపక్ష లాంటి జాత్యహంకార ప్రభువులు కలకాలం వర్ధిల్లుతారు. శ్రీలంక తమిళుల సమస్య ఆధారంగా తమిళనాడులో కొనసాగుతున్న ఎన్నికల రాజకీయాలు ఇలాంటివారికి అవకాశాలు ఇస్తుండడం కూడా ఒక వాస్తవం.

One thought on “శ్రీలంక ఆటగాళ్లు ఐ.పి.ఎల్ ఆడొద్దు –రావణ ఫోర్స్

వ్యాఖ్యానించండి