డాలర్ నిల్వలకు ఎసరు తెస్తున్న ధనికుల బంగారం దాహం


FII

భారత దేశ ధనికులు బంగారం పైన పెంచుకుంటున్న వ్యామోహం మన విదేశీ మారక ద్రవ్య నిల్వలకు ఎసరు తెస్తోంది. దేశంలోకి వస్తున్న విదేశీ మారక ద్రవ్యం కంటే బంగారం, చమురుల కొనుగోళ్ల కోసం దేశం బైటికి వెళుతున్న విదేశీ మారక ద్రవ్యమే ఎక్కువ కావడంతో నిల్వలు తరిగిపోతున్నాయి. ఫలితంగా భారత ఆర్ధిక వ్యవస్థకు కరెంటు ఖాతా లోటు (Current Account DeficitCAD) రికార్డు స్థాయికి చేరుకుంది. ఒక దేశ ఆర్ధిక వ్యవస్థ మౌలిక ప్రమాణాలలో (ఫండమెంటల్స్) సి.ఎ.డి కూడా ఒకటి. దానితో పరిస్ధితిపై భారత ప్రభుత్వం, ఆర్.బి.ఐ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

అక్టోబర్-డిసెంబర్ (2012) క్వార్టర్ సంవత్సరంలో కరెంటు ఖాతా లోటు రికార్డు స్ధాయిలో జి.డి.పిలో 6.7 శాతానికి చేరుకుందని ఆర్.బి.ఐ గురువారం తెలియజేసింది. వాణిజ్య లోటు (దిగుమతులు మైనస్ ఎగుమతులు) తీవ్రంగా పెరగడంతో అది నేరుగా కరెంటు ఖాతా లోటుపై ప్రభావం చూపిందని ఆర్.బి.ఐ తెలిపింది. కరెంటు ఖాతా లోటు అంటే స్ధూలంగా దేశం లోపలికి వచ్చే విదేశీ మారక ద్రవ్యం కంటే బైటికి వెళ్ళే విదేశీ మారక ద్రవ్యం ఎక్కువగా ఉండడం. దీనిని జి.డి.పి లో నిష్పత్తిగా (శాతంలో) చూస్తారు. కరెంటు ఖాతా లోటు పెరిగే కొద్దీ ఆ దేశం యొక్క చెల్లింపు సామర్ధ్యం పడిపోతోందని అర్ధం. ఇది క్రమంగా చెల్లింపుల సమతూకంలో సంక్షోభానికి (Balance of Payment crisis –BoP crisis) కి దారి తీస్తుంది. 1990ల ప్రారంభంలో ఈ సంక్షోభాన్ని చూపే నూతన ఆర్ధిక విధానాలను ఉధృతంగా గేట్లు తెరిచారు.

రెండో క్వార్టర్ (జులై-సెప్టెంబర్ 2012) లో జి.డి.పిలో 5.4 శాతంగా ఉన్న సి.ఎ.డి అది మూడో క్వార్టర్ ముగిసే నాటికి ఉన్నపళంగా 6.7 శాతానికి పెరిగిందని ఆర్.బి.ఐ తన బి.ఒ.పి నివేదికలో తెలిపింది. వాణిజ్య సరుకుల ఎగుమతులలో మూడో క్వార్టర్ లో పెద్దగా పెరుగుదల లేకపోవడం, చమురు, బంగారం దిగుమతులు ఒక్కుమ్మడిగా 9.4 శాతం పెరిగిపోవడం సి.ఎ.డి పెరుగుదలకు కారణాలని ఆర్.బి.ఐ నివేదిక తెలిపింది. దీనితో వాణిజ్య లోటు గత సంవత్సరం మూడో క్వార్టర్ ముగిసే నాటికి వాణిజ్య లోటు 48.6 బిలియన్ డాలర్లు ఉంటే, ఈ సంవత్సరం మూడో క్వార్టర్ ముగిసే నాటికి అది 59.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

బడ్జెట్ ప్రసంగం సందర్భంగా “నా ప్రధాన ఆందోళన కరెంటు ఖాతా లోటు గురించే” అని ఆర్ధిక మంత్రి చిదంబరం చెప్పడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడడం, బొగ్గు పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకోవడం, బంగారం పట్ల వ్యామోహం పెంచుకోవడం, ఎగుమతులు పడిపోవడం… ఇవన్నీ సి.ఎ.డి పెరుగుదలకు దోహదం చేస్తున్నాయని చిదంబరం తెలిపాడు. వీటిలో చమురు ఎలాగూ దిగుమతి చేసుకోవలసిందే. అమెరికా, యూరప్ లు ఆర్ధిక మాంద్యంలో ఉన్నందున ఎగుమతుల పెంపుదల మన చేతుల్లో లేని పని. ఇక మిగిలింది బొగ్గు, బంగారం. పాలకులకు ముందు చూపు కొరవడడం, బొగ్గు గనుల తవ్వకాల వలన నిరాశ్రయులయ్యే ప్రజలకు నమ్మకమైన పునరావాస పధకం అందజేసేందుకు సిద్ధంగా లేకపోవడం, ప్రైవేటు కంపెనీల అవినీతి … ఈ కారణాలతో బొగ్గు దిగుమతుల భారం తప్పడం లేదని వివిధ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

దేశం నుండి పోయిన నల్లడబ్బె తిరిగొస్తే ఎఫ్.ఐ.ఐ?

