బిజెపి అగ్రనాయకుడు గత సంవత్సరం ఒక అనూహ్యమైన వ్యాఖ్య చేశారు. దేశంలో ప్రధాన పార్టీలయిన కాంగ్రెస్, బిజెపి నాయకులు కాకుండా ఇతర పార్టీల నాయకులే ఈసారి ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని. ప్రధాన మంత్రి పదవి కోసం కలలు కంటున్నారని భావిస్తున్న అద్వానీ, ఉన్నట్టుండి ఇలా అన్నారేవిటా అని పరిశీలకులు ఆశ్చర్యం వెలిబుచ్చారు. బహుశా బిజెపి లోనే ప్రధాని పదవికి పోటీగా వస్తున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ఝలక్ ఇవ్వడానికి అద్వానీ ఒక అస్త్రాన్ని ప్రయోగించారేమో అని అనేకమంది ఊహాగానాలు చేశారు. ములాయం యాదవ్ సింగ్ ఇటీవలి పోకడలు చూస్తే అప్పటి అద్వానీ వ్యాఖ్యలకు అసలు అర్ధం ఇప్పుడు బైటికి వస్తున్నట్లుంది.
మూడు రోజుల క్రితం ములాయం తన కుమారుడు అఖిలేష్ యాదవ్ ని తీవ్రంగా హెచ్చరించాడు. ‘ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం’ అనే తమ ఇల్లును జాగ్రత్తగా ఉంచాలని ఆ హెచ్చరిక సారాంశం. హెచ్చరికకు దారి తీసిన అంశం అద్వానీ చేసిన విమర్శలు. ఉత్తర ప్రదేశ్ లో శాంతి భద్రతల సమస్య ఘోరంగా ఉన్నదని, అవినీతి పెచ్చు మీరిందని అద్వానీ ఘాటు విమర్శలు చేయడంతో ప్రతి విమర్శలు చేయడానికి మదులు ములాయం అద్వానిని పొగడ్తలతో ముంచెత్తారు. “అద్వానీ లాంటి సీనియర్ నాయకులు అలా అన్నారంటే విషయం ఏమిటో నేను చూడవలసిందే. ఆయన ఎప్పుడూ అబద్ధాలు చెప్పరు. ఎప్పుడూ నిజాలే చెబుతారాయన. నేను అనేకసార్లు చెప్పినట్లుగా… ఒకసారి వెళ్ళి ఆయనని తప్పనిసరిగా కలుస్తాను” అని ములాయం వ్యాఖ్యానించాడు.
అనగా… అఖిలేష్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వం పునాదిగా ‘ప్రధానమంత్రి పదవి’ అనే ఆకాశానికి ‘బిజెపి నేతృత్వం లోని ఎన్.డి.ఎ కూటమి’ అనే నిచ్చెన వేయాలని ములాయం సింగ్ యాదవ్ పధక రచన చేస్తున్నారన్నమాట. ములాయం సింగ్ కీ ఆ విధమైన ఆశలు పెంచే ఉద్దేశ్యంతోనే అద్వానీ నెలల క్రితమే తగిన పాచిక విసిరారన్నమాట! ఆ పరిస్ధితుల్లో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అక్కడి బిజెపి నాయకులకి, వారి పోషకులకి అనుగుణంగా వ్యవహరించాలన్నమాటే. అఖిలేష్ అలా వ్యవహరించడం లేదని అద్వానీ తన ‘అవినీతి, శాంతి భద్రతల’ విమర్శల ద్వారా సూచించారన్నమాట! అద్వానీ సూచనను వెంటనే అందుకున్న ములాయం తదనుగుణంగా కుమారుడికి తగిన ఆదేశాలు ‘హెచ్చరికలు, అద్వానీకి పొగడ్తలు’ రూపంలో ఇచ్చారన్నమాట!
ఔరా ఇవి కదా ప్రజల్ని గాలికి వదిలేసే పదవీ రాజకీయాలు!
ఏమో! గుర్రం ఎగరావచ్చు.
కాంగ్రెస్, బిజెపిల పరిస్థితి చూస్తుంటే అధికారం వాళ్ళకి దూరంగానే ఉండేటట్టుంది.
సెక్యులర్ ముద్ర ఉన్న ములాయం, కాంగ్రెస్ బయటి మద్దతుతో ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది.
అయితే అది మూణ్ణాళ్ళ ముచ్చటే అవుతుంది.
ఓ ఏడాది తరువాత మళ్ళీ ఎన్నికలు వస్తాయి.
బోనగిరి గారూ, మీ వ్యాఖ్యతో ఒక్కసారిగా చంద్రశేఖర్, గుజ్రాల్ రోజులు గుర్తుకు తెచ్చారు.
కాబోయే ప్రధాని ఎవరని మనమెందుకు బుర్రలు బద్దలుకొట్టుకోవడం. రామోజీని అడిగితే …. చెపుతాడు కదా. కనీసం ఈనాడు పేపరు రెగ్యులర్‌గా చదివినా చదివినా కాబోయే ప్రధాని ఎవడో ఇట్టే తెలిసిపోతుంది
kachitanga next pradani MODI