జయ హుకుం, ఐ.పి.ఎల్ జో హుకుం


Jayaతమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత భారత ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు సంధించిన లేఖాస్త్రం, ఐ.పి.ఎల్ పాలిట బ్రహ్మాస్త్రమే అయింది. తమిళనాడులో అమృత యూనివర్సిటీ లాంటి ప్రధాన విద్యా సంస్థలు సైతం యూనివర్సిటీని మూసేసి విద్యార్ధులకు సెలవులిచ్చి ఇళ్లకు పంపేందుకు దారి తీసిన ఆందోళనలు ఇపుడు శ్రీలంక ఐ.పి.ఎల్ ఆటగాళ్ళకు ఆటవిడుపును సమకూర్చాయి. జయలలిత హుకుం జారీ చేయగా, ఐ.పి.ఎల్ గవర్నింగ్ బాడీ జో హుకుం కొట్టి సలాము చేసింది.

చెన్నైలో జరిగే ఐ.పి.ఎల్ మ్యాచ్ లకు శ్రీలంక ఆటగాళ్లను అనుమతించేది లేదని పురచ్చి తలైవి ప్రధానికి రాసిన లేఖలో స్పష్టం చేయడంతో ఐ.పి.ఎల్ గవర్నింగ్ బాడీ సమావేశమై చెన్నైలో జరిగే మ్యాచులన్నింటిలో శ్రీలంక ఆటగాళ్లు ఆడకుండా నిర్ణయం తీసుకున్నారు. కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగిస్తూ భారత ప్రభుత్వం డెబ్భైయ్యవ దశకంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసి సంచలనం సృష్టించి పనిలో పనిగా డిఎంకె అధినేత కరుణానిధికి షాక్ ఇచ్చిన జయ, ఐ.పి.ఎల్ ఎపిసోడ్ దరిమిలా విజయ దరహాసాన్ని మోమున ధరించి చిద్విలాసురాలయింది.

మంగళవారం ప్రధానికి రాసిన లేఖ ద్వారా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఐ.పి.ఎల్ ఆటల జ్వరానికి శ్రీలంక తమిళ సెంటిమెంటు దుప్పటి కప్పింది. శ్రీలంక తమిళులపై సింహళుల జాత్యహంకార ఆధిపత్యం అనే అంశం చుట్టూ అల్లుకున్న సెంటిమెంట్లను, ప్రజల భావోద్వేగాలను సొమ్ము చేసుకోడానికి తమిళనాడులో రాజకీయ పార్టీల మధ్య పోటాపోటీగా సమరం నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి ఏకంగా మద్దతు ఉపసంహరించి తమిళనాడు రాష్ట్ర ప్రజల ముందు ఛాంపియన్ గా నిలిచినట్లు భావిస్తున్న డిఎంకె, ఊహించని విధంగా జయలలిత కొట్టిన దెబ్బ ప్రభావాన్ని అంచనా వేసే పనిలో పడిపోయింది.

Srilanka players of MI“శ్రీలంకకు చెందిన ఆటగాళ్లు గానీ, అంపైర్లు, అధికారులు, సహాయ సిబ్బంది తదితరులు ఎవ్వరైనా గానీ చెన్నైలో జరిగే ఐ.పి.ఎల్ మ్యాచుల్లో పాల్గొనబోరని ఐ.పి.ఎల్ నిర్వాహకులు ఖచ్చితమైన హామీ ఇస్తే తప్ప చెన్నైలో ఐ.పి.ఎల్ మ్యాచులను రాష్ట్ర ప్రభుత్వం అనుమతించేది లేదని జయలలిత ప్రధానికి లేఖ రాశారు. ఈ మేరకు ప్రధానమంత్రి మన్మోహన్ ఐ.పి.ఎల్ నిర్వాహకులకు సలహా ఇవ్వాలని ముఖ్యమంత్రి తన లేఖలో కోరారు.

