శ్రీలంకతో ఎన్నికల యుద్ధం ప్రాక్టీస్ -కార్టూన్


From: The Hindu

From: The Hindu

శ్రీలంక తమిళుల దుర్భర పరిస్ధితులపై తమిళనాడులో అక్కడి రాజకీయ పార్టీలు భావోద్వేగాలు రెచ్చగొట్టి పెట్టాయి. శ్రీలంక ప్రభుత్వం సాగించిన యుద్ధ నేరాలపై అమెరికా ఐరాస మానవ హక్కుల తీర్మానం ప్రతిపాదించడం పార్టీలకు వాటంగా కలిసి వచ్చింది. యుపిఎ ప్రభుత్వానికి డిఎంకె మద్దతు ఉపసంహరించుకోవడంతో పార్టీల నాటకం రక్తి కట్టింది. ఐ.పి.ఎల్ ఆటలకు శ్రీలంక ఆటగాళ్లను అనుమతించేది లేదని తమిళనాడు ముఖ్యమంత్రి హుంకరించడంతో రక్తి కట్టిన నాటకం కాస్తా రసాభాసగా మారిపోయింది.

ప్రత్యేక తమిళ ఈలం కోసం సాయుధంగా తలపడిన ఎల్.టి.టి.ఇ సైనికంగా ఇంత తీవ్రమైన ఓటమి ఎదుర్కొంటుందని తమిళనాడు ప్రజలు బహుశా ఊహించి ఉండరు. మూడు దశాబ్దాలుగా శ్రీలంక పాలకులను ముప్పుతిప్పలు పెట్టి కొరకరాని కొయ్యగా మారిన ప్రభాకరన్ ఓడిపోయి హతం అవుతాడంటే చాలామంది నమ్మలేదు. ఎల్.టి.టి.ఇ ని ఓడించడం అసాధ్యం అని కొందరు ఎంతగా నమ్మారంటే ప్రభాకరన్ ఇప్పటికీ బతికే ఉన్నాడని కొందరు నమ్ముతున్నారు. ఈ పరిస్ధితుల్లో తమిళుల్లో పేరుకుపోయిన ఆగ్రహం, అపనమ్మకం, దిగ్భ్రాంతి వెలికి రావడానికి అమెరికా తీర్మానం అందివచ్చిన సందర్భం అయింది. ఈ ప్రజాగ్రహాన్ని శ్రీలంక ప్రభుత్వంపై నిర్దిష్టంగా ఒత్తిడి తేవడానికి వినియోగించడానికి బదులు తమిళనాడు రాజకీయ పార్టీలు రానున్న పార్లమెంటు ఎన్నికల ఎత్తుగడలకు బలిపెడుతున్నాయి.

ఫలితంగా శ్రీలంక తమిళుల పరిస్ధితి మరింత దుర్భరంగా మారింది. భారత దేశంలో తమిళనాడు పార్టీలు చేసే రచ్చ తమకు ఉపయోగపడకపోగా మరింత అణచివేతకు, పరాయీకరణకు దారి తీస్తోందని శ్రీలంక తమిళులు వివిధ వేదికలపై అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నారు. తమ స్వార్ధ ప్రయోజనాలకు తప్ప తమిళనాడు పార్టీలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎన్నడూ చిత్తశుద్ధితో పరిష్కారం చేసింది లేదని వారి నిశ్చితాభిప్రాయం. లేకపోతే ఇటీవల వరకూ అంటీ ముట్టనట్లు ఉన్న జయలలిత అకస్మాత్తుగా తమిళుల ప్రయోజనాలకు ఛాంపియన్ కావడానికి ఎందుకు ప్రయత్నిస్తుందనేది వారి ప్రశ్న.

ముందస్తు పార్లమెంటు ఎన్నికలు రానున్నాయని ఊహాగానాలు ఊపందుకోవడంతో తమిళనాడు పార్టీలు కూడా తదనుగుణంగా ఎత్తులు, పై ఎత్తులతో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. శ్రీలంక తమిళుల సమస్యను తమ ఎన్నికల ముష్టి యుద్ధానికి ముందస్తు ప్రాక్టీసు గా వినియోగిస్తున్నాయి.

One thought on “శ్రీలంకతో ఎన్నికల యుద్ధం ప్రాక్టీస్ -కార్టూన్

  1. అవును శేఖర్ గారూ.

    దొంగలు పడ్డ ఆర్నెళ్లకు కుక్కలు మొరిగినట్లు, లంక తమిళులపై దాడులు జరిగి సంవత్సరాలు గడిచినా..ఇంత కాలం పెద్దగా స్పందించని తమిళ రాజకీయ పార్టీలు ఇప్పుడు ఇంతగా హంగామా చేయడం వెనుక ఎన్నికలు తప్ప ఇంకో కారణం లేదు.

    చాలా మంది గమనించాల్సిన విషయం ఏమిటంటే శ్రీలంకలోని తమిళులే కాదు. తమిళనాడు లోని అసలు తమిళులు కూడా ఈ విషయంలో ఇంతగా ఆలోచించడం లేదట.

    అసలు కంటే కొసరు ఎక్కువ అన్నట్లుగా….తమిళులు కాని వాళ్లే ఈ విషయంలో ఎక్కువగా హంగామా చే్స్తున్నారు. ఇవాళ తమిళుల హక్కులు అంటూ నానా యాగీ చేస్తున్న వాళ్లు నేటివ్ తమిళనాడు కాని వాళ్లే.

    కరుణానిధి ( పూర్వీకులు మన రాష్టంలోని కృష్ణా జిల్లా నుంచి వలస వెళ్లారు.), జయలలిత ( మైసూరు )
    వైగో ( చిత్తూరు), రజనీ ( మరాఠీ ), విజయకాంత్ ( తెలుగు )..ఇలా చాలా మందే ఉన్నారట.

    లంక అకృత్యాలను ఎవరైనా ఖండించాల్సిందే. కానీ ఆ సంగతి కేవలం ఎన్నికలకు ముందు గుర్తు రావడం అంటే,
    అసలు ప్రేమ తమిళుల సమస్యపైనా….రాబోయే ఎన్నికల పైనా…?

వ్యాఖ్యానించండి