దేశం నుండి పోయిన నల్లడబ్బె తిరిగొస్తే ఎఫ్.ఐ.ఐ?

కాగా బంగారం దిగుమతిని నిరోధించాలంటే ప్రభుత్వ పెద్దలకు ధనికులపై ఉన్న ప్రేమాభిమానాలను పక్కన పెట్టాల్సి ఉంటుంది. ద్రవ్య సాధనాలకు పట్ల పెరుగుతున్న భయాలు మరియు బంగారం ధరలు పెరుగుతూ పోవడంతో ధనికులు బంగారంలో పెట్టుబడులు పెట్టడం పెరుగుతోంది. ఇది అంతిమంగా మన విదేశీ మారక ద్రవ్యాన్ని పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడానికి దారి తీస్తోంది. ఫలితంగా విదేశీ మారక ద్రవ్య నిల్వలు తరిగిపోయి కరెంటు ఖాతా లోటు పెరుగుతోంది. ఈ లక్షణం ఆర్ధిక వ్యవస్థకు స్థూల దృష్ట్యా మంచిది కాదు.

ఆశ్చర్యం ఏమిటంటే విదేశీ సంస్థాగత పెట్టుబడులు (FII – Foreign Institutional Investments) దేశంలోకి ఇబ్బడిముబ్బడిగా వస్తే కరెంటు ఖాతా లోటును తగ్గించుకోవచ్చని ఆర్.బి.ఐ నివేదిక పేర్కొంది. సి.ఎ.డి పెరిగినా ఎఫ్.ఐ.ఐల ద్వారా పూడ్చుకున్నాం గానీ విదేశీమారక ద్రవ్య నిల్వల జోలికి వెళ్లలేదని ఆర్ధికమంత్రి చిదంబరం కూడా చెబుతున్నారు. కానీ ఇది తాత్కాలికమే తప్ప శాశ్వత చర్య కాబోదు. కరెంటు ఖాతా లోటు గురించి స్వల్పకాలిక దృష్టితో ఆలోచిస్తూ పైపూత మందులు పూయడం, ఆ పూత పనితనం ముగిసాక మళ్ళీ ఆందోళన చెందుతూ మరొక మారు ఎఫ్.ఐ.ఐ ల కోసం చర్యలు తీసుకోవడం… ఈ పద్ధతి పాలకుల దూర దృష్టి లోపాన్ని స్పష్టంగా ఎత్తి చూపుతోంది.

ఆర్.బి.ఐ ఈ మేరకు లోపాలను గతంలో కూడా అనేక మార్లు ఎత్తి చూపుతూ ఈ పరిస్ధితి మారాలని ఆకాంక్షించింది కూడా. మళ్ళీ అదే పరిష్కారం (ఎఫ్.ఐ.ఐ) వైపుకు ఆర్.బి.ఐ, ప్రభుత్వం చూడడం, పాఠాలు నేర్చుకోవడం మాని ఎప్పటికప్పుడు ఉరుకులు పరుగులు పెడుతూ విదేశీ పెట్టుబడుల ముందు మరింతగా మోకరిల్లడం పాలకులకు రివాజుగా మారడం గర్హనీయం. సి.ఎ.డి ని 3.8 శాతానికి తగ్గిస్తామని గత ఏడాది చిదంబరం వగ్దానం ఇచ్చిన సంగతి మర్చిపోయి విదేశీ మారక ద్రవ్య నిల్వలకు భంగం కలగకుండా సి.ఎ.డిని ఎఫ్.ఐ.ఐలతో సర్దుబాటు చేసుకోవడం తృప్తి కలిగించే విషయమని ప్రకటించడం విడ్డూరం. కాగా ఇండియా నుండి అక్రమంగా తరలించుకునిపోయిన నల్లడబ్బే తిరిగి ఎఫ్.ఐ.ఐల రూపంలో వస్తున్నదే గణనీయమొత్తంలో ఉన్నదని ఆయా విశ్లేషకులు నిగ్గు దేల్చడం మర్చిపోరాదు.

వ్యాఖ్యానించండి