శ్రీలంక తమిళ ప్రజల పైన అత్యాచారాలు కొనసాగుతున్నాయనడానికి ఇటీవల కాలంలో మరిన్ని విశ్వసనీయమైన సాక్ష్యాలు వెల్లడి కావడంతో తమిళనాడు ప్రజల్లో ఆందోళన తీవ్రం అయిందని, ఫలితంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున సామూహిక ఆందోళనలు, నిరాహార దీక్షలు, ఆత్మ దహనాలు పెరిగిపోయాయని, వీటన్నింటిలోనూ సకల తరగతుల ప్రజలు పాల్గొంటున్నందున విషయాన్ని తీవ్రంగా, అత్యవసరంగా పరిగణించాలని ముఖ్యమంత్రి కోరారు. దానితో ఐ.పి.ఎల్ గొర్రె కాస్తా సగం చచ్చి కూచుంది.

రాజకీయ పార్టీల నుండి వస్తున్న తీవ్రమైన ఒత్తిడికి ఐ.పి.ఎల్ నిర్వాహకులు తల ఒగ్గారు. ఏప్రిల్ 3 తో మొదలయ్యే క్రికెట్ టోర్నమెంటుకు సంబంధించి చెన్నైలో జరగబోయే ఐ.పి.ఎల్ మ్యాచుల్లో శ్రీలంకకు చెందిన ఎవరి ఉనికిని లేకుండా చేయడానికి ఐ.పి.ఎల్ గవర్నింగ్ బాడీ నిర్ణయించింది. ఈ మేరకు కమిటీ ఛైర్మన్ రాజీవ్ శుక్లా మంగళవారం ప్రకటన జారీ చేశాడు. శ్రీలంక ఆటగాళ్లు, అంపైర్లు, ఇతర సిబ్బంది… వీరందరి భద్రత తమకు ముఖ్యమని, అంతే కాకుండా తమిళనాడు ప్రజల భావోద్వేగాలకు కూడా తాము విలువ ఇస్తున్నామని, కనుక వారెవరూ చెన్నైకి రారని తెలిపారాయన.

ఇరువరన్

ఐ.పి.ఎల్ జట్టుల్లో మొత్తం 13 మంది శ్రీలంక ఆటగాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో ఇద్దరు కెప్టెన్లు కూడాను. ఆరో అంచె ఐ.పి.ఎల్ క్రీడలకు సంబంధించి 10 మ్యాచులు చెన్నైలో జరగవలసి ఉంది. అందులో ఎనిమిది లీగ్ మ్యాచ్ లు కాగా, రెండు ఎలిమినేటర్ మ్యాచ్ లని ది హిందు తెలిపింది. ఈ మ్యాచుల్లో ఇక శ్రీలంక ఆటగాళ్లు ఆడరు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సభ్యులయిన అకిల ధనంజయ, కులశేఖరలు కూడా ఆడరు. శ్రీలంక ఆటగాళ్లు లేని జట్టు ఒక్క కింగ్స్ XI పంజాబ్ మాత్రమే. ఇతర ఎనిమిది జట్టుల్లో ఒకరో, ఇద్దరో శ్రీలంక ఆటగాళ్లు ఉన్నారు. మహేల జయవర్ధనే ఢిల్లీ జట్టుకు కెప్టెన్ కాగా కుమార సంగక్కర హైదరాబాద్ జట్టుకు కెప్టెన్. వీరిద్దరు కూడా చెన్నైలో ఆడబోరు.

“పెప్సి ఐ.పి.ఎల్ 2013 లీగ్ మ్యాచుల్లో శ్రీలంక ఆటగాళ్లు పాల్గొనకూడదని ఐ.పి.ఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ రోజు మధ్యాహ్నం జరిపిన సమావేశంలో నిర్ణయించింది. తొమ్మిది ఫ్రాంచైజీలకు తదనుగుణంగా సలహా ఇవ్వనున్నాము… ఇది గత వారం శ్రీలంక ప్రభుత్వం తమిళనాడులో పర్యటించేటప్పుడు జాగ్రత్తతో ఉండాలంటూ తమ దేశీయులకు ఇచ్చిన ట్రావెల్ అడ్వైజరీకి అనుగుణంగా తీసుకున్న

Source: The Hindu (Click to enlarge)

Source: The Hindu (Click to enlarge)

నిర్ణయం… ఈ రోజు గౌరవనీయులు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, గౌరవనీయులు ప్రధాన మంత్రికి రాసిన లేఖలో శ్రీలంక ఆటగాళ్లను, అంపైర్లను అనుమతించబోమని పేర్కొన్నారు… మేము రెండు అంశాలను ప్రధానంగా పరిగణిస్తున్నాము. (ఒకటి) స్థానికుల భావోద్వేగాలను పరిగణించాలి; (రెండు) అదే సమయంలో శ్రీలంక ఆటగాళ్ల భద్రతకు ప్రాముఖ్యత ఇవ్వాలి” అని రాజీవ్ శుక్లా తన ప్రకటనలో తెలిపారు.

