విమర్శల రాయి విసురు, నిధుల పండ్లు రాలు -కార్టూన్


ది హిందు

ది హిందు

రాజకీయాలు పెద్దోళ్లు-పెద్దోళ్లు ఆడుకోవడానికే గానీ జనాల అవసరాలు తీర్చడానికా? ఎన్నికల మేనిఫెస్టోలు, నాయకుల ప్రసంగాలు, పార్టీల రాజ్యాంగాలు ఇవన్నీ జనం పేరు చెప్పకుండా ఒక్క వాక్యాన్నీ ముగించలేవు. అదే చేతల్లోకి వస్తే జేబులోకి (ఆదేలెండి, ఖాతాలోకి) కాసు రాలకుండా ఒక్క అడుగూ ముందుకు పడదు. ములాయం సింగ్ యాదవ్ ఇటీవల సాగించిన బురద రాజకీయం ఆ సంగతే చెబుతోంది.

రెండు రోజుల పాటు ములాయం సింగ్ కాంగ్రెస్ పైన నోటితో నిప్పులు విరజిమ్మాడు. త్వరలోనే ఎన్నికలు వస్తాయన్నాడు. తద్వారా మద్దతు ఉపసంహరణకు సంకేతాలిచ్చాడు. కాంగ్రెస్ పని మిత్రులని మోసం చెయ్యడమే అన్నాడు. మూడో ఫ్రంటు ఖాయం అన్నాడు. అద్వానీకి మించిన నాయకుడు లేడన్నాడు. ఈ లోపు ఆర్ధిక మంత్రి చిదంబరం ఉత్తర ప్రదేశ్ లో తేలాడు. 300 కొత్త బ్యాంకు బ్రాంచులు

ఫొటో: ది హిందు

ఫొటో: ది హిందు

ప్రారంభించడానికి లక్నో వెళ్ళిన ఆర్ధిక మంత్రి “ఉత్తర ప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది” అని ప్రకటించాడు. యు.పి ఆర్ధిక అవసరాల సంగతి తాను చూసుకుంటానని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కి హామీ ఇచ్చాడు. పనిలో పనిగా ఢిల్లీ రమ్మని ములాయం కుమారుడిని నూరారా ఆహ్వానించాడు.

అంతే! బ్యాంకు ప్రారంభోత్సవం ముగించుకుని చిదంబరం అలా యు.పి గడప దాటాడో లేదో, ములాయం గొంతు మారింది. కాంగ్రెస్ కి మద్దతు ఉపసంహరించుకునే ఉద్దేశమే తనకు లేదన్నాడు. మతతత్వ శక్తులను అధికారం నుండి దూరం ఉంచడానికే తాను యుపిఎ కి మద్దతు ఇస్తున్నా అన్నాడు. అసలు అద్వానీకి మద్దతు ఇచ్చేది లేదు పొమ్మన్నాడు. కాంగ్రెస్ ను నమ్మలేం అంటూనే కేంద్ర ప్రభుత్వం గడువు పూర్తి చేసుకుంటుంది అని భరోసా ఇచ్చాడు.

కాసుల కక్కుర్తి వంటబట్టాలే గానీ, నాలుక ఎన్ని మడతలైన పడుతుంది. తృణమూల్, డిఎంకె పార్టీల మద్దతు ఉపసంహరణతో యు.పి.ఎ-2 ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. కాంగ్రెస్ చెట్టుకి కాసిన పండ్లు మగ్గాయనీ, విమర్శల రాయుచ్చుకు కొడితే నిదుల పండ్లు జల జలా రాలతాయని ములాయం గ్రహించాడు. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టి పనిలో పనిగా ప్రధాని రేసులో తానూ ఉన్నానని చాటుకున్నాడు. నాలుగు రాళ్లు విసిరి స్వకార్యము, పుత్ర కార్యమూ (ఇదీ స్వకార్యమే అనుకోండి!) నేరవేర్చుకున్నాడు.

ప్రజల ప్రయోజనాలకి ఏమాత్రము సంబంధం లేని ఈ దిగజారుడు రాజకీయాలే ఇప్పుడు దేశంలో శెభాష్ అనిపించుకుంటున్నాయి.

వ్యాఖ్యానించండి