ఇదిలా ఉండగానే తమ దేశ ఆటగాళ్లు చెన్నైలో ఆడబోరని శ్రీలంక క్రీడల మంత్రి మహిందానంద అలుత్గమాగే ప్రకటించాడు. బి.సి.సి.ఐ గానీ, భారత ప్రభుత్వం గానీ తమ ఆటగాళ్లకు భద్రత ఇవ్వలేని పక్షంలో చెన్నైలో ఆడవద్దని తమ ఆటగాళ్లకు సలహా ఇస్తామని ఆయన తెలిపాడు. “మా ఆటగాళ్లకు భద్రత ఇవ్వగలరా లేదా అని అడుగుతూ మేము బి.సి.సి.ఐకి లేఖ రాసాము. భారత ప్రభుత్వాన్ని కూడా ఈ మేరకు అడగమని మా విదేశాంగ శాఖను కోరాము. భద్రత ఇస్తేనే మా వాళ్ళు ఆడుతారు” అని మహిందానంద తెలిపాడు.

ఇక ఇప్పుడు ఆటలకూ, విదేశాంగ విధానానికీ ముడి పెట్టవద్దని నీతులు లేదా బోధలు లేదా అలాంటివి ఇంకేమైనా చెప్పే నైతిక హక్కు భారత్ కోల్పోయింది. భారత దేశంలో ఇక అలాంటి అంశం గురించి మాట్లాడుకోవడమే దండుగ కావచ్చు. ఆటల ఉద్దేశం స్నేహ సంబంధాలు పెంచుకోవడమే అయితే అలాంటి ఉద్దేశాలను వ్యక్తం చేయడంలో భారత్ గొంతు ఇక బలహీనపడుతుంది.

ఆటలకు ఇంతటి విలువ ఇవ్వడంలోనే అసలు తంటా వచ్చిపడింది. రాజకీయ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి కూడా క్రికెట్ ఆటలు వేదికలుగా మారాక ఇక ఎన్ని మాట్లాడుకుని ఏమి ప్రయోజనం? క్రికెట్ ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్ మ్యాచ్ కి భారత్, పాక్ దేశాల ప్రధాన మంత్రులు, రాజకీయ ప్రముఖులు స్వయంగా వచ్చి చప్పట్లు కొడుతూ తెచ్చిపెట్టుకున్న హావభావాలు ఒలికించేంతగా నేడు ఉపఖండంలో క్రికెట్ ఆట చేరుకుంది.

పశ్చిమ దేశాల్లో ఫుట్ బాల్ లీగ్ మ్యాచుల్లో సైతం అభిమానులు రక్తాలు చిందించుకుంటూ ముష్టి యుద్ధాలకు దిగితే ఔరా, ఇదేమి చోద్యం అని నోరెళ్ళబెట్టాం. ఉపఖండంలోని దేశాల మధ్య మళ్ళీ అదే స్ధాయిలో కిరి కిరి పెడుతున్న క్రికెట్ ఆటను చూసి నోరెళ్ళబెట్టడం ఇపుడు పశ్చిమ దేశాల వంతు కాబోలు. జనాన్ని ఇంత మత్తులో జోగేలా చేయగల మహత్తు క్రికెట్ కు ఉందని గ్రహించే అమెరికా కూడా ఇప్పుడు కిరి కిరి క్రికెట్ లో ఓనమాలు దిద్దుతోంది. చైనా కూడా దిగితే ఇక ప్రపంచ శిబిరాల స్థాయికి క్రికెట్ చేరుకోవడం ఎంతసేపని?

వ్యాఖ్యానించండి